చిత్రపరిశ్రమలో నవలలు, బుక్స్ ఆధారంగా మూవీస్ రావడమనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. చరిత్రలో గొప్ప రచనలుగా ప్రసిద్ధి చెందిన గొప్ప కథలను దర్శకనిర్మాతలు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రముఖ నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా అదే పేరుతో దర్శకుడు మణిరత్నం సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఎపిక్ పీరియడ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి చాలామంది స్టార్స్ నటించారు. డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎపిక్ పీరియడ్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ చిత్రం పొన్నియన్ సెల్వన్ అనే ప్రముఖ నవల ఆధారంగా రూపొందింది. వెయ్యి ఏళ్ల కిందటి చోళరాజ్యం గురించి చెబుతుంది. చోళ రాజ్యాన్ని పాలించే సుందరచోళ రాజు(ప్రకాష్ రాజ్)కు ఇద్దరు కొడుకులు ఆదిత్య కరకాలన్(విక్రమ్), అరుల్మోలి వర్మన్(జయం రవి).. కూతురు కుందవై(త్రిష). సుందరచోళ రాజు అనారోగ్యం పాలవ్వడంతో.. చోళ రాజ్య సింహాసనాన్ని పెద్ద కొడుకు ఆదిత్య కరకాలన్(విక్రమ్)కి అప్పగించాలని చూస్తుంటారు. ఓవైపు ఎప్పటినుండో చోళ రాజ్యాన్ని దక్కించుకోవాలని పలువేట్టరాయ(శరత్ కుమార్) పాండ్య వంశస్థులతో చేతులు కలిపి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. మరి శత్రు సైన్యం నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి యువరాజులు ఆదిత్య కరకాలన్, అరుల్మోలి వర్మన్, కుందవై ఏం చేశారు? మధ్యలో నందినీ(ఐశ్వర్య రాయ్), వంధ్యదేవుడు(కార్తీ), సముద్రకుమారి(ఐశ్వర్యలక్ష్మీ)ల పాత్రలేంటి? ఆ తర్వాత చోళరాజ్యంలో ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.
‘పొన్నియన్ సెల్వన్’ మూవీ అనౌన్స్ మెంట్ అయినప్పటి నుండి ఈ సినిమాను తమిళ బాహుబలిగా భావిస్తున్నారు కోలీవుడ్ ప్రేక్షకులు. తెలుగు వాళ్లకు బాహుబలి, కన్నడ వాళ్లకు కేజీఎఫ్ లాగా తమిళం వారు పొన్నియన్ సెల్వన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్నారు. అదిగాక దర్శకుడు మణిరత్నం.. లైకా ప్రొడక్షన్స్.. స్టార్ కాస్ట్ ఉండేసరికి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రసిద్ధ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. చోళ రాజ్యాన్ని గురించి చూపిస్తుంది. డైరెక్టర్ మణిరత్నం ఎంతో కసితో.. డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ ని తెరకెక్కించాడు. మణిరత్నం సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో చోళరాజ్యాన్ని.. ఆ రాజుల పరిపాలన, రాజ్యంలో అప్పుడున్న పరిస్థితి గురించి చెబుతూ మొదలవుతుంది. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా పాత్రలను పరిచయం చేస్తూ.. కథలో ఆయా పాత్రలకు ఎంతవరకు సంబంధం ఉంది అనేది క్లియర్ గా చెప్పేశాడు దర్శకుడు. అద్భుతమైన విజువల్స్, మణిరత్నం టేకింగ్, సీన్స్ ని ఎలివేట్ చేసే ప్లీజెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అలా మెల్లగా కథలోకి తీసుకెళ్లారు. కాకపోతే.. పాత్రలను పరిచయం చేయడం కోసం ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏవి ప్లాన్ చేయలేదు మణిరత్నం. క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేయడం కంటే కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు.
అందుకే అక్కడ క్యారెక్టర్స్ లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి ఎంతోమంది స్టార్స్ ఉన్నప్పటికి ఎగిరి గంతేసి విజిల్స్ వేసుకునే సీన్స్, షాట్స్ అయితే లేవు. సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా బాగుంది. అయితే.. భారీ అంచనాలతో హీరోయిక్ ఎలివేషన్స్ కోసం వెళ్లేవారికి షాకింగ్ అనిపించవచ్చు. ఇదిలా ఉండగా.. చోళ రాజ్యంలో రాజు సుందర చోళ అనారోగ్యం పాలవడంతో.. యువరాజులైన ఆదిత్య కరకాలన్, అరుల్మోలి వర్మన్, యువరాణి కుందవైలను తంజావూరుకు రప్పించాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. దీంతో చోళ రాజు వద్దే కోశాధికారిగా ఉంటున్న పలువేట్టరాయ(శరత్ కుమార్), భార్య నందినీ(ఐశ్వర్యరాయ్)తో కలిసి వేసే పన్నాగాలు ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.
ఈ సినిమాలో చోళ యువరాజులు, యువరాణి పాత్రలతో పాటు వానర వంశయోధుడు వంధ్య దేవుడు(కార్తీ) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఎందుకంటే.. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ వంధ్య దేవుడే చోళరాజుల కథలో కీలకధారిగా కొనసాగుతాడు. అందుకే.. ఈ సినిమాలో అందరికంటే కార్తీకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందని చెప్పాలి. ఇక సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. అసలు ఈ సుందర చోళ.. రాజసింహాసనం వెనుక ఏం జరుగుతుంది? ఆదిత్య కరకాలన్, తమ్ముడు అరుల్మోలి వర్మన్, సోదరి కుందవై ఏం చేయబోతున్నారు? అసలు శత్రువులు ఎవరు? ఇంతకీ పొన్నియన్ సెల్వన్ ఎవరు? అనేది చూపించారు. కాకపోతే.. సినిమా బాగున్నప్పటికి కథ, కథనాలు స్లోగా ఉండేసరికి ప్రేక్షకులకు బోర్ ఫీల్ రావచ్చు.
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కథను క్లిష్టంగా కాకుండా.. ఎలాంటి బలమైన మలుపులు పెట్టకుండా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే.. క్లైమాక్స్ కి వచ్చేసరికి విజువల్స్, ట్విస్టులు బాగున్నాయి. ఈ సినిమాలో పాత్రల పేర్లు బాగా గుర్తుంచుకోవాలి. సింక్ మిస్ అయితే.. ఎవరి గురించి చెబుతున్నారో అర్థం కాకపోవచ్చు. ఏదేమైనా సెకండ్ పార్ట్ ఉంది.. కాబట్టి.. మణిరత్నం ఓ మందాకిని అనే క్యారెక్టర్ తో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక సినిమాలో అందరు తమ తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్, జయరాం ఇలా అందరూ మెప్పించారు. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పరవాలేదు.. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఇది మరో బాహుబలి కాలేదు.. కానీ, మంచి కథగా అనిపించుకుంటుంది.
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!)