నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో విడుదలైంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత జ్యో అచ్యుతానంద సినిమా తీశారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో మన ముందుకు వచ్చారు. మరోపక్క నాగశౌర్యకు సరైన హిట్ పడి చాలా రోజులైంది. మరి అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సంజయ్ (నాగశౌర్య) వైజాగ్ లో ఇంజనీరింగ్ కాలేజీలో అనుపమ (మాళవిక నాయర్) కి జూనియర్. తక్కువ సమయంలోనే ఇద్దరూ స్నేహితులు అవుతారు. ఆ తర్వాత ఇద్దరూ మాస్టర్స్ చదువు కోసం యూకే వెళ్తారు. అయితే అనుకోకుండా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే అనుపమ గురించి ఊహించని విషయం సంజయ్ కి తెలుస్తుంది. ఆ కారణం చేత అనుపమ నుంచి కావాలని దూరం అవుతాడు సంజయ్. అసలు అనుపమ సమస్య ఏంటి? సంజయ్ అనుపమకు దూరం ఎందుకు అయ్యాడు? మళ్ళీ ఇద్దరూ కలిశారా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రేమలో పడతారు. ఒక సంఘటన వల్ల విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత వాళ్ళు ఒకరిపట్ల ఒకరికి ప్రేమ చావడం లేదని తెలుసుకుని ఒకటవుతారు. ఈ టైప్ కథలు చాలా సినిమాల్లో చూసాం. అయితే ఒకే కథని ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్ లో చూపిస్తుంటారు. అవసరాల శ్రీనివాస్ కూడా ఇదే ఫార్ములాని వాడారు. కానీ దురదృష్టవశాత్తు సినిమా బెడిసికొట్టింది. ఈ సినిమాలో సంజయ్, అనుపమ ఇద్దరూ తన ప్రేమ విషయంలో తికమక పడతారు. ఇంటర్వెల్ క్లైమాక్స్ లా ఉండడం.. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోకపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తాయి.
ఫస్ట్ హాఫ్ లో ఒక కారణం చేత నాగశౌర్య, మాళవిక ఇద్దరూ దూరమవుతారు. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి వీరిద్దరూ కలుసుకోవాలనుకోవడానికి కారణమయ్యే బలమైన సన్నివేశాలు ఉండవు. సడన్ గా అవసరాల శ్రీనివాస్ మాళవిక జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు. మాళవికకు లైన్ వేస్తుంటాడు. నాగశౌర్య మాజీ రూమ్ మేట్స్ కి పెళ్లి అవుతుంది. ఈ పెళ్ళిలో నీలిమ అనే అమ్మాయి నాగశౌర్యకు పరిచయమవుతుంది. ఈ అమ్మాయి సినిమాలో నాగశౌర్యను మాత్రమే కాదు.. ఆమె సన్నివేశాలు చూసే ప్రేక్షకులను కూడా విసిగిస్తుంది. సినిమా సాగదీతలా అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ ఎంచుకున్న కథ, దర్శకత్వం ఆకట్టుకునే విధంగా ఉండదు ఫస్ట్ హాఫ్ వరకూ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ అనిపిస్తుంది.
నాగశౌర్య అయోమయానికి గురయ్యే యుక్తవయసు కుర్రాడి పాత్రలో బాగా నటించారు. యుక్తవయసు నుంచి పరికపక్వత కలిగిన యువకుడిగా పరిణామం చెందే వివిధ వయసు పాత్రల్లో బాగా నటించారు. అందుకు తగ్గట్టు తనను తాను మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక అనుపమ పాత్రలో మాళవిక నాయర్ ఆకట్టుకుంటుంది. ఆమె నటనతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఏ ఎమోషన్ ని అయినా సహజంగా పండించగల సత్తా మాళవికకు ఉంది. ఇక అవసరాల శ్రీనివాస్ తన పాత్ర మేరకు బాగా నటించారు. మాళవిక రూమ్ మేట్ గా శ్రీ విద్య, నాగశౌర్య గర్ల్ ఫ్రెండ్ గా మేఘ చౌదరి తమ పాత్రల మేరకు బాగా నటించారు.
సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. రెండు పాటలు బాగున్నాయి. డైలాగులు బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అవసరాల శ్రీనివాస్ స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం బాగుండేది
చివరి మాట: ఫలానా ఆడియన్స్ కి నచ్చుతుంది
రేటింగ్: 2/5