తమిళ హీరో విష్ణు విశాల్‌కు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. ఆయన తీసిన సైకో సస్పెన్స్ థ్రిల్లర్ రాక్షసన్ దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. రీమేక్ కాకముందే ఆ సినిమాను చాలా మంది తెలుగులో చూసేశారు. విష్ణు విశాల్ మొదటి నుంచి కొత్త దనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థం అయిపోతుంది. విష్ణు విశాల్ మొదటి సినిమా ‘‘వెన్నెల కబడ్డీ కుళు’’ దగ్గరినుంచి శుక్రవారం విడుదలైన మట్టి కుస్తీ వరకు అన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలే.
విష్ణు విశాల్ ఇప్పటివరకు దాదాపు 20 సినిమాలు తీస్తే అందులో చాలా వరకు మాస్, పల్లెటూరి నేపథ్యం కలిగిన సినిమాలు కావటం విశేషం. అంతేకాదు.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాతోనే ఆయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక, తనకు ఎంతో గానో అచ్చొచ్చిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘‘మట్టి కుస్తీ’’తో శుక్రవారం మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు విష్ణు విశాల్. ఈ సినిమాకు తెలుగు స్టార్ హీరో రవితేజ సహ నిర్మాతగా వ్యవహరించారు. విష్ణు విశాల్, రవితేజల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంది? మట్టి కుస్తీని తెలుగు ప్రేక్షకులు మెచ్చారా? లేదా?…
కీర్తి( ఐశ్వర్య లక్ష్మీ) కేరళకు చెందిన ఓ సగటు ఆడపిల్ల. ఆమెకు కుస్తీ పోటీలంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటారు. అయినప్పటికి చిన్నాన్న సహాయంతో కుస్తీ పోటీలకు వెళుతుంటుంది. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు గొడవ పెడతారు. ఆడపిల్లకు పెళ్లి కాదని ఆవేదన వ్యక్తం చేస్తారు. పెళ్లి చేసుకోమని బలవంతపెడతారు. ఆమె దీనికి ఒప్పుకోదు. కూతురు జీవితం పాడవుతుందన్న అపోహలో ఆమె తండ్రికి గుండెపోటు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తుంది. ఇక, ఆంధప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో బలాదూర్‌గా తిరిగే మాస్ వ్యక్తి. అతడి కంటూ ఎలాంటి ఆశయాలు ఏవీ ఉండవు. వచ్చే భార్య తను చెప్పినట్లు చేసేది అయితే చాలు అనుకుంటాడు.
అంతేకాదు! వచ్చే భార్యకు పెద్ద జడ ఉండాలని కలలు కంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే కుస్తీ పోటీల్లో పాల్గొన్నందన్న కారణంగా కీర్తికి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. కీర్తికి ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్న ఆమె చిన్నాన్నకు ఓ ఆలోచన వస్తుంది. కీర్తి ఏడవ తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్ధం చెప్పి వీరతో పెళ్లి చేస్తారు. పెళ్లయిన కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత కీర్తి గురించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆమె ఓ కుస్తీ ఫైటర్ అని, బాగా చదువుకుందని, పెద్ద జడకూడా లేదని వీరకు తెలుస్తుంది. దీంతో ఇద్దరూ విడిపోతారు. మళ్లీ ఈ ఇద్దరూ ఎలా కలిశారు? భార్య ఆశయానికి వీర తోడుగా నిలుస్తాడా? లేదా? అన్నదే మిగితా కథ.
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాలు రావటం కొత్తేమీ కాదు. అయితే, ఈ సినిమా కథను రాసుకోవటంలో.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో దర్శకుడు సఫలమయ్యాడు. మహిళల స్వేచ్ఛ అనే పాయింట్ మీద కథ మొత్తాన్ని నడిపించాడు. తమిళ సినిమాల్లో ఉండే ఫ్యామిలీ డ్రామాను అలాగే కంటిన్యూ చేశాడు. ఫ్యామిలీ డ్రామాలోనూ ఫన్‌ను మిక్స్ చేసి ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు. హీరో, హీరోయిన్స్ పాత్రల్లో దేన్నీ తక్కువ చేయకుండా.. కథలో వారి ప్రాధాన్యతకు తగ్గట్టు పాత్రలను ముందుకు నడిపించాడు. ప్రతీ పాత్రకు న్యాయం చేశాడు.
పాత కథనే కొత్తగా పాలీష్ చేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు. భార్యాభర్తలు ఎవ్వరూ తక్కువ కాదని, వారి ప్రవర్తనే జనంలో వారిని పైన నిలబెడుతుందని విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పాడు. ఇక, హీరోగా విష్ణు విశాల్ నటన అద్భుతంగా ఉంటుంది. విష్ణు విశాల్‌కు ఇలాంటి పల్లెటూరి పాత్రలు, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పాత్రలు కొత్తేమీ కాదు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. ఇందులోనూ భార్యపై మండిపడే వ్యక్తి పాత్రలో చక్కగా నటించారు. జీరో లెవల్ విత్ జీరో అన్న విధంగా ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోవటం ఆయన నైజం. వీర పాత్రలో విష్ణు విశాల్ మరో సారి శభాష్ అనిపించుకున్నారు. ఇక, కీర్తి పాత్రలో ఐశ్వర్య లక్ష్మీ చక్కగా నటించింది. సాధారణంగా హీరోయిన్లు డీగ్లామర్ పాత్రలు.. అందులోనూ మట్టిలో దొర్లే పాత్రలు చేయటానికి ఇష్టపడరు.
ఒక వేళ చేయటానికి ఒప్పుకున్నా.. ఆ పాత్రకు న్యాయం చేయటం చాలా కష్టం. కానీ, ఐశ్వర్య లక్ష్మీ మాత్రం తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. కుస్తీ పోటీల్లో పాల్గొనే మహిళగా అద్భుతంగా నటించింది. ఫైట్ సీక్వెన్స్‌లోనూ తన సత్తా చాటిందని చెప్పకోవటంలో ఎలాంటి అతిశయం లేదు. ఇక, మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధికి తగ్గట్లుగా బాగా నటించారు. సంగీత దర్శకుడు మట్టి కుస్తీ సినిమాకు మంచి సంగీతాన్ని అందించాడు. అయితే, పాటలే కొద్దిగా తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఉంటాయి. పాటల ఒక్కవిషయంలో తప్ప అన్ని విషయాల్లో సంగీత దర్శకుడు మెప్పించాడు. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలైన రవితేజ, విష్ణు విశాల్ ఎక్కడా తగ్గలేదు. మంచి ఔట్‌పుట్ వచ్చేలా చూసుకున్నారు.