‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగులో హీరోగా డెబ్యూ చేసిన కిరణ్ అబ్బవరం.. తన రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కిరణ్.. ఈ ఏడాది సెబాస్టియన్, సమ్మతమే సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ.. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా వెంటనే ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తనయ దివ్య దీప్తి నిర్మించారు. ఇక శ్రీధర్ – కిరణ్ కాంబోలో ఇదివరకే ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీ సక్సెస్ అయింది. మరి రెండోసారి ఈ కాంబో మూవీ సక్సెస్ అయ్యిందా లేదా రివ్యూలో చూద్దాం!
కథ:
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయి తేజు(సంజనా ఆనంద్)ని.. ఓరోజు క్యాబ్ డ్రైవర్ వివేక్(కిరణ్ అబ్బవరం) డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఫుల్లుగా తాగేసి మత్తులో ఉన్న తేజుని క్యాబ్ లో తీసుకెళ్తుండగా.. కొందరు ఆమెను కిడ్నాప్ చేసేందుకు ట్రై చేస్తారు. అయితే.. ఆ దుండగుల నుండి తేజుని కాపాడిన వివేక్.. ఆమె గతంలో లవ్ బ్రేకప్ అయిన విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో లవ్ బ్రేకప్ కారణంగా పేరెంట్స్ కి ముఖం చూపించలేక తేజు వైజాగ్ నుండి వచ్చి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఓరోజు వివేక్ కూడా తన బ్రేకప్ స్టోరీని తేజుతో షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత తేజును కన్విన్స్ చేసి వైజాగ్ లో డ్రాప్ చేస్తాడు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. మరి ఇద్దరి ప్రేమ కథలలో ఏమైంది? ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఏం చేశారు? అసలు వీరిద్దరి లైఫ్ కి లింకేంటి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
మొదటి రెండు సినిమాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత కథల ఎంపికలోనో, ఎక్కడో మొత్తానికి తడబడుతున్నాడు. ఈ ఏడాదిలోనే కిరణ్ కి ఇది మూడో సినిమా. సెబాస్టియన్ డిజాస్టర్ కాగా, సమ్మతమే యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. మరి ఇప్పుడొచ్చిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీతో అయినా మంచి హిట్ కొట్టాడా? అంటే.. పాత సీసాకు కొత్త రంగులద్ది చూపించే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమా కథ కొత్తదేం కాదని.. ముందే చెప్పేశాడు. కానీ.. బిగ్ స్క్రీన్ పైకి వచ్చాక ఎంత పాత కథైనా ఏదొక మ్యాజిక్ జరిగితేగాని అది హిట్టు అనే గట్టెక్కడం కష్టం. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.
కిరణ్ అబ్బవరం, దర్శకుడు శ్రీధర్ గాదె కాంబినేషన్ లో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో రిపీట్ అయ్యేసరికి సినిమాలో ఏదైనా విశేషం ఉందేమో అని మోస్తరు హైప్ క్రియేట్ చేశారు. అదీగాక డైరెక్టర్ కోడి రామకృష్ణ పెద్దకూతురు దివ్యదీప్తి నిర్మాతగా పరిచయం కాబోతుండటం మరో విశేషం. అయితే.. ఈ మధ్యకాలంలో డెబ్యూ అయిన వెంటనే కమర్షియల్ హీరో అనిపించుకోవాలనే ఆత్రుత అందరిలోనూ కనిపిస్తుంది. కానీ.. అదే పెద్దదెబ్బ కొడుతుందనేది ఎందుకు గ్రహించలేకపోతున్నారో అర్థం కాని ప్రశ్న. హీరో కిరణ్ అబ్బవరం కూడా ఆ ఫార్ములాలోనే ఉండిపోయాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ఐటెం సాంగ్.. ఆ వెంటనే హీరో వివేక్ ఇంట్రడక్షన్ ప్లాన్ చేసుకున్నారు. ఓ మాస్ యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయమైన హీరో క్యారెక్టర్.. హీరోయిన్ కథలోకి రాగానే కనిపించకుండా పోతుంది. అంటే.. మొదట్లో మెరిసిన మెరుపులు మెల్లగా హీరోయిన్ కాంబినేషన్ సెట్ అయ్యేసరికి మాయమైపోతాయి. అదీగాక హీరోయిన్ ఇంట్రడక్షన్, పబ్ కల్చర్, సాఫ్ట్ వేర్ లైఫ్.. ఇవన్నీ రొటీన్ గానే అనిపిస్తాయి. హీరో పరిచయం అయ్యాక ఇద్దరూ బ్రేకప్ స్టోరీస్ షేర్ చేసుకోవడం.. పెద్దగా ప్రేక్షకులలో ఉత్సాహం కలిగించేలా ఉండకపోవడం మైనస్. ఈ సినిమాకు కిరణ్ హీరోగానే కాకుండా రైటర్ గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లో కూడా వర్క్ చేశాడు. మధ్యమధ్యలో స్టోరీ లైన్ పరంగా శశిరేఖా పరిణయం తాలూకు లక్షణాలు కనిపిస్తాయి.
ఇక హీరోయిన్ ప్రేమకథ.. ఇంటర్వెల్ ట్విస్ట్.. క్లైమాక్స్ అన్నీ ప్రేక్షకుల అంచనాలకు మించి అయితే ఉండవు. నెక్స్ట్ ఏం జరగబోతుందో కనిపెట్టేందుకు వీలుగా దర్శకుడు స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేశాడు. అయితే.. యాక్టింగ్ పరంగా కిరణ్ మరోసారి మెప్పించాడు. కానీ.. హీరోయిన్ సంజనా ఆనంద్ పాత్రలో ఎమోషన్స్ మరింత బెటర్ రావచ్చేమో అనిపిస్తుంది. ఇక బాబా భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు తమ పాత్రల మేర మెప్పించారు. దర్శకుడు పాత సీసాలో కొత్త నీరు పోసినా ఆ ఎమోషన్స్, ఫీల్ ని ప్రేక్షకులలో కలిగించలేకపోయాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు కావాల్సిన స్థాయిలో ఉన్నాయి. సినిమాలో ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేసే పాయింట్స్ మిస్ అయ్యాయని చెప్పవచ్చు.
ప్లస్ లు:
మైనస్ లు:
చివరిమాట:
‘బాగా కావాల్సినవాడు’ కాదనిపించాడు!
(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)