ఈ సంక్రాంతి పండగ మాటేమో గానీ తెలుగు ప్రేక్షకులు ఫుల్ హ్యాపీస్. స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య.. ఇద్దరూ కూడా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు. సరే థియేటర్లలో ఈ సినిమాల గురించి కాసేపు పక్కనబెడితే.. ఓటీటీలోనూ సంక్రాంతి కానుకగా పలు మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో చాలామందిని ఎట్రాక్ట్ చేసిన మూవీ ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’. పేరు చూడగానే ఇదేదో మలయాళం సినిమా, ఆ భాష మాకు రాదు కదా అనుకుంటున్నారేమో. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
అడ్వకేట్ ముకుందన్ (వినీత్ శ్రీనివాసన్).. 30 ఏళ్లలోపే లైఫ్ లో సక్సెస్ కావాలని గోల్ పెట్టుకుంటాడు. కానీ 36 ఏళ్లు వచ్చినా ఇంకా జూనియర్ గానే పనిచేస్తుంటాడు. తనతోపాటు పనిచేస్తున్న జూనియర్ అడ్వకేట్ జ్యోతితో రిలేషన్ లో ఉంటాడు. మనోడికి టాలెంట్ ఉన్నాసరే ఒక్క కేసు కూడా ఎవరు ఇవ్వరు. ఓసారి ఇంట్లో మైనర్ యాక్సిడెంట్ జరగడంతో ముకుందన్ తల్లి గాయపడుతుంది. దీంతో దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పిస్తాడు. అప్పుడే అతడికి అడ్వకేట్ వేణు(సూరజ్ వెంజుమోడు) పరిచయమవుతాడు. అతడి వల్ల ముకుందన్ ఆలోచన విధానమే మారిపోతుంది. ముకుందన్ లైఫ్ ఒక్కసారి టర్న్ తిరుగుతుంది. మరి చివరకు ఏం జరిగింది? లైఫ్ లో ముకుందన్ సక్సెస్ అయ్యాడా? దాని కోసం ఎలాంటి ఎలాంటి పనులు చేశాడనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
మీరు గనుక ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయితే మాత్రం ముందు మీ జడ్జిమెంట్ ఆలోచనలన్నీ తీసి పక్కనపెట్టండి. ఎందుకంటే ఇందులో రైట్, రాంగ్.. గుడ్, బ్యాడ్ లాంటి విషయాలు అస్సలు చెప్పలేదు. ఇది కేవలం ముకుందన్ అనే అడ్వకేట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పిన స్టోరీ మాత్రమే. అతడికి మనసాక్షి అనేదే ఉండదు. జాలి, దయ, కరుణ లాంటి క్వాలిటీస్ ఒక్కటంటే ఒక్కటి కూడా పాటించడు. ఒక్క మంచి పనికూడా చేయడు. మీరు గనుక సినిమాలో లీనమైపోతే మాత్రం ముకుందన్ ని కొట్టి చంపాలనేంత కోపం గ్యారంటీగా వస్తుంది. ఒకవేళ అప్పుడు అతడు బతికొస్తే మాత్రం.. మీతో కలిసి ఇన్సూరెన్స్ క్లైమ్ చేద్దాం. వచ్చిన డబ్బులు చెరి సగం పంచుకుందామంటే మీరు ఒప్పేసుకుంటారు. ఎందుకంటే అక్కడున్నది డబ్బు కాబట్టి. ఆ తర్వాత మిమ్మల్ని తీరిగ్గా చంపేసి, మీ షేర్ కూడా ముకుందన్ లాగేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
పైనదంతా చదివిన తర్వాత ముకుందన్ అసలు ఎలాంటివాడు అనేది మీకు ఓ మాదిరిగా క్లారిటీ వచ్చేసుంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. రెండు గంటల సినిమా చూస్తే ముకుందన్ అంటే భయమేస్తుంది, ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇప్పటివరకు మీరు డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు కానీ ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ చాలా డిఫరెంట్. ఎందుకంటే ముకుందన్ అసలు నవ్వడు, అవతల ఎలాంటి మనిషి ఉన్నాసరే ఎక్స్ ప్రెషన్ అనేది లేకుండా సైలెంట్ గా ఉంటాడు, తన మనసాక్షితోనే మాట్లాడుతాడు. కానీ చేసే పనులు మాత్రం చాలా వయోలెంట్ గా ఉంటాయి. బాంబు విసిరి తాతయ్యను చంపడం, తనకు అడ్డుగా ఉన్నాడని లాయర్ వేణుని పాముతో చంపించడం, ఇంకా చెప్పాలంటే ఓ దశలో ముకుందన్ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో తనతోపాటు బస్ లో ఉన్నవాళ్లందరినీ చచ్చిపోయే ప్లాన్ వేస్తాడు.
