కొత్త కుర్రాళ్లతో తీసిన మూవీ 'మేమ్ ఫేమస్'. విపరీతంగా పబ్లిసిటీ చేశారు. టాలీవుడ్ స్టార్స్ తో ప్రమోషన్స్ చేయించారు. మరి సినిమా నిజంగా బాగుందా? లేదా? తెలియాలంటే రివ్యూ చూసేయాల్సిందే.
ఒకరో ఇద్దరో కాదు.. దాదాపు టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ ఈ సినిమా కోసం ప్రచారం చేశారు. గత కొన్నాళ్లుగా ఇన్ స్టా ఓపెన్ చేస్తే ఈ మూవీ ప్రమోషన్స్ రీల్స్ వరసపెట్టి కనిపిస్తున్నాయి. అలా అని ఇదేదో భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ కాదు. కొంతమంది కొత్త కుర్రాళ్లు యాక్ట్ చేసిన విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ మూవీ. అదే ‘మేమ్ ఫేమస్’. యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. ఇందులో లీడ్ రోల్ చేయడంతోపాటు దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూ చూసి తెలుసుకుందాం.
తెలంగాణలోని బండనర్సంపల్లి అనే ఊరు. మయి అలియాస్ మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదరి) ముగ్గురు ఫ్రెండ్స్. నిద్ర లేచిన దగ్గర నుంచి ఊరిలో గొడవలు, పంచాయతీలు.. ఇదే వీళ్ల ప్రపంచం. వీళ్ల ముగ్గురి వల్ల ఊర్లో వాళ్లు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఊరి ప్రెసిడెంట్ జింక వేణు (కిరణ్ మచ్చా), అంజి మామ(అంజిమామ మిల్కూరి) మాత్రమే ఈ ముగ్గురికి కాస్త సపోర్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఫేమస్ అవ్వాలని వీళ్లు అనుకుంటాడు. చివరకు అనుకున్నది చేశారా? ఇందులో మామ కూతురు మౌనిక (సౌర్య లక్ష్మణ్)తో మయి లవ్ స్టోరీ ఏంటి? చివరకు ఏమైంది అనేదే ‘మేమ్ ఫేమస్’ స్టోరీ.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఈ మధ్య పలు సినిమాలొస్తున్నాయి. హిట్ కొడుతున్నాయి. ‘జాతిరత్నాలు’ టైపు సినిమాలు వస్తున్నాయి. హిట్ కొట్టలేకపోతున్నాయి. దానికి కారణం కంటెంట్.. ఎందుకంటే అలాంటి కామెడీ అన్నిసార్లు వర్కౌట్ కావాలని రూలేం లేదు. అప్పుడంటే ఈ టైపు కామెడీ కొత్త కాబట్టి ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు కష్టం! ‘మేమ్ ఫేమస్’ చిత్రం విషయంలోనూ అలాంటిదే జరిగింది. చూస్తున్నంత సేపు బాగానే ఉన్నప్పటికీ ఒరిజినాలిటీ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. హీరో కమ్ డైరెక్టర్ అయిన సుమంత్ ప్రభాస్.. బిగ్ స్క్రీన్ కి కొత్త. బహుశా అందుకేనేమో తాను అనుకున్న దాన్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చే విషయంలో తడబడ్డాడు. కానీ తనలో విషయం ఉందని మాత్రం ప్రూవ్ చేశాడు.
