ప్రతివారం కూడా ఓటీటీలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ ‘సెంబి’. 80, 90ల్లో తెలుగులో పలు సినిమాల్లో నటించి లేడీ కమెడియన్ గా చాలా ఫేమ్ తెచ్చుకున్న కోవై సరళ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. డిసెంబరు చివర్లో థియేటర్లలో రిలీజైన ఈ తమిళ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
అరకులో ఓ కొండపై వీరతల్లి(కోవై సరళ) అనే వృద్ధురాలు.. తన మనవరాలు సెంబి(బేబీ నిలా)తో కలిసి జీవిస్తూ ఉంటుంది. సెంబికి తల్లితండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ అయిన వీరతల్లి, ఈ పాపని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది. రోజు గడవడం కోసం కొండల్లో దొరికే తేనె, పక్షుల గుడ్లు తదితరు వస్తువుల్ని సేకరించి అమ్మి జీవనం సాగిస్తుంటారు. అలా ఓ రోజు తేనె నింపిన కుండని అమ్మడానికి సెంబి వెళ్తుంది. అయితే దారి మధ్యలో ముగ్గురు కుర్రాళ్లు ఆమెని దారుణంగా అత్యాచారం చేసి వెళ్లిపోతారు. ఇంతకీ ఆ కుర్రాళ్లు ఎవరు? అమ్మమ్మ తప్ప అసలు ఎవరూలేని సెంబికి న్యాయం జరిగిందా? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే మూవీ చూసేయాల్సిందే.
నిద్రలేచిన దగ్గర నుంచి మనం రోజూ టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియాలో అత్యాచారం గురించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. నెలల పసిబిడ్డ నుంచి పండు ముసలివాళ్ల వరకు రేప్ కు గురవుతూనే ఉన్నారు. అయితే జరిగిన వెంటనే అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు కానీ వాళ్లకు న్యాయం జరిగిందా లేదా విషయాల్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. ఇక రేప్ చేసిన వాళ్లు డబ్బున్నవాళ్లు, రాజకీయ నాయకులు పిల్లలు, సెలబ్రిటీలు అయితే.. ఆయా కేసులు ఏళ్లకు ఏళ్లకు కోర్టుల్లో వాయిదాలు పడుతూనే ఉంటాయి తప్ప ఒక్క ఇంచు కూడా ముందుకు కదలవు. ఇక ఈ సినిమాలోనూ అలాంటి ఓ పాయింట్ నే టచ్ చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, దాని ఆవశ్యకత లాంటి విషయాల్ని ఈ మూవీలో ప్రస్తావించారు.
ఓ పదేళ్ల గిరిజిన పాపపై రేప్ జరిగితే.. న్యాయం చేసే విషయం ఆలోచించకుండా.. పోలీసుల దగ్గర నుంచి పొలిటిషన్స్ వరకు దాన్ని ఎలా రాజకీయం చేయాలని చూస్తారు. తమ పదవులు కాపాడుకునేందుకు సదరు రేప్, అది జరిగిన మనుషులపై ఎలాంటి పుకార్లు క్రియేట్ చేస్తారనేదాన్ని చాలా చక్కగా చూపించారు. అలానే అత్యాచారం జరిగిన తర్వాత ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎవరివల్లో తెలిసిన విషయాల బట్టి ఎలా మారిపోతుంది? ప్రజలు ఐకమత్యంగా ఉంటే న్యాయాన్ని సమస్యని ఎలా అధిగమించొచ్చు అనే పాయింట్స్ బాగా ప్రెజెంట్ చేశారు. లాయర్లకే కాకుండా ప్రజలకు కూడా చట్టాలు గురించి తెలిస్తే.. తమను తాము ఎలా కాపాడుకోవచ్చనేది ఇందులో చూపించారు.
ఇక గిరిజన బాలికకు జరిగిన ఓ విపత్కర పరిస్థిని అంతే సీరియస్ గా చెప్పి ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండేది. కానీ సెంబికి సహాయం చేయడానికి వచ్చిన ఓ లాయర్.. అదేనండి హీరోను హైలైట్ చేస్తూ, ఎలివేట్ చేయడంతో స్టోరీ అక్కడక్కడా పక్కదారి పట్టినట్లు అనిపించింది. ఇక వాస్తవాన్ని అంతే వాస్తవంగా చూపించి ఉంటే మాత్రం ఈ మూవీ మరో సామాజిక కథాంశం ఉన్న అద్భుతమైన సినిమా అయి ఉండేది. ఇక చివర్లో క్లైమాక్స్ అయితే ఎందుకో కాస్త కృత్రిమంగా అనిపించింది. ఓ సీన్ లో అయితే నిద్రలో నుంచి హఠాత్తుగా లేచిన సెంబి.. ‘ఎందుకు అమ్మమ్మ ఆ అన్నయ్యలు నాతో గొడవపడ్డారు’ అని అంటుంది. అక్కడ జరిగింది అత్యాచారం అని కూడా తెలియనంత అమయకురాలు సెంబి.
