మనలో చాలామందికి సినిమాలు అంటే ఇష్టమే. కానీ ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ మూవీస్ చూస్తుంటారు. అయితే చాలామందికి మాత్రం థ్రిల్లర్ జానర్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే అలాంటి చిత్రాలు ఓటీటీలో ఏమేం ఉన్నాయా అని చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం కూడా కచ్చితంగా ఒకటో రెండో సినిమాలు పలు ఓటీటీల్లో రిలీజ్ అవుతూనే ఉంటాయి. ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అలా తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చిన చిత్రం ‘రిపీట్’. నవీన్ చంద్ర హీరోగా చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటి అనేది రివ్యూలో చూద్దాం.
సుబ్రహ్మణ్యం(అచ్యుత్ కుమార్) అర్థరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. తనని తాను రైటర్ గా పరిచయం చేసుకుంటాడు. తను రాసిన స్టోరీల్లోని పాత్రలు, నిజంగా వచ్చి తనని బెదిరిస్తున్నాయని చెబుతాడు. తాగి వాగుతున్నాడని పోలుసులు పెద్దగా పట్టించుకోరు. ఇక తెల్లారేసరికి DGP ఆశా ప్రమోద్(మధుబాల) కూతురు పూజ(స్మృతి వెంకట్) కనిపించట్లేదని తెలుస్తుంది. ఈ కేసుని ఎవరికీ తెలియకుండా ఇన్వెస్టిగేట్ చేయమని ACP విక్రమ్ కుమార్(నవీన్ చంద్ర)కు అప్పగిస్తారు. అయితే సుబ్రహణ్యంకు.. ఈ కేసుకు సంబంధం ఏంటి? ఏడాది క్రితం ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం జరిగిన స్థలంలో ఆశా బ్యాగ్ ఎందుకు దొరికింది? మిస్సింగ్ కేసు ఏమైంది? చివరకు విక్రమ్.. కేసు సాల్వ్ చేశాడా లేదా అనేది తెలియాలంటే మీరు కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
‘రిపీట్’ ఓ రివేంజ్ థ్రిల్లర్ సినిమా. ఇది చాలామందికి తెలిసిన కథే అయినప్పటికీ, డైరెక్టర్ కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో అతడిని కచ్చితంగా అభినందించి తీరాలి. మూవీ మొదలైన గంట వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే తొలి గంటలోనే.. తర్వాత ఏం జరుగుతుంది? అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఎందుకు చేసి ఉంటారు? లాంటి క్వశ్చన్స్.. ప్రేక్షకులని తెగ కంగారు పెడతాయి. ఫస్టాప్ లో చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినా, తప్పులున్నా సరే పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే కథ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఏడాది క్రితం ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగిందని చెబుతారో.. అప్పుడు ఆ కేసుకు, ఈ అమ్మాయి కిడ్నాప్ కు సంబంధం ఉందని చిన్నగా డౌట్ వస్తుంది. ఇక రెగ్యులర్ గా థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి నెక్స్ట్ ట్విస్టులు ఏమేం ఉండబోతున్నాయనేది మెల్లమెల్లగా అర్థమవుతుంది. వారు ఊహించేస్తారు కూడా.
తొలి గంటలో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ‘రిపీట్’ స్టోరీ.. ట్విస్ట్ రివీల్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్ థ్రిల్లర్ టెంప్లేట్ ఫార్మాట్ లో వెళ్తుంది. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి రొటీన్ గా ఎండ్ అయినట్లు అనిపిస్తుంది. అత్యాచార కేసులో పోలీసుల ఒత్తిళ్లకు సైలెంట్ అయిపోవడం, రివేంజ్ తీర్చుకోవడం లాంటివి ఇంతకు ముందే కొన్ని సినిమాల్లో చూసేశాం కదా అని మనకు అనిపిస్తుంది. సినిమా మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఏదో అసంతృప్తిగా అనిపించిందే అని డౌట్ వస్తుంది. కానీ ఓటీటీలో రిలీజ్ కావడం, అది కూడా రెండు గంట్లల్లోనే ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్స్. దానికి తోడు వేరే ఏ జానర్ మూవీస్ చూడకుండా థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మాత్రం.. ఈ సినిమా నచ్చుతుంది.
ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. నవీన్ చంద్ర ఏసీపీగా ఫెర్ఫెక్ గా సెట్ అయిపోయాడు. తన యాక్టింగ్ తో సినిమాలో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా చేశాడు. ఇక డీసీపీగా మధుబాల.. ఆడియెన్స్ ని ఆశ్చర్యపరిచింది. ‘కాంతార’తో ఆకట్టుకున్న అచ్యుత్ కుమార్.. ఇందులో డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించాడు. మిగిలిన పాత్రల్లో సత్యం రాజేశ్, పూజా రామచంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సుదర్శన్.. ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. జిబ్రాన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ముత్తయ్య సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే నవీన్ చంద్ర సీన్స్ తప్పించి మిగతావన్నీ కూడా ‘డెజావు’ సినిమాలోనివే. అది తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ.. తెలుగులోనూ అమెజాన్ ప్రైమ్ లోనే అందుబాటులో ఉంది. ఈ రీజన్ వల్ల.. ‘రిపీట్’ చూస్తున్నప్పుడు కూడా కొన్నిచోట్ల డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అనే డౌట్ వస్తుంది. ఏదైతేనేం… ఈ వీకెండ్ లో ఓ డీసెంట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ లో తాజాగా రిలీజైన ‘రిపీట్’ చూడొచ్చు.
చివరిమాట: థ్రిల్లింగ్ గా అనిపించి రొటీన్ గా ఎండ్ అయ్యే ‘రిపీట్’!
రేటింగ్: 2.5/5
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)