ఈ మధ్యకాలంలో రెగ్యులర్ లవ్ స్టోరీస్, మాస్ మసాలా సినిమాలకంటే వినూత్నమైన కంటెంట్ బేస్డ్ సినిమాలను జనాలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను.. ప్రేక్షకులను ఎంగేజింగ్ గా సీట్స్ లో కూర్చోబెట్టే సినిమాలను బాగా జనాలు బాగా ఆదరిస్తున్నారు. తాజాగా మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన ‘రోషాక్’ సినిమా ఓటిటి రిలీజ్ అయ్యింది. గత నెలలో థియేట్రికల్ రిలీజై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులో ఓటిటి స్ట్రీమింగ్ అవుతోంది. సైకో థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను నిషమ్ బషీర్ రూపొందించగా.. మమ్ముట్టినే నిర్మించడం విశేషం. ఇక తాజాగా రోషాక్ మూవీ.. డిస్నీ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అయ్యింది. మరి రోషాక్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
NRI ల్యూక్ ఆంటోని(మమ్ముట్టి) తన భార్యతో కలిసి కేరళ టూర్ కి వస్తాడు. అడవి మార్గంలో వెళ్తుండగా కారుకి యాక్సిడెంట్ అవ్వడంతో స్పృహతప్పి పడిపోతాడు. లేచేసరికి భార్య కనిపించకపోవడంతో.. తన భార్య కనిపించడం లేదని దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. అయితే.. తన భార్య విషయంలో పోలీసులు ఎలాంటి ఆచూకీ దొరకలేదని చెప్పడంతో.. స్వయంగా తానే రంగంలోకి దిగుతాడు ఆంటోని. అప్పటినుండి అడవిలోనే ఉంటాడు. దీంతో ఆంటోని బిహేవియర్ పై అనుమానం మొదలైన పోలీసులు ఇతని గురించి ఆరా తీయడం మొదలుపెడతారు. మరి ఆంటోనీ భార్య ఏమైపోయింది? అసలు ఆంటోని కేరళకు ఎందుకొచ్చాడు? పోలీసులు ఆంటోనిని ఎందుకు అనుమానిస్తారు? చివరికి ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.
సాధారణంగా సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీస్ లో మంచి కథ, ట్విస్టులు.. పెద్దగా డైలాగ్స్ లేని యాక్షన్.. ఉత్కంఠరేపే నేపథ్య సంగీతం.. మధ్యమధ్యలో విజువల్స్ తో మాయచేసే కెమెరా వర్క్.. ఇవి కుదిరితే చాలు అనిపిస్తుంది. కానీ.. వీటన్నింటిని మించి సస్పెన్స్ లేదా క్రైమ్ థ్రిల్లర్స్ కి కావాల్సింది స్క్రీన్ ప్లే. సన్నివేశాలలో ఎంత మ్యాటర్ ఉన్నా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయగలిగితే సినిమా చూసిన ఫీల్ ప్రేక్షకుడిలో మాములుగా ఉండదు. ఈ జానర్ సినిమాలలో డార్క్ ఫ్రేమ్స్.. ఎక్కువగా కనిపించి ఒక్కసారిగా క్యారెక్టర్ లేదా ఆబ్జెక్ట్ ప్రత్యక్షం అవ్వడం థ్రిల్ ని కలిగిస్తాయి. కానీ, అవన్నీ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో చూసేశారు.
ఈ రోషాక్ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే షార్ప్ సినిమా. మెగాస్టార్ మమ్ముట్టి సినిమా అంటే దక్షిణాది ప్రేక్షకులంతా ఆసక్తి కనబరుస్తుంటారు. హీరోగా నటిస్తూ.. మమ్ముట్టినే ఈ సినిమాను నిర్మించాడంటే అంతలా ఏముందబ్బా అనుకుంటారు. కానీ.. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా ప్రారంభమే పోలీస్ స్టేషన్ సీన్ తో ఉంటుంది. ఎన్ఆర్ఐ ఆంటోని కేరళకు రావడం.. అడవి మార్గంలో వెళ్తుండగా కారు యాక్సిడెంట్ అవ్వడం.. ఆ తర్వాత భార్య కనిపించకపోవడం.. అక్కడినుండి భార్య కోసం అన్వేషణ అనేది ఆసక్తి రేపుతూ కథలోకి తీసుకెళ్తాయి. అయితే.. సినిమా స్టార్టింగ్ అదిరిపోయినా అసలు కథలోకి వెళ్లేందుకు చాలా టైమ్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది.
ఒక మనిషి తనకు బాగా దగ్గర మనిషిని కోల్పోతే ఎలాంటి మధన పడతాడో ఆ సన్నివేశాలు బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత అడవిలో హీరో ఇల్లు కొనుక్కోవడం.. ఆ ఇంటి యజమాని చనిపోవడంతో కథలో ఉత్కంఠ రేగుతుంది. ఆ యజమానిని ఆంటోని చంపాడా లేక వేరే ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే డౌట్ రాకమానదు. అయితే.. ఇలాంటి థ్రిల్లింగ్ సీన్స్ చాలా ఉన్నప్పటికీ.. ఎక్కడో ఇంకా క్లారిటీ మిస్ అవుతుందని అనిపించవచ్చు. ఎందుకంటే.. దర్శకుడు స్క్రీన్ ప్లేని రెండు యాంగిల్స్ లో ప్రెజెంట్ చేసేసరికి ఆడియెన్స్ లో పలు సందేహాలు కలగవచ్చు. ఇక ఇంటరెస్టింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది.
సెకండాఫ్ కి వచ్చేసరికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. క్లైమాక్స్ మాత్రం ఎందుకో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే.. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో దర్శకుడు కొన్ని చిక్కుముడులను క్లియర్ చేయలేదేమో అనిపిస్తుంది. అయితే.. మనుషులు ఎలా ఆలోచిస్తారు? సందర్భాలు, పరిస్థితులు బట్టి ఎలా బిహేవ్ చేస్తారు? వారి లైఫ్ లో ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది? అనేవి బాగా స్టడీ చేశాడు దర్శకుడు. ఇక సైకో థ్రిల్లర్ కి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో న్యాయం చేశాడు మిథున్ ముకుందన్. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే.. ఎడిటర్ సినిమా లెన్త్ ఇంకాస్త తగ్గిస్తే బాగుండు అనిపిస్తుంది.
ఈ సినిమాకు హీరో కం నిర్మాత మమ్ముట్టి.. చాలా రోజుల తర్వాత వన్ మ్యాన్ షో చేశాడు. డిఫెరెంట్ వేరియేషన్స్ ఉన్న ల్యూక్ ఆంటోని క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలలో బిందు ఫణికర్, షరఫుద్దీన్ అందరూ న్యాయం చేశారు. రైటర్ సమీర్ అబ్దుల్ సినిమాపై చాలా స్టడీ చేసి రాశాడు. ఇక దర్శకుడు నిషమ్ బషీర్ టేకింగ్ కొత్తగా అనిపించినా.. స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా తడబడినట్లు అనిపిస్తుంది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటిటి ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు బాగానే ఉన్నాయి.