ఇక రేప్, న్యాయం కోసం పోరాటం అనే అంశంపై సినిమా తీసినప్పటికీ.. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అనేదాన్ని కూడా చాలా రియలిస్టిక్ గా చూపించినట్లు అనిపించింది. ఓ సీన్ లో భాగంగా బస్ ఎక్కిన పోలీస్ నార్మల్ కీప్యాడ్ ఫోన్ ఉంటుంది. అదేంటి స్మార్ట్ ఫోన్ లేదా అని కండక్టర్ అడగ్గానే.. తన మూడు ఫోన్లు పోలీస్ స్టేషన్ లోనే కొట్టేశారంటూ(దొంగిలించారు) చెబుతాడు. దీన్నిబట్టి పోలీసులకే రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ప్రస్తావించారు. మరో సీన్ లో అయితే సెంబిని కిడ్నాప్ చేయడానికి దొంగ పోలీసులు బస్ ఎక్కుతారు. నానా రచ్చ చేస్తుంటారు. బస్ లో ఉన్నవాళ్లందరూ దొంగ పోలీసులని ఎదురిస్తుంటే.. అప్పటికే బస్ లో ఉన్న నిజమైన పోలీస్ కానిస్టేబుల్ మాత్రం తీరిగ్గా క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. వాళ్లు వెళ్లిపోయిన మాటలు మాత్రం చాలా చెబుతాడు. ఇక ఎన్నికల టైంలో సెంబి ఇన్సిడెంట్ జరిగేసరికి దాన్ని రాజకీయంగా వాడుకుని గెలుపు సాధించాలని ఓ నాయకుడు ప్రయత్నిస్తాడు. ఇలా మంచి స్టోరీ ఎంచుకున్నప్పటికీ.. కొన్నిచోట్ల ఎందుకో తడబడినట్లు అనిపించింది.
తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ గా తెలిసిన కోవై సరళ.. ఇందులో 60 ఏళ్ల బామ్మగా అది కూడా డీగ్లామర్ రోల్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. స్టార్టింగ్ లో ఈమె పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు కానీ తర్వాత తర్వాత మాత్రం ఈమె యాక్టింగ్ కు స్కోప్ లేకుండా పోయింది. ఇక సెంబిగా చేసిన బేబీ నిలా మాత్రం రేప్ జరిగిన పాపగా బాగా చేసింది. కొన్నిచోట్ల ఎక్స్ ప్రెషన్స్ బాగా పలికించింది. ఇక సెంబికి సహాయపడే లాయర్ పాత్రలో నటించిన అశ్విన్ కుమార్ బాగానే చేశాడు. ఇక మిగిలిన వాళ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయానికొస్తే.. ప్రారంభ సీన్స్ లో కొండలు, ఘాట్ రోడ్స్, అరకు అందాలు చాలా చక్కగా చూపించారు. ఇక స్టోరీ బస్ లోకి షిప్ట్ అయిన తర్వాత వేరే లోకేషన్స్ చూపించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. డబ్బింగ్ పాటలు ఎందుకో అంతగా సినిమాకు సెట్ కాలేదనిపించాయి. చివరగా డైరెక్టర్ ప్రభు సోల్మన్ గురించి కాస్త చెప్పుకోవాలి. మంచి పాయింట్ ని స్టోరీగా అనుకున్నప్పటికీ.. దాన్ని ప్రెజెంట్ చేయడంలో అటూ ఇటూ వెళ్లిపోయి ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెట్టేశాడు. ఫైనల్ గా మాత్రం సాటిస్పై చేసేశాడు. ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఎప్పుడూ చూసేదే.. ఓటీటీలో ఏదైనా సీరియస్ మూవీ చూద్దామనుకుంటే మాత్రం ‘సెంబి’ ట్రై చేయొచ్చు.
చివరగా: ‘సెంబి’.. మంచి ప్రయత్నమే కానీ!
రేటింగ్: 2.5