కన్నడ సినిమా ఇండస్ట్రీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా చేసిన సినిమా ‘KGF’. ఎప్పటినుంచో ఈ భాషలో సినిమాలు తీస్తున్నప్పటికీ.. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. గతేడాది వచ్చిన ‘కాంతార’, ‘చార్లీ 777’ చిత్రాలు… శాండల్ వుడ్ రేంజ్ ని మరింతగా పెంచేశాయి. దీంతో కన్నడ నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే చాలు అందరూ తెగ ఆసక్తి చూపించడం స్టార్ట్ చేశారు. అలా తాజాగా థియేటర్లలోకి వచ్చిన మూవీనే ‘కబ్జా’. తెలుగులో ఇప్పటికే చాలా క్రేజ్ ఉన్న ఉపేంద్ర, ఇందులో హీరోగా నటించడం, ట్రైలర్ చూడగానే ‘కేజీఎఫ్’ వైబ్స్ రావడంతో ఈ మూవీపై అంచనాలు ఓ మాదిరిగా ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ అంచనాల్ని అందుకుందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
భార్గవ్ భక్షి(కిచ్చా సుదీప్) సిటీకి కమీషనర్ గా అపాయింట్ అవుతాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. వచ్చీరాగానే నగరంలోని గుండాలు అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. తను అల్లాటప్పా పోలీసుని కాదని వాళ్లందరినీ భయపెట్టి మరీ చెప్తాడు. అలా మాటల మధ్యలో ఆర్కేశ్వర్(ఉపేంద్ర) అనే డాన్ గురించి చెబుతాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో సంగ్రామ్ అనే ఊరిలో పుట్టి పెరిగిన అర్కేశ్వర్.. స్వాతంత్ర్య యోధుడైన తన తండ్రి చనిపోవడంతో దక్షిణాదిలోని అమరాపురానికి చేరుకుంటాడు. చిన్నప్పటి నుంచి భయస్థుడైన అర్కేశ్వర్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. అలాంటి అతడు అసలు కత్తి పట్టి డాన్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ కథలో యువరాణి మధుమతి(శ్రియ) రోల్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మీరు థియేటర్ కి వెళ్లి ‘కబ్జా’ చూడాల్సిందే.
‘కబ్జా’ ట్రైలర్ చూడగానే… ఇదేంటి ‘కేజీఎఫ్’ ట్రైలర్ మళ్లీ చూస్తున్నట్లు ఉంది అని చాలామంది అనుకున్నారు. అందులో తప్పులేదు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి మ్యూజిక్ వరకు సినిమా అంతా సేమ్ టూ సేమ్ అలానే ఉంది మరి. అయితే ‘కేజీఎఫ్’లో అన్ని ఎమోషన్స్ ఎంత ఉండాలో ఫెర్ఫెక్ట్ గా అంతే ఉన్నాయి. ‘కబ్జా’ టీమ్ కూడా అలానే తీసేయాలనే తాపత్రయం ప్రతి సీన్ లోనూ కనిపించింది. కానీ ఆ ఆరాటంలో ఎమోషన్ తో పాటు చాలా అంశాల్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది. దీంతో మూవీ మొత్తం బిస్కెట్ అయిపోయింది. చూస్తున్న ప్రేక్షకుడు ఏ పాయింట్ లోనూ అస్సలు సినిమాకు కనెక్ట్ కాలేకపోతాడు.
ఫస్టాఫ్ విషయానికొస్తే.. ‘కేజీఎఫ్’లో జర్నలిస్టు తాత, రాకీభాయ్ స్టోరీ చెబుతుంటే మనకు ప్రతి సీన్ లో గూస్ బంప్స్ వస్తుంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిచోటా కనెక్ట్ అవుతాం. ‘కబ్జా’లో అది ఏ చోటా కనిపించదు. కమీషనర్ భార్గవ్ భక్షి, డాన్ ఆర్కేశ్వర్ గురించి ఎలివేషన్స్ ఇచ్చి మరీ చెబుతుంటాడు. కానీ ఏ క్యారెక్టర్ ఎందుకొస్తుందో ఎప్పుడొస్తుందో అస్సలు అర్థం కాదు. దానికి తోడు విలన్ పాత్రలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ల పేర్లు మరింత కన్ఫ్యూజ్ చేసేస్తాయి. అవి గుర్తుంచుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. పోనీ స్టోరీ బాగుందా అంటే నీరసంగా, చప్పగా సాగుతూ ఉంటుంది. ఏ పాయింట్ లోనూ అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయదు.
