Sarkaru Vaari Paata Telugu Review: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు అటు క్లాస్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. మాస్ లో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. క్లాస్, మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మహేష్ గత కొన్నేళ్లుగా తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. శ్రీమంతుడు మూవీ నుండి సరిలేరు నీకెవ్వరూ సినిమా వరకూ వరుస బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న మహేష్.. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయాడు. దాదాపు రెండేళ్లుగా మహేష్ నుండి సినిమా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ నిరీక్షణ ఎట్టకేలకు మే 12న ఫలించింది.
గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట.. టైటిల్, పోస్టర్స్ నుండి ట్రైలర్, సాంగ్స్ అన్నీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మహేష్ ఎనర్జీ చూసాక, పోకిరి రోజులను గుర్తుచేశాయని మహేష్ కూడా చెప్పడంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. అందులోను మహేష్ సరసన కీర్తిసురేష్.. తమన్ సంగీతం.. ఇలా సర్కారు వారి పాటకు అన్నీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. మరి వరుస బ్లాక్ బస్టర్స్ లో ఉన్న మహేష్ బాబుకు ‘సర్కారు వారి పాట’ ఎలాంటి ఫలితం తీసుకొచ్చింది? మొదటినుండి మహేష్ వేషభాషలతో హైప్ సృష్టించిన డైరెక్టర్ పరశురామ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడా లేదా రివ్యూలో చూద్దాం.
కథ:
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మహేష్(మహేష్ బాబు).. పెద్దయ్యాక అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. తన లైఫ్ లో జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ కారణంగా.. తన దగ్గర అప్పు తీసుకున్నవాళ్లు ఎలాంటివారైనా, తీసుకున్న అప్పు ఎంతైనా వడ్డీతో సహా వసూలు చేయకుండా వదలడు. అప్పు వసూల్ చేసే విషయంలో ఏమాత్రం రాజీపడడు. అయితే.. అలా వడ్డీ వ్యాపారంతో సాగిపోతున్న మహేష్ లైఫ్ లోకి పైచదువుల కోసం అమెరికా వెళ్లిన కళావతి(కీర్తిసురేష్) పరిచయం అవుతుంది. ఎవరినీ ఈజీగా నమ్మని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పారేసుకుని.. ఆమె అడిగింత డబ్బు అప్పుగా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత కళావతి గురించి మహేష్ కి ఓ షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. అనంతరం అప్పు తిరిగివ్వడానికి కళావతి నిరాకరిస్తుంది. లాభంలేదని వైజాగ్ లో ఉన్న కళావతి తండ్రి, ఎంపీ రాజేంద్రనాథ్(సముద్రఖని) వద్దకు వెళ్తాడు. ఇక్కడ తండ్రి కూడా మొరాయించేసరికి మహేష్ ఓ సెన్సేషనల్ అనౌన్స్ మెంట్ చేస్తాడు. మరి ఇంతకీ మహేష్ అప్పు తీరిందా లేదా? ఎలా వసూల్ చేశాడు? మహేష్ కి, ఎంపీకి మధ్య వైరం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? చివరిగా మహేష్ ఏం సందేశం అందించాడు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
బ్యాంకు నేపథ్యంలో జరుగుతున్న ఓ సమకాలీన సమస్యను గుర్తుచేస్తూ సాగే సినిమా ఈ సర్కారు వారి పాట. మధ్యతరగతివారు బ్యాంకు రుణాలు, చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. బ్యాంకు లావాదేవీల విషయంలో డబ్బున్నవారి ప్రభావం ఎలా ఉంది? అనేది ఈ కథతో చెప్పేందుకు ట్రై చేశాడు దర్శకుడు. కానీ ఈ సినిమా కథకు, బ్యాంకు వ్యవస్థలో జరుగుతున్న సంఘటనలను ముడిపెట్టిన విధానమే సరిగ్గా అతకలేదు. మహేశ్ చిన్ననాటి గతంతో సినిమా మొదలై.. ఆ తర్వాత కథ అమెరికాలోకి వెళ్తుంది. అక్కడే మహేశ్, స్టూడెంట్ కళావతి క్యారెక్టర్స్ పరిచయమవుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలతో సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుంది. అలాగే మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, ఫైట్లు ఆకట్టుకుంటాయి.
