చిన్న చిత్రంగా విడుదలైన ‘ఓ సాథియా’ ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ఫ్రీగా ప్రివ్యూ వేసినా ఎవరూ రాలేదంటూ వార్తలొచ్చాయి కానీ.. కాస్త టైం కేటాయించి చూస్తే సినిమా ఎలా ఉందనేది తెలిసేది.
ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తూనే ఉంటాయి. ఓటీటీల ప్రభావం వల్ల పెద్ద హీరోల సినిమాలు తప్పితే.. చిన్న సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తక్కువ. ‘సామజవరగమన’ మాదిరి మౌత్ టాక్ వస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది కానీ.. దాదాపుగా చిన్న సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కట్ చేస్తే, ఓ చిన్న చిత్రంగా విడుదలైన ‘ఓ సాథియా’ ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ఫ్రీగా ప్రివ్యూ వేసినా ఎవరూ రాలేదంటూ వార్తలొచ్చాయి కానీ.. కాస్త టైం కేటాయించి చూస్తే సినిమా ఎలా ఉందనేది తెలిసేది. జూలై 7న వచ్చిన ఈ మూవీ రెండో వారంలో థియేటర్లలో ఎక్కడా లేదు కానీ IMDB రేటింగ్స్‌లో 8.3/10 సాధించి ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
బీటెక్ చదువుతున్న అర్జున్ (ఆర్యన్ గౌర), అదే కాలేజీలో చదివే కీర్తి (మిస్తీ చక్రవర్తి)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అర్జున్ అంటే పడని మరో స్టూడెంట్ కూడా లవ్ చేస్తున్నానంటూ కీర్తి వెంటపడుతుంటాడు. అతని టార్చర్ నుండి బయటపడేందుకు అర్జున్‌తో ప్రేమలో ఉన్నట్లు అబద్ధం చెప్తుంది. అలా అర్జున్-కీర్తి బాగా దగ్గరవుతారు. ఓరోజు అర్జున్, కీర్తికి ప్రపోజ్ చేద్దామని ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంటికెళ్తే తాళం వేసుంటుంది. అసలు కీర్తి ఎక్కడికెళ్లింది?.. ఆమె కోసం పిచ్చోడిలా మారిన అర్జున్ తిరిగి మాములు మనిషి ఎలా అయ్యాడు?, కీర్తి హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసి, ఆమె చదివే కాలేజీలోనే జాయిన్ అయిన అర్జున్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?, కీర్తి ప్రేమను పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు?.. అసలు కీర్తి ఎందుకలా మారిపోయింది.. చివరకు అర్జున్, ఆమెను ఏ స్థితిలో కలుస్తాడు?.. కలిశాక వీరి రిలేషన్ ఏంటనేది మిగతా కథ.
విశ్లేషణ:
ప్రతి వ్యక్తికి తొలిప్రేమ అనేది చాలా స్పెషల్. ఆ మధుర జ్ఞాపకాలు ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సరిగ్గా ఇదే లైన్ తీసుకుని కథ రెడీ చేసుకున్నారు దర్శకురాలు దివ్య భావన. ఫస్ట్ లవ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి కనెక్ట్ అయ్యేలా ఆసక్తికర సన్నివేశాలు రాసుకున్నారు. పాయింట్ కొత్తదని చెప్పలేం కానీ.. ప్రేమకథను సున్నితంగా చూపించారు. ఫస్టాఫ్ కాలేజ్ ఎపిసోడ్స్‌తో రోటీన్‌గా సాగుతుంది. పాటలు బాగుంటాయి. సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది కానీ లాస్ట్ 15 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. ట్విస్ట్ రివీల్ అయ్యాక ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.
నటీనటుల పనితీరు:
ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైన చేసే కుర్రాడిగా ఆర్యన్ గౌర చక్కగా నటించాడు. కొత్త అయినా కానీ తడబడలేదు. కాకపోతే అతని డబ్బింగ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కీర్తిగా మిస్తీ చక్రవర్తి నటన బాగుంది. స్క్రీన్ మీద బ్యూటిఫుల్‌గా కనిపించింది. చైతన్య గరికపాటి కామెడీ ప్లస్ అయింది. మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రానికి ఆర్యన్ – దీపు కథనందించారు. ఈశ్వర్ చైతన్య – శైలజా చౌదరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. విన్ను కంపోజ్ చేసిన సాంగ్స్ వినాలనిపించేలా, హార్ట్ టచింగ్‌గా ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. EJ వేణు సినిమాటోగ్రఫీ, కార్తిక్ కట్స్ ఎడిటింగ్ కూడా ఓకే. తన్విక జష్విక క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ అయ్యాయి. దివ్య భావన దర్శకురాలిగా ఆకట్టుకుంటుంది.
చివరి మాట: తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చే ‘ఓ సాథియా’
రేటింగ్: 2.5/5