Nene Vasthunna Review: హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. తమిళ హీరో అయినప్పటికీ, డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే.. ఇటీవల తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ధనుష్.. తాజాగా ‘నేనే వస్తున్నా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ధనుష్ – డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగో మూవీ ఇది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు సెట్ చేసిన ఈ సినిమాను ఎందుకోమరి మేకర్స్ పెద్దగా ప్రమోట్ చేయలేదు. మరి సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘నేనే వస్తున్నా’ మూవీలో ధనుష్ డ్యూయెల్ రోల్ పోషించినట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
సైకో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రధానంగా ప్రభు, కదిర్ అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలలో ధనుష్ నటించాడు. అయితే.. చిన్నప్పటి నుండే ప్రభు డీసెంట్, కదిర్ మాత్రం సైకోలా బిహేవ్ చేస్తుంటాడు. దీంతో కదిర్ ని ఫ్యామిలీ దూరం పెట్టడంతో ఒంటరిగా పెరుగుతాడు. కట్ చేస్తే.. ప్రభు ఓ ఉద్యోగం చేసుకుంటూ తన భార్య, కూతురుతో సంతోషంగా ఉంటాడు. ఈ క్రమంలో ప్రభుకి సడన్ గా కూతురు ప్రవర్తనలో ఊహించని మార్పు కనిపిస్తుంది. రాత్రిళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంటుంది. దీంతో ఎవరా అని కనుక్కుంటే.. కదిర్ గురించి షాకింగ్ ట్విస్ట్ తెలుస్తుంది. ఇంతకీ చిన్నప్పుడు వెళ్లిపోయిన సైకో కదిర్ ఇంకా బ్రతికే ఉన్నాడా? ప్రభు కూతురితో రాత్రిళ్ళు మాట్లాడుతుంది ఎవరు? ప్రభు, కదిర్ ల మధ్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు కదిర్ సైకోలా ఎందుకు మారాడు? చివరికి ఏమైంది.. అనేది తెరపై చూడాల్సిందే.
తిరు లాంటి హిట్ తర్వాత ఎందుకో మరి ఈ నేనే వస్తున్నా సినిమాను అటు తమిళంలో, ఇటు తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు మేకర్స్. కానీ ధనుష్ – సెల్వరాఘవన్ కాంబినేషన్ అనేసరికి సినిమాపై జనాలలో పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది. గతంలో ధనుష్, సెల్వరాఘవన్ కాంబోలో పుదుపేట్టై, కాదల్ కొండేన్, మయక్కం ఎన్న లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ క్లాసిక్ అనిపించుకున్నాయి. ఆ విధంగా.. ఇప్పుడు నేనే వస్తున్నా మూవీ కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ.. ఎందుకో మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ సమయంలో కూడా జనాల్లోకి తీసుకెళ్లలేదు.
ఇక విషయానికి వస్తే.. ఈ సినిమా కథకు నేనే వస్తున్నా అనేది కరెక్ట్ టైటిల్.. కానీ మేకర్స్ నుండి సినిమాకు కావాల్సినంత స్టఫ్ రాలేదనిపిస్తుంది. అటు ప్రభు, కదిర్ అనే ట్విన్ బ్రదర్స్ పాత్రలలో ధనుష్ చేసిన పోరాటం సరిపోలేదు. ఈ సినిమాను చాలా ఎంగేజింగ్ నెరేషన్, విజువల్స్ తో స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఎందుకంటే.. సైకో యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి.. స్టార్టింగ్ లో మెయిన్ క్యారెక్టర్స్ ని, కథను పరిచయం చేసిన విధానం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభు, కదిర్ ఫ్యామిలీ లైఫ్.. కదిర్ సైకోలా మారడం వరకు చూపించి.. 20ఏళ్ల తర్వాత ప్రభుకి పెళ్లి, భార్య ఓ కూతురు ఉన్నారని చూపించారు. అక్కడినుండి అసలు కథ మొదలవుతుంది.
