సినిమాకు హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీల పుణ్యామా అని ఇతర భాషల చిత్రాలు మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తెలుగులోనూ డబ్బింగ్ అవుతున్నాయి. ప్రతివారం రిలీజైన వాటిని చూస్తూ అందరూ ఎంటర్ టైన్ అవుతున్నారు. తాజాగా అలా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం క్రాంతి. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన ఈ సినిమా జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజైపోయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
క్రాంతి(దర్శన్).. యూరప్ లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎన్నో వ్యాపారాల్లో తనదైన ముద్ర వేసి లైఫ్ ని ఆస్వాదిస్తుంటాడు. అలాంటి అతడికి.. తను చిన్నప్పుడు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ 100 వార్షికోత్సవానికి రావాలని శ్రీకంఠ(సురేశ) మాస్టర్ ఆహ్వానిస్తారు. దీంతో తన బిజినెస్ లను కొన్నిరోజులు పక్కనబెట్టి ఇండియా వస్తాడు. ఉషతో(రచిత రామ్) ప్రేమలో కూడా పడతాడు. అయితే ఫంక్షన్ జరుగుతున్న టైంలోనే స్కూల్ బీటలు వారి నేలమట్టం అయిపోతుంది. కొందరు టీచర్లు, పిల్లలు గాయపడతారు కూడా. దీంతో అసలు ఎందుకిలా జరిగింది అని క్రాంతి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే కొన్ని నిజాలు తెలుస్తాయి? మరి చివరకు ఏమైంది? ఈ స్టోరీలో సలాద్రి (తరుణ్ ఆరోరా), వామనరావు (సంపత్ రాజ్), నర్సప్ప (రవిశంకర్) పాత్రలేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
క్రాంతి గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీ. ఓ స్టార్ హీరో సినిమాలో ఏమేం ఉండాలో ఇందులో అన్ని ఉంటాయి. విదేశాల్లో ఉండే హీరో.. ఓ పనిమీద సొంతూరికి రావడం, అనుకోకుండా జరిగిన ఓ ఇన్సిడెంట్, దాన్ని సాల్వ్ చేయడం.. ఈ లైన్ చెప్పగానే అరే ఇలాంటి సినిమా ఎక్కడో చూసినట్లు ఉందే అని మీరు కచ్చితంగా అనుకుంటారు. అవును మీరు గెస్ చేసింది కరెక్ట్. దాదాపు ఇదే స్టోరీ లైన్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ వచ్చింది. దీంతో పోలిస్తే.. ‘క్రాంతి’కి చాలా విషయాల్లో పోలిక కనిపిస్తుంది. త్రీ పీస్ సూట్స్, రోల్స్ రాయిస్ కార్లు, చార్టెడ్ విమానాలు.. సినిమా చూస్తున్నంతసేపు మనకు చాలా తెలుగు సినిమాలు కళ్ల ముందు కనిపిస్తాయి. హీరో ఇంట్రడక్షన్ దగ్గర క్లైమాక్స్ వరకు కూడా సినిమా అంతా బాగానే ఉంటుంది కానీ ముందు సీన్ లో ఏం జరగబోతుందనేది చాలా ఈజీగా తెలుగు ప్రేక్షకులు ఊహించేస్తారు.
