ఒకప్పుడు చిన్న సినిమాలు అంటే ఆదరణ తక్కువగా ఉండేది. ఎవరు చూస్తారులేరా అని అనుకునేవారు. కానీ చిన్న సినిమాలే మంచి కంటెంట్ తో వస్తుండడంతో ప్రేక్షకుల అభిరుచితో పాటు నిర్ణయం కూడా మారింది. చిన్న సినిమాలని కూడా పెద్ద సినిమాల స్థాయిలో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమాల సందడి ఎక్కువైంది. ఆడియన్స్ ని థియేటర్స్ లో కూర్చోబెట్టగలిగే గ్రిప్పింగ్ కంటెంట్ తో వస్తున్నారు యువ దర్శకులు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే పంచతంత్రం. పేరు వింటేనే కడుపు నిండిపోయినట్టు ఉన్న ఈ సినిమాలో బ్రహ్మానందం, స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద తదితరులు నటించారు. ఐదు కథలతో సాగే పంచతంత్రం సినిమాని దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కించగా.. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
వేదవ్యాస్ (బ్రహ్మానందం) రిటైర్డ్ ఉద్యోగి. 60 ఏళ్ల వయసులో కొత్తగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీల్లో పాల్గొంటాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు. ఐదు కథలు పంచేంద్రియాలకు సంబంధించినవి. కన్ను(చూపు), ముక్కు(వాసన), నాలుక(రుచి), చెవి(వినికిడి), చర్మం(స్పర్శ) చుట్టూ తిరిగే కథలు. వాటిలో మొదటిది విహారికి (నరేష్ అగస్త్య) చెందిన కథ. విహారికి కంటి చూపు ఉండదు. బీచ్ ని స్వయంగా తన కళ్ళతో చూడాలనేది విహారి కల. ఆ కల ఎలా నెరవేరింది? అనేది సినిమా చూడాలి. ఇక రెండో కథ సుభాష్ కి (రాహుల్ విజయ్) సంబంధించినది. పెళ్లి పట్ల ఫుల్ క్లారిటీ ఉన్న సుభాష్ కి లేఖ (శివాత్మిక రాజశేఖర్) అనే యువతితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈ క్రమంలో ఒకరి అభిప్రాయాలు ఒకరితో షేర్ చేసుకుంటారు.
సుభాష్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పటి లవ్ స్టోరీని చెప్తాడు. ఆ అమ్మాయితో గడిపిన జ్ఞాపకాలు, ఆస్వాదించిన క్షణాలు ఒక గొప్ప రుచిని మిగిల్చిందని చెప్తాడు. మళ్ళీ ఆ అనుభోతిని లేఖ ద్వారా సుభాష్ ఎలా తిరిగి పొందాడు అనేది రెండో కథ. ఇది రుచి చుట్టూ తిరుగుతుంది. పెళ్లి చేసుకోవాలనుకునేవారు తమ టేస్ట్ ఏంటి? తమకి తగ్గా జోడి ఎవరు అని తెలుసుకోవడం ఎలా అని ఈ కథలో చూపించారు దర్శకుడు. మూడవ కథ రామనాథంకి (సముద్రఖని) సంబంధించినది. రామనాథం రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. ఉన్నట్టుండి అతనికి అకస్మాత్తుగా ఒక వింత వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి కారణంగా అతనికి రక్తం వాసన వస్తుంటుంది. పరిసరాల్లో రక్తపు మరకలు ఏమీ లేకపోయినా గానీ ఆ వాసన వస్తుంటుంది. అదే సమయంలో తన కూతురు డెలివరీ సమయం దగ్గర పడుతుంది.
రామనాథంకి వచ్చే రక్తం వాసనకు, కూతురు డెలివరీకి ఉన్న సంబంధం ఏంటి అనేది మూడవ కథ. వాసన చుట్టూ తిరిగే కథ. నాల్గవ కథ శేఖర్ (వికాస్), దేవి (దివ్య శ్రీపాద) లకు చెందినది. ఈ కథ స్పర్శ చుట్టూ తిరుగుతుంది. భార్య ప్రెగ్నెంట్. ఆమెకు క్యాన్సర్ అని తెలుస్తుంది. భార్యని బతికించుకునే స్థోమత, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహకారం ఉండవు. ఈ క్రమంలో శేఖర్ తీసుకున్న నిర్ణయం ఏంటి? పుట్టబోయే బిడ్డ కోసం దేవి చేసిన త్యాగం ఏంటి అనేది మిగతా కథ. ఇక ఐదవ కథ లియాకి (స్వాతి) చెందినది. ఈ కథ వినికిడి చుట్టూ తిరిగే కథ. అయితే లియా ఒక స్టోరీ టెల్లర్. పాడ్ క్యాస్ట్ లో కథలు చెప్తుంటుంది. ఆమె చెప్పే కథలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఈ అభిమానుల్లో డ్రైవర్ కూతురు ఉంటుంది. ఆ పదేళ్ల అమ్మాయికి, లియాకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పంచతంత్రం పేరులోనే సినిమా కథ ఉంది. ఐదు కథలన్నీ కలిపితే ఒక కథ. ఒకే సినిమాలో నాలుగైదు కథలతో వచ్చే సినిమాలు మన తెలుగులో తక్కువే. ఒకే సినిమాలో ఎక్కువ కథలు చెప్పడం అంటే సాహసమనే చెప్పాలి. అటువంటిది దర్శకుడు హర్ష పులిపాక మొదటి సినిమాతోనే సాహసం చేశారు. పంచేంద్రియాల కాన్సెప్ట్ తో దర్శకుడు రాసుకున్న కథ ఆకట్టుకుంటుంది. ఐదు కథలూ దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. ప్రేక్షకులని భావోద్వేగానికి గురి చేస్తాయి. నిజ జీవితంలో జరిగినట్టు అనిపిస్తుంది. అరె మన జీవితంలో ఇలానే జరిగిందే అనిపించేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయి.
నటీనటుల విషయానికొస్తే.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించారు. కామెడీ క్యారెక్టర్ కి భిన్నంగా వేదవ్యాస్ పాత్రలో నటించారు. లియా పాత్రలో స్వాతి, లేఖ పాత్రలో శివాత్మిక రాజశేఖర్, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిగా సముద్రఖని, అంధుడిగా నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్ తమ పాత్రల మేరకు బాగా నటించారు. ఈ ఐదు కథలని తమకి ఓన్ చేసుకునేలా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. నెరేషన్ స్లోగా సాగుతుంది. కానీ వాసన, స్పర్శ, వినికిడి పాయింట్స్ తో రాసుకున్న కథలు, వాటిని దర్శకుడు డీల్ చేసిన విధానం ప్రేక్షకులకి నచ్చుతాయి. డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ గుండెని పిండేసేలా ఉంటాయి. రాజ్ నల్లి సినిమాటోగ్రఫీ, గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ బాగుంటుంది. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం బాగుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
2.5/5