ఇంటర్వెల్ వరకు ప్రభు ఫ్యామిలీ, కూతురు సత్య, సైకియాట్రిస్ట్.. క్యారెక్టర్స్ చుట్టూ కథను ఇంటరెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ లో రివీల్ చేసిన ట్విస్టుతో సెకండాఫ్ పై ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ లో కూతురు ద్వారా ప్రభుకు ఊహించని సవాళ్ళు ఎదురవుతాయి. ఎందుకంటే.. అప్పటికే కూతురు ప్రవర్తనలో వచ్చిన మార్పు.. ఆమెను ప్రాణాపాయ స్థితికి చేర్చుతుంది. దీంతో కూతురు కోసం ఏ రిస్క్ అయినా చేసేందుకు రెడీ అయిపోతాడు ప్రభు. కట్ చేస్తే.. రాత్రిళ్ళు కూతురు ఎవరితో మాట్లాడుతుందా అనేది రివీల్ అవుతుంది. అది ఎవరా అనేది పక్కన పెడితే.. ప్రభు బ్రదర్ కదిర్ గురించి ఇచ్చే ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
కాకపోతే డార్క్ థ్రిల్లర్, సైకో జానర్ మూవీస్ లో ఎప్పుడైనా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఈ విషయంలో డైరెక్టర్ సెల్వరాఘవన్ తడబడ్డాడు. ఎక్కువగా డ్రామా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రభు, కదిర్ కలవడం, అక్కడ సీన్ మరింత ఇంటరెస్టింగ్ గా ఉండదు.. కానీ.. చివరికి ప్రభు, కదిర్ లలో ఎవరు గెలిచారు? అనేది క్లారిటీ ఇవ్వకుండా అర్థాంతరంగా ముగించడం గమనార్హం. ఈ సినిమాలో ఎన్నో లాజిక్స్ మిస్ అయిపోయాయి. డైరెక్టర్ ప్రభు పాత్రను సాఫ్ట్ గా చూపించి, కదిర్ పాత్రను రఫ్ గా రాసుకున్నాడు. కానీ.. సైకో పాత్రకు ఉండాల్సిన బలం, బ్యాక్ గ్రౌండ్, బ్యాక్ స్టోరీ సరిగ్గా చూపించలేదు.
అందులోనూ ప్రభుతో పాటు కదిర్ కి పెళ్లి, ఇద్దరు కొడుకులు సోను, మను.. వాళ్లు కూడా కవలలే. ఆ పిల్లలకు.. ప్రభు కూతురు సత్యకు లింక్ చేసిన విధానం.. అసలు స్టోరీ ఎటు నుండి ఎటు వెళ్తుందో అనే కన్ఫ్యూషన్ కూడా కలిగిస్తుంది. చివరికి వచ్చేసరికి రెగ్యులర్ సైకో రివేంజ్ థ్రిల్లర్ గా చూపించడం పెద్దగా ఎక్కదు. అసలే డార్క్ మూవీ.. అందులో హాలీవుడ్ తరహా డ్రామా మెయింటైన్ చేస్తే.. థ్రిల్ కావాల్సిన ఆడియన్స్ కి సోదిలా అనిపించే అవకాశం ఉంది. ఈ సినిమా సెకండాఫ్ అంతా అలాగే సాగిందని చెప్పాలి. కథాకథనాలు వీక్ అయినా యువన్ శంకర్ రాజా బ్యాక్ మ్యూజిక్ తో సినిమాను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా వీరా సూర సాంగ్, ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.
టెక్నికల్ గా నేనే వస్తున్నాకి అన్ని బాగానే కుదిరాయి. ఓం ప్రకాష్ కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా డార్క్ షాట్స్, ఊటీ వాతావరణం, క్లోజప్ షాట్స్ చాలా బాగా కాప్చర్ చేశారు. ఇక ధనుష్ రెండు పాత్రలకు న్యాయం చేశాడు. కానీ.. ఆ క్యారెక్టర్స్ ధనుష్ టాలెంట్ కి సరిపడా లేవనేది నిజం. ధనుష్ నుండి ఓ కొత్త ఎమోషన్ ని, యాంగిల్ ని రాబట్టలేకపోయాడు దర్శకుడు. సినిమాలో ధనుష్ భార్యగా ఇందూజ, ఎల్లి అవ్రామ్ పరవాలేదనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ ల నటన బాగుంది. దర్శకుడు సెల్వరాఘవన్ కష్టం సినిమాలో కనిపిస్తాయి. కానీ.. ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక సినిమాలో నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.