ఫస్ట్ హాఫ్ అంతా అలా సరదాగా సాగిపోతుంది. కళావతిగా కీర్తి సురేష్ తన ఇన్నోసెంట్ అందంతో కట్టిపడేస్తుంది. సినిమాలో మహేష్ బాబుకు తగిన జోడీ అనిపించింది. మహేష్ గ్లామర్, డైలాగ్ డెలివరీ ఓ రేంజిలో అలరిస్తాయి. కట్ చేస్తే.. కళావతి తండ్రి దగ్గర అప్పు వసూల్ చేయడం కోసం మహేష్ వైజాగ్ చేరుకోవడం నుండి సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. పదివేల డాలర్లు వసూలు చేయడానికి వచ్చి.. పదివేల కోట్లు చెల్లించాలనే హీరో ఇచ్చే ట్విస్ట్ చూసి షాక్ అవ్వొచ్చు. అందులో లాజిక్ లేకపోయినా హీరో క్యారెక్టరైజేషన్ అలాంటిది కాబట్టి అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఎందుకంటే.. పది రూపాయల కోసం కూడా ఎక్కడికైనా వస్తా అనేది హీరో నైజంగా చూపించాడు దర్శకుడు. సెకండాఫ్ లో లాజిక్ లేకుండా సాగే సన్నివేశాలు అక్కడక్కడా కనిపిస్తాయి. దేశంలో ఉన్న అతిపెద్ద బ్యాంకు కుంభకోణాల సమస్యను.. అప్పు వసూల్ చేసుకోవడానికి వచ్చిన హీరో క్యారెక్టర్ కి.. లింక్ చేసిన విధానం సరిగ్గా కుదరలేదు. కమర్షియల్ సినిమా అనుకొని చూస్తే ఇలాంటి లాజిక్స్ పట్టించుకునే అవసరం లేదనే చెప్పాలి.
బలమైన పాయింట్ అనుకున్నప్పటికి పరశురామ్ కథకు పూర్తి న్యాయం చేయలేకపోయాడు. మహేష్ ని ఎలివేట్ చేసే క్రమంలో కథాకథనాలను మిస్ చేసినట్లు అర్థమవుతుంది. సెకండాఫ్ లో విలన్ రాజేంద్రనాథ్ బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడినప్పుడే ఈ కథ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు గెస్ చేయగలుగుతారు. సినిమాలో పరశురామ్ మ్యాజిక్ స్క్రీన్ ప్లేలో కనిపించదు.. కానీ డైలాగ్స్ లో కనిపిస్తుంది. అయితే సెకండాఫ్ లో మహేష్ – కీర్తిల మధ్య కాంబినేషన్ సీన్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ సినిమాలో ఇఎమ్‌ఐల గురించి, బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఘోరాలను చూపిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. మహేష్ అభిమానులకు కావాల్సిన అన్నీ మాస్, క్లాస్ అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇక మహేష్, కళావతిల డాన్స్ అదిరిపోయింది.
ఎవరెలా చేశారంటే:
మహేశ్‌బాబు మరోసారి తన టైమింగ్.. స్టైల్, కామెడీ, ఫైట్స్ ఇలా అన్నివిధాలా మెస్మరైజ్ చేశాడు. కళావతి పాత్రలో కీర్తిసురేష్ అల్లరి, అమాయకత్వం ఆకట్టుకుంటాయి. పాటలలో, సన్నివేశాలలో మహేష్ గ్లామర్ ని మ్యాచ్ చేసేందుకు ట్రై చేసింది. అయితే.. సెకండాఫ్ లో కీర్తి క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. విలన్ గా సముద్రఖని పరవాలేదనిపించాడు. కానీ సినిమాకు మేజర్ ప్లస్ లలో వెన్నల కిషోర్, సుబ్బరాజు పాత్రలుంటాయి. ఇతర పాత్రలలో నదియా, తనికెళ్ల భరణి, నాగబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. టెక్నీషియన్స్ లో మది సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఊపు తీసుకొస్తాయి. దర్శకుడు పరశురామ్ డైలాగ్స్ బాగున్నాయి. కానీ దర్శకుడిగా క్యారెక్టర్స్ పై పెట్టిన ఫోకస్ స్క్రీన్ ప్లే లో లోపించిన ఫీలింగ్ కలిగించాడు. మైత్రి మూవీస్, 14 రీల్స్, జిఎంబి ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి మహేష్ గ్లామర్, టైమింగ్ పై ఫోకస్ పెట్టిన మూవీనే సర్కారు వారి పాట.
ప్లస్ లు:
మహేష్ యాక్షన్, టైమింగ్, డాన్స్
కామెడీ
స్టోరీ పాయింట్
హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ
మైనస్ లు:
స్క్రీన్ ప్లే
అక్కడక్కడా లాజిక్ మిస్ అయిన సీన్స్
చివరిమాట: మహేష్ బాబు వన్ మ్యాన్ షో.. ఫ్యాన్స్ కి పండగే!
రేటింగ్: 2.75/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.