ఈ మధ్య కాలంలో తెలంగాణ నేటివిటీతో వచ్చిన చిన్న సినిమాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు మంచి ఆదరణ చూరగొంటున్నాయి. అలాంటి సినిమాల్లో పరేషాన్ ఒకటి. దగ్గుబాటి రానా మెచ్చిన పరేషాన్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఇటీవల కాలంలో ప్రాంతీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అలా వచ్చిన జాతిరత్నాలు, డీజే టిల్లు, బలగం, నాని నటించిన దసరా వంటి సినిమాలు తెలంగాణ నేపథ్యానికి చెందిన సినిమాలే అయినప్పటికీ అన్ని యాసల వారిని మెప్పించింది. సినిమాకి భాషతో సంబంధం లేదని నిరూపించాయి. ఇలాంటి కోవకు చెందిన సినిమానే ‘పరేషాన్’. మసూద సినిమాతో సక్సెస్ అయిన తిరువీర్ నటించిన మరొక సినిమా ‘పరేషాన్’. ఎప్పుడో లాక్ డౌన్ సమయంలో తెరకెక్కిన సినిమా రానా కళ్ళలో పడడం వల్ల ఇప్పుడు విడుదలకు నోచుకుంది. ఈ సినిమా రానాకి నచ్చడంతో తానే ఈ సినిమాకి సమర్పకుడిగా ఉన్నారు. దవడలు నొప్పి పుట్టేలా నవ్వుకున్నానని ఈ సినిమాని ప్రశంసించారు. మరి ఈ సినిమా రానా చెప్పినట్టు అంత బాగుందా? ప్రేక్షకులు ఎంజాయ్ చేసేంత కంటెంట్ ఈ సినిమాలో ఉందా? రివ్యూలో చూద్దాం.
సమర్పణ్ (మురళీధర్ గౌడ్) మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగిగా పని చేస్తుంటాడు. ఇతని కొడుకు ఐజాక్ (తిరువీర్) స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. అయితే తన ఉద్యోగం కొడుక్కి ఇప్పిస్తే బాగుపడతాడని సమర్పణ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. కొడుకు ఉద్యోగం కోసం మధ్యవర్తి పైసలు కావాలంటే.. తన భార్య గాజులు, బంగారం అమ్మి డబ్బు పోగేస్తాడు సమర్పణ్. ఆ డబ్బు మధ్యవర్తికి ఇమ్మని ఐజాక్ కి ఇస్తుంది తల్లి. ఇంతలో స్నేహితులకు ఆపద వస్తే ఆ డబ్బును వారికి ఇస్తాడు ఐజాక్. అదే సమయంలో ఊళ్ళో ఓ పెళ్లి బారాత్ లో శిరీషని (పావని) చూసి ఐజాక్ ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి శారీరకంగా ఒకటవుతారు. కక్కుర్తి పడడం వల్ల శిరీషకు వాంతులవుతాయి. ప్రెగ్నెన్సీ అని తెలియడంతో పరేషాన్ మొదలవుతుంది. ఊళ్ళో ఆసుపత్రికి వెళ్తే అందరికీ తెలిసిపోతుందని హైదరాబాద్ వెళ్లాలని అనుకుంటాడు ఐజాక్. అందుకోసం ఫ్రెండ్ బండి అమ్మి డబ్బు తీసుకుంటాడు. అదే రోజు రాత్రి ఐజాక్ దగ్గర ఉండాల్సిన డబ్బు, స్నేహితుడు కనిపించకుండా పోతాడు. దీంతో మళ్ళీ ఐజాక్, శిరీష పరేషాన్ అవుతారు. డబ్బుతో పారిపోయిన స్నేహితుడు దొరికాడా? ఐజాక్, శిరీషల పరిస్థితి ఏంటి? ఈ గండం నుంచి ఎలా బయటపడ్డారు? అనేది మిగిలిన కథ.
జాతిరత్నాలు, డీజే టిల్లు, బలగం, దసరా, మేమ్ ఫేమస్, ఇప్పుడు పరేషాన్.. ఇలా తెలంగాణ ప్రాంతీయ కథలు ఈ మధ్య కాలంలో బాగా ఆకట్టుకుంటున్నాయి. భావోద్వేగాలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు వంటివి ఈ సినిమాలలో కనబడుతున్నాయి. ఇక పరేషాన్ సినిమా అయితే ఫుల్ కామెడీ సినిమా. ఐజాక్ తన స్నేహితులకు డబ్బులు ఇచ్చి ఇబ్బందుల్లో పడడం, డబ్బులు, స్నేహితుడు కనిపించకుండా పోవడం, స్నేహితుడ్ని వెతుక్కుంటూ వెళ్లడం, హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం కాస్తా చిక్కుల్లో పడేయడం, పొరుగూరి వ్యక్తులతో కొట్లాటలు, మందు సన్నివేశాలు, ఐజాక్ ని తండ్రి కొట్టడం వంటివి నవ్వు తెప్పిస్తాయి. భావోద్వేగం, హాస్యం కలగలిపిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే పదే పదే మద్యం తాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అప్పు తీర్చడానికి డబ్బు లేకపోయినా మందు తాగడానికి మాత్రం డబ్బులు ఎలా వచ్చాయన్న దానికి లాజిక్ కనబడదు. ఇవి మినహాయిస్తే సినిమా మాత్రం వర్తబుల్ అని చెప్పవచ్చు. తెలంగాణ పల్లె వాతావరణం, వారి జీవన విధానాన్ని దర్శకుడు బాగా చూపించారు.
మాసూద సినిమాలో అమాయకపు పాత్రలో మెప్పించిన తిరువీర్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రతో కడుపుబ్బా నవ్వించారు. కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. శిరీష పాత్రలో పావని, సమర్పణ్ పాత్రలో మురళీధర్ గౌడ్ చాలా బాగా ఒదిగిపోయారు. స్నేహితులుగా నటించిన వారంతా తమ తమ పాత్రల్లో బాగా నటించారు. కొత్తవారైనా గానీ అనుభవం ఉన్న నటుల్లా సహజంగా నటించారు.
రూపక్ రోనాల్డ్ సన్ ఎంచుకున్న కథ బాగుంది. వినోదాన్ని జోడించి కడుపుబ్బా నవ్వించారు. తెరకెక్కించిన విధానం బాగుంది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫీ, యశ్వంత్ నాగ్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ లు:
చివరి మాట: పరేషాన్ తో వెళ్తే హ్యాపీగా నవ్వుకుంటూ తిరిగి వస్తారు…
రేటింగ్: 2.5/5