గవర్నమెంట్ స్కూల్స్ రోజురోజుకీ కనుమరుగైపోతున్నాయి, వాటిని కాపాడటానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేదే ‘క్రాంతి’ సినిమా. సింపుల్ గా చెప్పాలంటే స్టోరీ ఇంతే. దీన్ని చాలా డిఫరెంట్ గా, అద్భుతమైన సీన్స్ తో చెప్పి ఉండొచ్చు. కానీ ఈ మూవీ టీమ్ ఆ దారిని ఎంచుకోలేదు. ఓ కమర్షియల్ సినిమాలో ఏమేం ఉండాలో వాటన్నింటినీ అలా అలా పేర్చుకుంటూ వెళ్లిపోయింది. క్రాంతి స్టోరీ ‘మహర్షి’ని గుర్తు చేస్తే.. మిగతా కొన్ని సీన్ల చూస్తుంటే ‘అత్తారింటికి దారేది’ ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్, ‘మిర్చి’లో హీరో అతడి ఫాదర్ ఎపిసోడ్, ‘సరైనోడు’లో టెంపుల్ ఫైట్ గుర్తొస్తాయి. ‘D-బాస్’గా హీరో దర్శన్, కర్ణాటకలో చాలా ఫేమస్. కాబట్టి ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు నచ్చేయొచ్చు, థియేటర్లలో బాగా ఆడి ఉండొచ్చు. కోట్లకు కోట్లు కలెక్షన్స్ రాబట్టేయొచ్చు. కానీ ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా చూస్తే పెద్దగా ఏం అనిపించదు.
సినిమా మొదలైన గంటన్నర తర్వాతే అసలు స్టోరీలోకి వెళ్తారు. అక్కడ నుంచైనా స్పీడ్ అందుకుందా అంటే హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడం, స్లో మోషన్ ఫైట్స్ తో దాన్ని ఇంకా లేట్ చేస్తారు. చివరి అరగంటలో మెయిన్ స్టోరీ, కాన్ ఫ్లిక్ట్, క్లైమాక్స్ చకాచకా ముగించేస్తారు. అయితే ఈ మూవీలో గవర్నమెంట్ స్కూల్స్ మూసివేయడం, దాని వల్ల టీచర్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు లాంటి విషయాల్ని చూపించారు. కిలోమీటరు 5 వైన్ షాప్స్ కి పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వం.. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దాన్ని మూసేస్తుందనే మంచి పాయింట్ ని కూడా ప్రస్తావించారు. ఇక కొందరు పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది కూడా ఇందులో చూపించారు.
ఇందులో హీరోగా దర్శన్ వన్ మ్యాన్ షో చేశాడు. మిగిలిన వాళ్లకు పెద్దగా నటించే స్కోప్ లేదు. హీరోకి తండ్రిగా చేసిన రవిచంద్రన్ కూడా ఎక్కువగా సీరియస్ గానే కనిపించారు తప్ప ఆయనకు మంచి సీన్లు ఏం పడలేదు. విలన్లుగా చేసిన ముగ్గురిలో రవిశంకర్ కు మాత్రమే కొద్దిగొప్పే స్క్రీన్ స్పేస్ దొరికింది. తరుణ్ అరోరా, సంపత్ రాజ్ ఉన్నారంటే ఉన్నారంతే. హీరోయిన్ రచిత రామ్ నాలుగు సీన్స్, రెండు పాటల్లో కనిపిస్తుంది. అంతకు మించి ఆమెకు చేయడానికి ఏం లేదు. మిగిలిన పాత్రల్లో అచ్యుత్, సాధు కోకిల, సురేష తదితరులు తమ వంతు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. మ్యూజిక్ విషయంలో హరికృష్ణ పర్వాలేదనిపించారు. ఫైట్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్ లో కూడా మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మరీ దారుణంగా ఉంది. ఈజీగా తెలిసిపోయింది. స్టార్ హీరో సినిమాలో ఇలాంటివి జరిగి ఉండాల్సింది కాదు. ఇక ఫైనల్ గా డైరెక్టర్ హరికృష్ణ.. ఓ కమర్షియల్ సినిమాకు ఏమేం కావాలో అన్ని చేశారు. తన వరకు న్యాయం చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే.. రొటీన్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు క్రాంతి నచ్చేస్తుంది. మిగతావాళ్లకు మాత్రం కష్టమే.
ఎంచుకున్న స్టోరీ లైన్
దర్శన్ యాక్టింగ్
చివరగా: ‘క్రాంతి’.. స్టోరీ మంచిదే కానీ!
రేటింగ్: 2