Saakini Daakini Telugu Movie Review: గార్జియస్ బ్యూటీస్ రెజీనా, నివేదా థామస్ లు నటించిన లేడీ మల్టీస్టారర్ మూవీ శాకిని డాకిని. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ అయ్యింది. మిడ్ నైట్ రన్నర్స్ అనే సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వచ్చింది. శర్వానంద్ తో రణరంగం సినిమాతో ప్లాప్ అందుకున్న సుధీర్ వర్మ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు సినిమా తర్వాత రెజీనాకి తెలుగులో ఆ రేంజ్ హిట్ లేదు. నివేదా థామస్ కి కూడా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హిట్ అవ్వడం అటు దర్శకుడికి, ఇటు ఈ ముద్దు గుమ్మలకి కూడా బాగా అవసరం. సినిమా హిట్ అవుతుందనే హీరోయిన్స్ ఇద్దరూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు. దీంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం.
దామిని (రెజీనా), షాలిని (నివేదా) ఇద్దరూ పోలీస్ ట్రైనింగ్ కోసం పోలీస్ అకాడమీలో జాయినవుతారు. అయితే ఇద్దరికీ అహం ఎక్కువ. ఇద్దరికీ అస్సలు పడేది కాదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు అవుతుండేవి. ప్రతీ చిన్న విషయంలోనూ గొడవ పెట్టుకునేవారు. అలాంటి అహంకారీమణులిద్దరూ అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం చూస్తారు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పినా పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు వేరే పెద్ద వాళ్ళ కేసుతో సతమతమవుతున్నారు. దీంతో దామిని, షాలిని ఇద్దరూ ఈ కేసుని సాల్వ్ చేయాలనుకుంటారు. అఫీషియల్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అయితే ఈ కిడ్నాప్ వెనుక పెద్ద క్రైమ్ జరుగుతుందని తెలుసుకుంటారు. ఆ క్రైమ్ ని ఈ ట్రైనీ పోలీసులిద్దరూ ఎలా వెలుగులోకి తీసుకొస్తారు? ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఏంటి? అనేది కథ.
విశ్లేషణ:
ఇటు రెజీనా, అటు నివేదా ఇద్దరూ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్సే. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కి అంత పెద్ద స్కోప్ లేదు. కానీ కంటెంట్ కి తగ్గట్టు ఇద్దరూ బాగా నటించారు. ఇక పోలీసులుగా కనబడేందుకు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. పోరాట సన్నివేశాల్లో ఇద్దరూ చేసిన స్టంట్స్ ఆకట్టుకుంటాయి. ఇక కమెడియన్స్ పృథ్వీరాజ్, సుధాకర్ రెడ్డి, రఘుబాబుల కామెడీ ఆకట్టుకుంటుంది. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ మూవీని తెలుగులో శాకిని డాకినిగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఒరిజినల్ వెర్షన్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చారు.
స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేశారు. మామూలుగా ఒరిజినల్ వెర్షన్ ని మారిస్తే చెడగొట్టారన్న అపకీర్తి నెత్తినేసుకుంటారు. కానీ ఈ విషయంలో దర్శకుడు సుధీర్ వర్మ మాత్రం అబ్బా సాయిరాం అనిపించారు. స్క్రీన్ ప్లేని మార్చినా గానీ కథని నెరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలన్నాక లాజిక్ లు మిస్ అవ్వడం సహజం కాబట్టి ఈయన కూడా కొన్ని చోట్ల లాజిక్ లు మిస్ చేశారు. దీంతో మూవీ బిస్కెట్ అయినట్టు అనిపిస్తుంది. అసలు దామిని, షాలిని ఇద్దరమ్మాయిలు పోలీస్ అకాడమీలో ఎలా చేరారు? ఎందుకు చేరారు? అనేది విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. చిన్న సినిమా కాబట్టి నిర్మాణ విలువలు పర్లేదు, బాగున్నాయి. ఉన్నంతలో బాగా నిర్మించారు.
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.