ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం ఓటిటి సినిమాలు, సిరీస్ లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓటిటిలకు కూడా ఆదరణ పెరగడంతో సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యతే వెబ్ సిరీస్ లకు కూడా ఇస్తున్నారు నటీనటులు. తెలుగు హీరోయిన్ అంజలి గతేడాది ‘ఝాన్సీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ మొదట్ సీజన్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఝాన్సీని సెకండ్ సీజన్ తో ముందుకు తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన ట్రైలర్ లతో అంచనాలు పెంచేశారు. హాట్ స్టార్ లో తాజాగా ఝాన్సీ స్ట్రీమింగ్ మొదలైంది. మరి ఝాన్సీ రెండో సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
గోవాలో ఉన్న బిల్లూ క్లబ్ అనే వేశ్యగృహానికి ఝాన్సీ(అంజలి), బార్బీ(చాందిని చౌదరి)లను అమ్మేసిన సన్నివేశాలతో ఫస్ట్ సీజన్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఆ వేశ్యగృహంలో అడుగుపెట్టాక.. ఏమైంది? అనే విషయాన్ని చెబుతూ సెకండ్ సీజన్ ని మొదలుపెట్టారు. బిల్లూ క్లబ్ ఓనర్ కొడుకు ఈథన్ (ఆదిత్య శివ్‌పింక్), ఝాన్సీని చూసి ఇష్టపడతాడు. గతం మర్చిపోయిన ఝాన్సీ.. ఈథన్ కి దగ్గరై గర్భం దాల్చుతుంది. కట్ చేస్తే.. ఝాన్సీ ఈథన్ ని చంపేస్తుంది. అక్కడినుండి అసలు కథ మొదలై.. ఈథన్ తండ్రి(రాజ్ అర్జున్) ఝాన్సీ చంపాలని చూస్తుంటాడు. మరి అతని నుండి ఝాన్సీ ఎలా తప్పించుకుంది? అసలు ఈథన్ ని ఎందుకు చంపింది? ఝాన్సీ తన గతం ఎలా మర్చిపోయింది? కథలో మిగతా క్యారెక్టర్స్ ఏం చేశాయి? అనేది సిరీస్ లో చూడాల్సిందే.
ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లర్ జానర్ స్టోరీస్ పై ఓటిటి ఆడియెన్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే.. కథలో ఎంతటి బలమైన పాయింట్ ఉన్నా.. దాన్ని తెరపై ఎలా ప్రెజెంట్ చేశారనేది మెయిన్. కాబట్టి.. వెబ్ సిరీస్ లలో కథతో పాటు ఎక్సిక్యూషన్ తో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ‘ఝాన్సీ 2’ మరోసారి తడబడింది. బిర్యానీ వండాలనుకున్నా.. మసాలాలు సరిపోలేదు అన్నట్లుగా ఇందులో అసలు కథ కంటే.. ఫ్లాష్ బ్యాక్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు మేకర్స్.
మొదటి సీజన్ ని 6 ఎపిసోడ్స్ తో నడిపించి.. రెండో సీజన్ ని 4 ఎపిసోడ్స్ కి పరిమితం చేశారు. కానీ.. సిరీస్ ని తెరపై ఆవిష్కరించిన విధానం మాత్రం కాస్త నిరాశపరిచే అవకాశం ఉంది. ఫస్ట్ సీజన్ లో ఝాన్సీ, పీడకల, విమెన్ ట్రాఫికింగ్, మాఫియా లాంటి అంశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలతో కానిచ్చేశారు. ఈసారి యాక్షన్ పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. మిగతా పాయింట్స్ ని పక్కన పెట్టేశారు. నాలుగు ఎపిసోడ్స్ లో ఝాన్సీ కథ కంటే.. మిగతా క్యారెక్టర్స్ చుట్టూ ఉన్న ఫ్లాష్ బ్యాక్ లను చూపించే ప్రయత్నం చేశారు. అయితే.. అటు ఇటు తిరిగి అన్ని క్యారెక్టర్స్ గతాలతో ఝాన్సీ లైఫ్ కి ముడి పెట్టడం జరిగింది.