ఫస్టాప్ విషయానికొస్తే బండనర్సంపల్లి విలేజ్ లో ఓపెన్ అవుతుంది. మెయిన్ క్యారెక్టర్స్ అయిన మయి, దుర్గ, బాలి ఎలా ఉంటారు? ఊరిలో ఏమేం చేస్తుంటారు లాంటి వాటిని సీన్ బై సీన్ చూపిస్తూ వెళ్లారు. పెద్ద మనుషుల ముందు పంచాయతీలతో అలా వెళ్తూ ఉంటుంది. అందరూ తిడుతున్నారని.. ఓ పని చేసి ఫేమస్ అయిపోవాలని ముగ్గురు ఫ్రెండ్స్ డిసైడ్ అవుతారు. అక్కడి నుంచి స్టోరీ మలుపులు తిరుగుతూ వెళ్తుంది. ఇందులో ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. చివరకు ఏమైంది? అసలు ఈ స్టోరీకి గోరేటి వెంకన్నకు సంబంధమేంటి తెలియాలంటే మాత్రం ‘మేమ్ ఫేమస్’ చూడాలి. సినిమాలో అక్కడక్కడ జెన్యూన్ కామెడీ సీన్లు, మరికొన్ని ఎమోషనల్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. కానీ సినిమా చూస్తున్నంతసేపు షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది.
కామెడీ పరంగా బాగున్నప్పటికీ చూస్తున్నంతసేపు కొన్ని సీన్లు ఎక్కడో చూశామే అని అనుభూతి కలిగిస్తాయి. బాగా సాగుతున్న స్టోరీలో ‘రైతే రాజు’, దుర్గతో తండ్రి రెండెకరాల భూమి సంపాదించిన విషయం చెప్పడం లాంటివి సినిమా నిడివి పెంచడం కోసం అతికించినట్లు అనిపిస్తాయి. ఫేమస్ కావడం కోసం చేసే ప్రయత్నాల్లో లిప్ స్టిక్ స్పాయిలర్ కుర్రాడి సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. మిగతావి మాత్రం కాస్త బోర్ కొట్టిస్తాయి. చెప్పాలంటే యూట్యూబ్ లో అప్పుడెప్పుడో చూసేసిన సీన్లలా అనిపిస్తాయి. స్టోరీలో కొత్తదనం మిస్ అయింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ అనే కొత్త సీసలో పాత సరుకుని నింపేసిన ఫీలింగ్ వస్తుంది.
లీడ్ రోల్ చేసిన సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ ఓకే. కామెడీ పరంగా బాగానే ఉంది కానీ ఎమోషనల్స్ సీన్స్ లో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. ఇతడి ఫ్రెండ్స్ గా యాక్ట్ చేసిన మణి, మౌర్య ఉన్నంతలో చక్కగా చేశారు. హీరోయిన్ గా నటించిన సౌర్య పక్కింటి అమ్మాయిలా సింపుల్ గా కనిపించి ఆకట్టుకుంది. యూట్యూబర్ సిరి రాశికి.. ‘మేమే ఫేమస్’లో మంచి రోల్ పడింది. అంజి మామ, కిరణ్ మచ్చా, మురళీధర్ గౌడ్ తమ పాత్రలని అలా చేసుకుంటూ పోయారు. లిప్ స్టిక్ స్పాయిలర్ పాత్రలో నటించిన శివనందన్ కామెడీ టైమింగ్ బాగుంది. చెప్పాలంటే సుమంత్ ప్రభాస్ తర్వాత ఇతడే బాగా గుర్తుండిపోతాడు.
హీరోగా పర్వాలేదనిపించిన సుమంత్ ప్రభాస్ డైరెక్టర్ గా ఓకే ఓకే అనిపించాడు. సినిమాలోని కామెడీ, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసి సీన్స్ తీసే విషయంలో ఇబ్బందిపడ్డాడు. సినిమాని రెండున్నర గంటలు తీశారు. ఎడిటింగ్ కి పనిచెప్పి ఓ 20 నిమిషాల వరకు తగ్గించుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే. ‘రైటర్ పద్మభూషణ్’ ఫేమ్ కల్యాణ్ నాయక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ పాటలే పెద్దగా గుర్తుండవు. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే పబ్లిసిటీ చేసినంతగా ఈ సినిమాలో పెద్దగా ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే థియేటర్ కి వెళ్లండి. లేదంటే ఓటీటీలో వచ్చేంతవరకు వెయిట్ చేయండి!
చివరగా: ఫేమస్ కాలేదు!
రేటింగ్: 2