సినీ ప్రేక్షకులకు పోలీస్ కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే.. మామూలు మాస్ మసాలా సినిమాలకంటే పోలీస్ కథలు కాస్తోకూస్తో ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశము ఉంటుందని అంటుంటారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే పోలీస్ కథలు.. ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయడమే కాకుండా తెరపై కొన్ని జీవితాలను చూపిస్తాయి. తాజాగా 2000 – 2006 మధ్య బిహార్ రాష్ట్రంలో రాజకీయాలు.. పోలీసులకు, క్రిమినల్స్ కి మధ్య జరిగిన రియల్ వార్ ఆధారంగా ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ అని వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తోనే ఆసక్తిరేపిన ఈ వెబ్ సిరీస్.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ సిరీస్ చందన్ మాతో అనే క్రిమినల్, అమిత్ లోథా అనే పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. చందన్ మాతో(అవినాష్ తివారి) బిహార్ లో కరుడుగట్టిన క్రిమినల్. భూకబ్జాలు, దందాలు, సెటిల్ మెంట్స్, అక్రమ మైనింగ్, మర్డర్లు ఇలా అన్ని నేరాలు చేసి గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఇలా బిహార్ లోని రాజకీయనేతలు, పోలీస్ ఉన్నతాధికారుల అండతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటాడు. ఇలాంటి తరుణంలో.. కొత్తగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోథా(కరణ్ థాకర్) బిహార్ కి వస్తాడు. అతనికి బిహార్ ప్రభుత్వం చందన్ మాతోని పట్టుకునే బాధ్యతను అప్పగిస్తుంది. మరి చందన్ మాతోని అమిత్ లోథా పట్టుకున్నాడా లేదా? ఇద్దరి మధ్య ఎలాంటి వార్ జరిగింది? ఈ క్రమంలో అమిత్ లోథా ఎలాంటి సవాళ్లు ఫేస్ చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
సాధారణంగా బీహార్ స్టేట్ పేరు వినగానే.. రౌడీయిజం, గుండాయిజం, చోరీలు, మర్డర్లు, గ్యాంగ్ స్టర్లు, అక్రమ నేరాలకు అడ్డాగా గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్లుగా బీహార్ కి ఆ పేరుంది. అయితే.. బీహార్ లో జరిగే అక్రమాలను, క్రిమినల్స్ ని అక్కడి ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేకపోతాయి. అలాంటి టైంలో ఒక కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ చందన్ మాతో.. యంగ్ పోలీస్ ఆఫీసర్ అమిత్ లోథాల మధ్య జరిగిన పోరే.. ఈ ఖాకీ; ది బీహార్ చాఫ్టర్. ఈ కథ అంతా 2000 నుండి 2006 మధ్య జరుగుతుందని ట్రైలర్ లోనే చెప్పేశారు మేకర్స్. ట్రైలర్ లో చెప్పినట్లుగానే క్రిమినల్ చందన్ మాతో కోసం పోలీసులు వెతికే సీన్ తో స్టోరీ మొదలుపెట్టాడు దర్శకుడు.
రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు తమ స్వార్థం కోసం జనాలను క్రిమినల్స్ కి ఎలా సపోర్ట్ చేస్తారో చాలా చక్కగా చూపించారు. అందులోనూ బీహార్ అంటే గ్యాంగ్ స్టర్స్ కి అడ్డా కాబట్టి.. అప్పట్లో ఆ వయిలెన్స్ ఎలా ఉండేదో.. రచయిత బాగా రాసుకొచ్చాడు. మొత్తం 7 ఎపిసోడ్లుగా ప్లాన్ చేసిన ఈ క్రైమ్ సిరీస్ లో.. చందన్ మాతో, అమిత్ లోథాకి మధ్య ఎన్నో ఉత్కంఠను రేపే సన్నివేశాలు ఉన్నాయి. చిన్న చిన్న సెటిల్ మెంట్స్, భూకబ్జాలతో మొదలై.. హత్యలు, అక్రమ దందాలు చేసే స్థాయికి ఎదిగి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన చందన్ మాతో క్యారెక్టర్.. నాటి రోజులను, ఇన్సిడెంట్స్ ని గుర్తుచేస్తుంది.
మరోవైపు ట్రైనింగ్ పూర్తయిన పోలీస్ ఆఫీసర్ అమిత్ లోథా.. బీహార్ లో అడుగు పెట్టాక ఒక్కో కేసుని పరిష్కరించడం.. దీంతో బీహార్ ప్రభుత్వమే క్రిమినల్ చందన్ మాతోని పట్టుకునే బాధ్యతలు అమిత్ కి అప్పగించడం ఆసక్తిరేపుతాయి. అయితే.. రాజకీయ అండతో తనకు ఎదురు తిరిగినవారిని దారుణంగా చంపే చందన్ కి.. అప్పుడప్పుడే బీహార్ లో రాజకీయాలను అర్థం చేసుకుంటున్న పోలీస్ అమిత్ కి మధ్య స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. కాకపోతే.. క్రైమ్, వయిలెన్స్ తో కూడిన సన్నివేశాలు ఇదివరకు ఎన్నో సినిమాలలో చూసేశాం అనే ఫీలింగ్ కలుగుతుంది. గ్యాంగ్ స్టర్ వర్సెస్ పవర్ ఫుల్ పోలీస్.. అనే స్టోరీ ఎంచుకుని మేకర్స్ సాహసం చేశారని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా 2000-2006 మధ్య ఇన్ని దారుణాలు జరిగాయా? బీహార్ లో రాజకీయంగా, జన జీవనం పరంగా పరిస్థితులను రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ.. కొన్నిచోట్ల టెక్నికల్ అంశాలు పేలవంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక కథాకథనాలు పూర్తిగా బీహార్ చుట్టూ తిరిగినా.. చేజింగ్ సీన్స్ లో ఖాకీ మూవీ పోలికలు కనిపిస్తాయి. బట్.. ఈ సిరీస్ కి అవి కూడా అవసరమే. ఇక ఇందులో చాలామంది తెలుగులో నటించిన నటులు కూడా ఉన్నారు. శ్రద్ధాదాస్, అశుతోష్ రాణా, అభిమన్యు సింగ్, రవికిషన్ తెలిసిన ముఖాలు ఉండటం.. తెలుగు వాళ్ళు చూసేందుకు ప్లస్ పాయింట్. ఇక సిరీస్ లో అందరూ ఎవరి క్యారెక్టర్స్ కి వారు న్యాయం చేశారు.
ప్రధానంగా చందన్ మాతో, అమిత్ లోథా క్యారెక్టర్స్ లో అవినాష్ తివారి, కరణ్ థాకర్ అద్భుతంగా నటించారు. కాకపోతే.. బీహార్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యం చూపిస్తూ.. తెలుగులో డబ్ చేసినప్పటికీ, తెలుగుదనం కోరుకునే వారికి కాస్త నిరాశతప్పదు. ఈ సిరీస్ ని దర్శకుడు భవ్ ధులియా చక్కగా తెరకెక్కించాడు. అక్కడక్కడా తడబడినా ఉమాశంకర్ రచన ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సిరీస్ కి ప్లస్ అయ్యాయి. ప్రొడ్యూసర్స్ శీతల్ భాటియా, అభిషేక్ చౌస్కీల నిర్మాణ విలువలు బాగున్నాయి.
బీహార్ కథా నేపథ్యం
మెయిన్ క్యారెక్టర్స్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ సన్నివేశాలు
రొటీన్ వయిలెన్స్ సీన్స్
ఎపిసోడ్స్ డ్యూరేషన్