ఆ క్యారెక్టర్స్, ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి అనేది రివీల్ చేయదలచుకోలేదు. ఎందుకంటే.. థ్రిల్లర్ సిరీస్ లను ఎప్పుడూ థ్రిల్ అవుతూనే చూడాలి. ఝాన్సీ ఫస్ట్ సీజన్ లో తారసపడిన పాత్రలను ఇందులో కూడా కంటిన్యూ చేశారు. కానీ.. ఝాన్సీకి ఉన్న మతిమరుపుని బాగా యూస్ చేసుకొని కథాంశం నేపథ్యాన్ని మార్చారు. ఈ క్రమంలో కొత్త ట్విస్టులు, కొత్త క్యారెక్టర్స్, సీక్వెన్స్ లతో పాటు రొటీన్ తనం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే.. ఎన్ని ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నా మెయిన్ స్టోరీ డిస్టర్బ్ అవ్వకూడదు. కానీ.. ఇందులో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ కి లెంత్ ఎక్కువ అయ్యిందని ఇట్టే అర్థమవుతుంది. పైగా ఝాన్సీ కథలో నెక్స్ట్ ఏం జరగనుంది? అనేది తెలియాలంటే అన్నీ ఫ్లాష్ బ్యాక్స్ వినాల్సి ఉంటుంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సిరీస్ ని ఇంకా సీజన్ల వారీగా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అందుకే.. సీజన్ 2లో కూడా ఝాన్సీ కథకి ముగింపు ఇవ్వలేదు. అదీగాక.. ట్రైలర్ లో చెప్పినట్లుగా చివరిలో చాందిని చౌదరి క్యారెక్టర్ చేత.. “దిస్ ఐస్ జస్ట్ బిగినింగ్” అని ట్విస్ట్ ఇచ్చారు. అయితే.. సీజన్ 2లో యాక్షన్, ఫైట్స్ హైలైట్ చేస్తూ.. ఎమోషన్స్ కి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సెకండ్ సీజన్ వస్తుందంటే.. ఎప్పుడైనా ప్రేక్షకులలో అంచనాలు ఎక్కువే ఉంటాయి. ఆ అంచనాలను కేవలం యాక్షన్ సీన్స్ తో కాకుండా సరైన మోతాదులో ఎమోషన్స్ ని కూడా జోడించి ఆడియెన్స్ కి మరింత దగ్గరవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఝాన్సీ 2 వెనక్కి తగ్గింది.
అమ్మాయి లైఫ్ లో బలమైన ఎదురుదెబ్బలు, మోసాలు, పోరాటం ఉన్నప్పుడు.. క్యారెక్టర్ ని మరింత ఎలివేట్ చేసేవిధంగా డైలాగ్స్, స్క్రీన్ ప్లేని ఇంకా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది. కానీ.. ఝాన్సీ 2 అందులో సక్సెస్ కాలేకపోయింది. 12 ఏళ్లకే విమెన్ ట్రాఫికింగ్, వేశ్యాగృహం, పెరుగుతున్నకొద్దీ మోసం.. పగలు ఇవన్నీ తెరపై ఇంపాక్ట్ కలిగించలేదు. అయితే.. యాక్షన్ లవర్స్ కి మాత్రం ఇది ఐ ఫీస్ట్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఝాన్సీ, బార్బీ క్యారెక్టర్స్ మధ్య సంభాషణ.. ఆసక్తికరంగాను, 3వ సీజన్ కి లీడ్ లాగా అనిపిస్తుంది. ఎప్పటిలాగే యాక్షన్ సీన్స్ లో అంజలి తన బెస్ట్ ఇచ్చేసింది. చాందిని చౌదరి, ఆదర్శ్, సంయుక్తా హొర్నాడ్, రాజ్ అర్జున్, రామేశ్వరి తాళ్లూరి ఇలా మిగతా నటులు పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ గా ఝాన్సీ 2కి ఆర్వీ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యాయి. విజువల్స్ తో పాటు కొన్ని సందర్భాలలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలను ఎలివేట్ చేసిందని చెప్పాలి. నిర్మాతలు కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల ప్రొడక్షన్ వాల్యూస్ తెరపై కనిపిస్తాయి. రచయితలు కథాకథనాలను ఇంకాస్త గ్రిప్పింగ్ గా.. ఫ్లాష్ బ్యాక్స్ తగ్గించి కథను ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. దర్శకుడు తిరు రైటింగ్ జోలికి వెళ్లకుండా డైరెక్టర్.. ఝాన్సీ 2ని బాగా ప్రెజెంట్ చేశాడు. ఇక లీడ్ రోల్ అంజలి.. మతిమరుపు క్యారెక్టర్ లో జీవించింది. ఇటీవల ఫాల్ సిరీస్ లో కూడా ఇలాంటి క్యారెక్టరే చేయడం గమనార్హం. ఫస్ట్ సీజన్ లో ఎక్సయిట్ అయినవారు, యాక్షన్ సిరీస్ లను ఇష్టపడేవారు ఝాన్సీ 2పై ఓ లుక్కేయొచ్చు.