‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తెలుగులో హీరో కెరీర్ స్టార్ట్ చేశాడు నాగశౌర్య. మొదటి సినిమాతోనే పక్కింటి కుర్రాడిలా అనిపించి.. తర్వాత డీసెంట్ మూవీస్ చేసి లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. అయితే.. మధ్యలో పంథా మార్చి డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేశాడు. అయితే.. నాగశౌర్యని లవర్ బాయ్ గా యాక్సెప్ట్ చేసిన జనాలు.. మాస్ సినిమాలు సెట్ కావని చెప్పేశారు. అందుకే సొంత బ్యానర్ లో ఛలో సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఛలో తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. దీంతో మళ్లీ తనకు కలిసొచ్చిన లవర్ బాయ్ గెటప్ లో ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీ చేశాడు. మరి ఏకంగా పాదయాత్ర చేసి ప్రమోట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కృష్ణ(నాగశౌర్య) పక్కా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్నికల్ ట్రైనర్ గా చేరి.. తొలి చూపులోనే ప్రాజెక్ట్ మేనేజర్ వ్రిందా(షేర్లీ)తో ప్రేమలో పడతాడు. వ్రిందా పక్కా నార్త్ ఇండియాకి చెందిన అమ్మాయి. లవ్, పెళ్లి వద్దనుకొని లైఫ్ ని పార్టీస్, నాన్ వెజ్ అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటుంది. మొత్తానికి ఎన్నో తంటాలుపడి కృష్ణ.. తనకు పూర్తిగా వ్యతిరేక భావాలున్న వ్రిందా ప్రేమను గెలుస్తాడు. తీరా పెళ్లి చేసుకుందాం అనే టైమ్ కి కృష్ణకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని దాచేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పెళ్లి తర్వాత ఇద్దరికి ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి. ఇంతలోనే మరో షాకింగ్ ట్విస్టు కృష్ణ ఫ్యామిలీని కుదిపేస్తుంది. అక్కడినుండి కృష్ణ, వ్రిందాల లైఫ్ మరో మలుపు తిరుగుతుంది. మరి పెళ్లి తర్వాత భిన్నమైన అలవాట్లు కలిగిన కృష్ణ, వ్రిందా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు? ఆచారాలకు దూరంగా ఉండే కోడలు వ్రిందాను కృష్ణ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంది? భిన్న భావాల మధ్య వీరి మ్యారేజ్ లైఫ్ ఎలా సాగింది? అసలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత వచ్చిన ఆ షాకింగ్ ట్విస్టులు ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
టాలీవుడ్ లో బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన హీరో, అతనికి పూర్తి వ్యతిరేక భావాలు కలిగిన హీరోయిన్ బ్యాక్ డ్రాప్ లో చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అయితే.. ఈ బ్రాహ్మణ ఫ్యామిలీ, మోడరన్ ఫ్యామిలీస్ మధ్య ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీస్ చాలామంది హీరోలు ట్రై చేశారు. అందులో కొందరు మెప్పించగలిగారు, మరికొందరు బోల్తాపడ్డారు. కాకపోతే తెలుగు బ్రాహ్మణ హీరో, నార్త్ అమ్మాయి కథలన్నీ దాదాపు కామెడీతోనే వర్కౌట్ అయ్యాయి. అదుర్స్, సీమశాస్త్రి, అంటే సుందరానికి ఇలా చాలా సినిమాలే వచ్చాయి. అయితే.. కాన్సెప్ట్ పాతదే అయినా కథలో ‘కాన్ ఫ్లిక్ట్’, కథనాలు కొత్తగా ఉంటే సినిమాలు ఆడొచ్చు.
ఇప్పుడు కృష్ణ వ్రిందా విహారి మూవీ కూడా అదే కోవకు చెందుతుంది. పక్కా బ్రాహ్మణ కుర్రాడు, పక్కా నార్త్ ఇండియన్ అమ్మాయి.. వారు పెరిగిన ఆచార సాంప్రదాయాలు, అలవాట్లు, లైఫ్ స్టైల్ ఇలా అన్ని వేరు. కానీ.. అలాంటి ఇద్దరే ఒక్కటైతే ఎలా ఉంటుంది.. ఆ తర్వాత వారి లైఫ్ లో జరిగే టర్నింగ్ పాయింట్స్, ఆచారాల విషయంలో వచ్చే అవమానాలు, మనస్పర్థలు ఇలా అన్ని విషయాలు.. వీటన్నిటికీ తోడు కడుపుబ్బా నవ్వించే హాస్యం ఇలా అన్ని రంగరించి తీసిందే ఈ చిత్రం. బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఎంత పద్ధతిగా, ఆచారాలకు కట్టుబడి ఉంటాయో చెబుతా హీరో కృష్ణాచారి(శౌర్య) క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు.
