మెగాస్టార్ అనగానే మనకు చిరంజీవి గుర్తొస్తారు. మలయాళంలో మాత్రం మమ్ముట్టి గుర్తొస్తారు. హీరోగా ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా వరసపెట్టి మూవీస్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఏకంగా ఐదు సినిమాలు చేసిన మమ్ముట్టి.. ఈ ఏడాది ఇప్పటికే రెండు మూవీస్ రిలీజ్ చేశారు. అందులో ఒకటే ‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’. జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో కూడా విడుదలైపోయింది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కేరళకు చెందిన జేమ్స్(మమ్ముట్టి).. తన భార్య-కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని వేళాంగిణి మాత దర్శనానికి వస్తాడు. వచ్చిన బస్సులోనే సొంతూరికి తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం టైంలో బయలుదేరడంతో మధ్యలో ఓ చోట ఆగి అందరూ భోజనం చేస్తారు. తిన్న కాసేపటికి బస్సులో అందరూ కునుకు తీస్తారు. సడన్ గా నిద్రలేచిన జేమ్స్.. ఓ చోట బస్ ఆపమని డ్రైవర్ కు చెబుతాడు. దిగి నడుచుకుంటూ దగ్గర్లోని ఓ ఊరికి వెళ్లిపోతాడు. అక్కడే ఓ ఇంటికి వెళ్లి.. ఆ ఇంట్లోని సుందరం అనే వ్యక్తిలా ప్రవర్తిస్తాడు. అసలు జేమ్స్, సుందరానికి లింక్ ఏంటి? ఎందుకలా బిహేవ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’ అంటే మధ్యాహ్నం నిద్ర అని అర్థం. ఓ వ్యక్తి అనుకోకుండా మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తాడు. లేచిన తర్వాత మరో మనిషిలా ప్రవర్తిస్తాడు. దీంతో అతడితో పాటు ఉన్న వ్యక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చివరకు ఏం జరిగింది అనేది చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. దీన్ని అంతే సింపుల్ గా చెప్పారు. మధ్యలో కాస్త ఎంటర్ టైన్ మెంట్ కూడా జోడించారు. మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు మాత్రం ఇది చాలా సాగదీశారనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ అంతా కూడా ఓ పల్లెటూరిలోనే ఉంటుంది. అసలు ఏ మాత్రం కృత్రిమత్వం ఉండదు. సీన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటాయి.
తమిళ ప్రజలు, తమిళ ఫుడ్ అంటే నచ్చని జేమ్స్, అనుకోకుండా సుందరంలా ప్రవర్తిస్తాడు. ఏకంగా ఓ పల్లెటూరిలోని ఇంటికి వెళ్లిపోయి తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తిలా మారిపోతాడు. దీంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా షాకైపోతారు. ఎందుకంటే అప్పటికే సుందరం కనిపించకుండా పోయి రెండేళ్లు అవుతుంది. అలాంటిది సుందరంలా ఓ వ్యక్తి రావడంతో పాటు సేమ్ అతడిలానే బిహేవ్ చేసేసరికి సుందరం భార్య మాట్లాడకుండా బిక్కచూపులు చూస్తుంది. ఆ ఊరి వాళ్లందరూ కూడా సుందరంలా మారిన జేమ్స్ ని వింతగా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. మధ్యలో కొంత డ్రామా కూడా ఉంటుంది. అయితే క్లైమాక్స్ లో మీకు ఊహించిన ఆన్సర్ దొరకదు సరికదా ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. డైరెక్టర్ కావాలని అలా చేశాడా లేదా స్టోరీ అంతేనా అనే డౌట్ వస్తుంది. ఏదేమైనా ఓ డిఫరెంట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మీకు కచ్చితంగా వస్తుంది.
ఇప్పటికే 400కు పైగా సినిమాలు చేసిన మమ్ముట్టి.. ఇందులో జేమ్స్, సుందరంగా రెండు డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టారు. ముతక షర్ట్, గళ్ల లుంగీలో పల్లెటూరి వ్యక్తిలా సరిగా సెట్ అయిపోయారు. గుళ్లో నేలపై పడుకునే సీన్ అయితే.. ఓ స్టార్ హీరో ఇలాంటి సీన్ ఎలా చేశాడబ్బా అని డౌట్ వస్తుంది. అలానే ఎమోషన్స్ పలికించే విషయంలోనూ మమ్ముట్టి తన అనుభవాన్ని అంతా బయటకు తీసి మరీ యాక్ట్ చేశారు. ఇక మిగిలిన పాత్రల్లో రమ్య పాండియన్ తదితరులు తమ వంతు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ లిజో జోస్ గురించి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. ఈ సినిమాను చాలా సింపుల్ స్టోరీ లైన్ తోనే తీశారు.
అయితే లిజో జోస్ గత చిత్రాలు కంటే ‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’ మూవీ ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ తెని ఈశ్వర్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. లాంగ్ షాట్స్ తో అద్భుతమైన విజువల్స్ మనకు అందించారు. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ఏం ఉండదు. బ్యాక్ గ్రౌండ్ లో టీవీలో వినిపించే పాటలు, డైలాగ్స్ తోనే సినిమా అంతా నడిపించేశారు. తెలుగు డబ్బింగ్ అని చెప్పినప్పటికీ చాలాచోట్ల తమిళ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. అదో మైనస్ పాయింట్. అయితే ఓటీటీలో, అది కూడా గంటా 44 నిమిషాలే ఉంటుంది కాబట్టి ఈ మూవీని అలా ఆడుతూ పాడుతూ చూసేయొచ్చు. రెగ్యులర్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చూద్దామనుకునే వాళ్లు మాత్రమే ఈ సినిమా ట్రే చేయండి..
చివరగా: ‘నన్ పాకల్ నేరతు మయక్కమ్’.. సమ్ థింగ్ డిఫరెంట్!
రేటింగ్: 2.5