మనలో చాలామంది మంచి వాళ్లలా నటిస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరిలోనూ సైకో లక్షణాలు ఉంటాయి. లైఫ్ లో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవి బయటకొచ్చేస్తుంటాయి. ఈ సినిమాలో ముకుందన్ పాత్ర కూడా అంతే. న్యాయంగా వెళ్తే అసలు సక్సెస్ కాలేనని ఎప్పుడైతే తెలుసుకుంటాడో.. అప్పటి నుంచి రూట్ మార్చేస్తాడు. ‘లా'(న్యాయవ్యవస్థ)లో లూప్ హోల్స్ ఉపయోగించి… జాలి, దయ, మంచి లాంటి వాటిని పక్కనపెట్టేసి డబ్బు సంపాదన మొదలుపెడతాడు. కొన్నిసార్లు అతి కూర్రంగా ప్రవర్తిస్తాడు. అయితే ముకుందన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పడం వల్ల అతడు మాత్రమే చెడ్డవాడు అని మనకు అనిపిస్తుంది. కానీ అతడితో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు. ఇక సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సీన్ మిమ్మల్ని థ్రిల్ చేస్తూనే ఉంటుంది. క్లైమాక్స్ చూసి తర్వాత మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీరు అనుకోనిది జరుగుతుంది కాబట్టి.
ముకుందన్ పాత్రలో నటించిన వినీత్ శ్రీనివాసన్ గురించి ఎంత చెప్పుకొన్నా సరే తక్కువే. ఎందుకంటే అతడు మలయాళంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. గతేడాది ‘హృదయం’ అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తీశాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా మాత్రం పూర్తి వైవిధ్యం చూపించాడు. ప్రతి సీన్, ప్రతి షాట్ లో జీవించేశాడు. చూస్తున్న మనల్ని తనతో పాటు జర్నీ చేసేలా చేస్తాడు. కొన్ని కొన్నిచోట్ల మినహా మనకు పూర్తిగా నచ్చేస్తాడు. ఇక లాయర్ వేణుగా చేసిన సూరజ్, అడ్వకేట్ జ్యోతిగా నటించిన తన్వి, ముకుందన్ ప్రేయసి-భార్యగా యాక్ట్ చేసిన అర్ష చాందిని బైజు.. ఇలా ఎవరికి వారు తమ బెస్ట్ ఇచ్చారు. స్టోరీ మొత్తం ముకుందన్ నెరేటివ్ లో వెళ్తుంది కాబట్టి మిగిలిన పాత్రలు మనకు పెద్దగా గుర్తుండవు. వాళ్ల వరకు మాత్రం వారు బాగానే చేశారు.
ఎడిటర్ గా పలు సినిమాలు పనిచేసిన అభినవ్ సుందర్ నాయక్.. ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’తో డైరెక్టర్ గా మారాడు. తొలి సినిమాతోనే వావ్ అనిపించాడు. సాధారణంగా హీరోల క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేసుకున్నా సరే చివరకు పాజిటివ్ గానే ఎండ్ చేస్తారు. అభినవ్ మాత్రం అలా అస్సలు చేయలేదు. ముకుందన్ పాత్రని చాలా నేచురల్ గా చూపించాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాకు సరిగ్గా సెట్ అయింది. మిగిలిన విభాగాలు కూడా తమకు ఇచ్చిన పని సక్రమంగా నిర్వర్తించి.. సినిమా అద్భుతంగా రావడానికి సహాయపడ్డాయి. అయితే సినిమాలో కామెడీ కావాలి, రిలాక్స్ గా ఉండాలి అనుకునే వాళ్లు మాత్రం ఈ సినిమా చూడటం వేస్టే. ఓ డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే మాత్రం హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని కచ్చితంగా ట్రై చేయండి! ఒకవేళ మీకు నచ్చితే మాత్రం.. చూసొచ్చి ఈ స్టోరీ కింద కామెంట్ కూడా చేయండి.
చివరగా: డార్క్ కామెడీ ఇష్టమా.. ఈ సినిమా ట్రై చేయండి!
రేటింగ్: 3/5