ఆ తర్వాత హీరో ఉద్యోగం కోసం వెళ్లి అక్కడ ఆఫీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్(వ్రిందా)తో లవ్ లో పడటం.. ఆమె చుట్టూ తిరుగుతూ లవ్ లో పడేయడం ఎంటర్టైన్ చేస్తాయి. అయితే.. కథ పాతదే అయినా సినిమాను కొత్తగా, ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో ఫ్యామిలీ, వాళ్ల రూల్స్, లవ్, కామెడీ ట్రాక్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే.. ఇంటర్వెల్ లో ట్విస్టు చాలా బాగుంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ లో హీరో హీరోయిన్ పెళ్లి, తర్వాత ఫ్యామిలీ గొడవలు బాగానే ఉన్నాయి. కానీ.. ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా ఇంకా బలంగా రాసుంటే బాగుండేదని ఫీలింగ్ కలుగుతుంది.
ఈ క్రమంలో పెళ్లి తర్వాత మరో షాకింగ్ ట్విస్టు కూడా బాగుంది. కాకపోతే.. రొటీన్ స్టోరీలో ఒక మెడికల్ డిసార్డర్(హీరోకి లేదా హీరోయిన్) పెట్టేసి.. ట్విస్టులుగా చూపించడం అనేది కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే.. ఇలాంటి సేమ్ లైన్ ఇటీవల ‘అంటే సుందరానికి’ మూవీలో చూశాం. ఫస్ట్ హాఫ్ లో ప్రాబ్లెమ్ ఉందని.. సెకండాఫ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ ప్రాబ్లెమ్ క్యూర్ అయ్యిందని.. ఇలాంటివి రేర్ గా జరుగుతాయని చెప్పడం రొటీన్ అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీస్ మధ్య మనస్పర్థలు వచ్చి.. చివరికి రియలైజ్ అవ్వడం మామూలే. కానీ.. చూపించిన విధానంలో సినిమా కొత్తగా అనిపించే అవకాశం ఉంది.
ఇక ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, ఛలో లాంటి లవర్ బాయ్ రోల్స్ తో హిట్స్ కొట్టిన నాగశౌర్య.. ఈ మధ్య వరుస ప్లాప్ లను చవిచూశాడు. మధ్యలో మాస్ ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోవడంతో సొంత బ్యానర్ లో ఈ సినిమా చేశాడు శౌర్య. అయితే.. ఆల్రెడీ లవర్ బాయ్ రోల్స్ చేసేసాడు కాబట్టి.. బ్రాహ్మణ కుర్రాడిగా శౌర్య మెప్పించాడు. ఎక్కడెక్కడ ఎలాంటి ఎక్సప్రెషన్స్ ఇవ్వాలో.. ఎలా షాక్ అవ్వాలో లాంటివి బాగా చేశాడు. ఛలో తర్వాత ఇందులో మంచి కామెడీ పండించాడు. హీరోయిన్ షేర్లీ సెటియా.. వ్రిందా పాత్రకు న్యాయం చేసింది. కాకపోతే ఓన్ డబ్బింగ్ చెప్పడంతో కొన్ని డైలాగ్స్ లో ఎమోషన్స్ సరిగ్గా పలకలేదు.
మొత్తానికి షేర్లీకి మంచి డెబ్యూ లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ తర్వాత మేజర్ హైలైట్ అంటే కామెడీ. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి. లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఈ సినిమా ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక హీరో తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ ఓకే. కానీ.. ఆమె పాత్రను మరింత బలంగా రాసి ఉండవచ్చు. హీరోయిన్ ఫ్యామిలీకి పెద్దగా స్కోప్ లేదు. విలన్ గా రఘువరన్ బిటెక్ ఫేమ్ అమూల్ బేబీ పాత్రలో లాజిక్ లేడనిపిస్తుంది. ఎందుకంటే.. భర్త ఉండగానే పెళ్ళైన అమ్మాయి వెంటపడటంలో లాజిక్ లేదు. మిగతా అందరూ తమ తమ పాత్రల పరిధిమేరా మెప్పించారు.
ఈ సినిమాకు మరో ప్లస్ మ్యూజిక్. మహతి స్వరసాగర్ మెలోడీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ఇక దర్శకుడు అనీష్ కృష్ణ.. కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా రాశాడు. ముఖ్యంగా కామెడీ సీక్వెన్స్ లు అద్భుతంగా రాసుకున్నాడు. కానీ.. ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్య సంఘర్షణలపై అంతగా ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. రెండు ట్విస్టులను మినహాయించి, దాదాపు సినిమా అంతా కామెడీతో కవర్ చేశాడు. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా, లాజిక్స్ పట్టించుకోకుండా నవ్విస్తూ ఆడియన్స్ ని మెప్పించాడు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!