‘కేజీఎఫ్’ స్టైల్లో సినిమా తీయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ స్టోరీలో డెప్త్ తోపాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటే ప్రేక్షకులు ‘కేజీఎఫ్’ని మించి ఆదరిస్తారు. చెప్పాలంటే ఆ సినిమాను ఈజీగా మర్చిపోతారు. ‘కబ్జా’ టీమ్ ఆ విషయంలో పూర్తిగా ఫెయిలైంది. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఒక్క చోట కూడా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయలేకపోయింది. తెలుగు, కన్నడ నుంచి మురళీశర్మ, సుధతో పాటు చాలామంది సీనియర్ యాక్టర్స్ ని తీసుకున్నప్పటికీ ఒక్కరిని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఎంతసేపు హీరోకి ఎలివేషన్స్ ఇచ్చుకోవడం, ఎమోషనల్ సీన్ లో దబాదబా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవడంతోనే సరిపోయింది. చూస్తున్న మీరు కచ్చితంగా కొన్ని సీన్లలో అయినా తల పట్టేసుకోవడం గ్యారంటీ!
హీరో ఉపేంద్ర యాక్టింగ్ బాగానే చేశాడు. ఆర్కేశ్వర్ పాత్రలో భయస్థుడిగా, డాన్ గా డిఫరెంట్ షేడ్స్ లో అద్భుతమని చెప్పలేం కానీ ఓకే అనిపించాడు. స్టోరీలో సరైన ఎమోషన్స్ లేకపోతే ఎంత చేసినా ఏం లాభం ఉంటుంది చెప్పండి. హీరోయిన్ శ్రియ పాత్ర నిడివి చాలా తక్కువ. హీరోతో నాలుగైదు సీన్లు తప్పితే ఆమెకు యాక్టింగ్ చేసే స్కోపు అస్సలు దొరకలేదు. హీరో ఉపేంద్ర తప్పించి ఇందులో నటించిన ప్రతిఒక్కరూ చేయాల్సిన దానికంటే కాస్త అతి చేశారు! ఆయా సీన్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇది కూడా సినిమాకు చాలా పెద్ద మైనస్ అయిపోయింది.
‘కబ్జా’ మూవీ టెక్నికల్ టీమ్ లో సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ‘కేజీఎఫ్’తో తన రేంజ్ ఏంటో అందరికీ వినిపించేలా చేసిన రవి బస్రూర్.. ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే దాన్ని ఎక్కడా కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఇక అర్జున్ శెట్టి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గ్రాఫిక్స్ చాలా చోట్ల తేలిపోయింది. దానిపై ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. ఫైనల్ గా రైటర్ అండ్ డైరెక్టర్ ఆర్. చంద్రు గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ ఉపేంద్రతో రెండు సినిమాలు చేశారు. ‘కబ్జా’తో హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ అది జరిగేలా కనిపించట్లేదు. కన్నడలో కలెక్షన్స్ వస్తాయేమో గానీ తెలుగులో ఈ సినిమా నిలబడటం కష్టమే! మరో విషయం.. ‘కబ్జా’కు సీక్వెల్ ఉందని చెప్పి క్లైమాక్స్ ని ముగించారు. చూడాలి మరి దాన్ని ఎలా తీస్తారో?
చివరగా: ‘కబ్జా ‘.. సీన్ తక్కువ సౌండ్ ఎక్కువ..!
రేటింగ్: 1.5/ 5
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)