కామెడీ హీరోగానే కాకుండా నటుడిగా, సహాయనటుడిగా కుదిరినప్పుడల్లా తన పెర్ఫార్మెన్స్ తో అలరిస్తున్న అల్లరి నరేష్ కథానాయకుడిగా వచ్చిన యాక్షన్ అండ్ ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి, రీసెంట్ గా వచ్చిన నాంది వంటి సినిమాల్లో అల్లరి నరేష్ యాక్టింగ్ ఏంటో చూశాం. ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు ముందుకు వచ్చారు. ఆనంది హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘుబాబు, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ సినిమాని దర్శకుడు ఏఆర్ మోహన్ అండ్ టీమ్ డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఒక ఏజెన్సీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. మరి నాంది సినిమాతో సక్సెస్ కొట్టిన అల్లరి నరేష్.. ఈ సినిమాతో హిట్ అందుకున్నారా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
అదొక మారుమూల ఏజెన్సీ ప్రాంతం. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి బతుకులకు సంబంధించిన కథ. మారేడుమిల్లి అనే ఊరే మారుమూలన ఉందంటే.. అందులో మళ్ళీ మారుమూల ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరాన కొన్ని ఊర్లు ఉన్నాయి. వాళ్లకి ఏమి కావాలన్నా కనీసం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ కింద గ్రామానికి రావాలి. కొండ పైన కొండోళ్ళు, కొండ కింద జనాలు. వాళ్ళని మనుషులన్న సంగతే మర్చిపోయింది సమాజం. సమాజానికి, కొండ వాసులకి సంబంధం తెగిపోయినట్టు ఒక తెగకు చెందిన వారిలా బతుకుతుంటారు. అడవిని నమ్ముకుని జీవిస్తుంటారు. అలాంటి వీరికి ఒక ఆపద వస్తుంది. వారుండే చోట ఒక బడి లేదు, ఒక ఆసుపత్రి లేదు. సరైన రోడ్డు మార్గం లేదు. ఒక వంతెన ఉంటే వాగు దాటి తమ అవసరాలు తీర్చుకోవచ్చు.
ముఖ్యంగా ఆపదొస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలాంటిది వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. సమాజంతో సంబంధం తెగిపోయిన అనాధల్లా బతుకుతుంటారు. ప్రాణాల మీదకు వస్తే దేవుడి మీదనే భారం వేసి వాగులు, వంకలు దాటి ఊళ్లోకి రావాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తమ తెగకి చెందిన వ్యక్తి ఒకరు చెట్టు మీద నుంచి పడిపోతాడు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వేరే మార్గం గుండా ఆసుపత్రికి తీసుకెళ్తే.. హాస్పిటల్ లోనే ప్రాణం పోతుంది. ఒక 2 గంటల ముందు తీసుకొచ్చి ఉంటే కాపాడేవాడ్ని అని డాక్టర్ చెబుతాడు. అంటే దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. వాళ్ళు సిటీకి ఎంత దూరంగా బతుకుతున్నారో అనే విషయం. కట్ చేస్తే ఉప ఎన్నికలు జరుగుతుంటాయి.
అయితే మారేడుమిల్లి నియోజకవర్గంలో వందకి వంద శాతం పోలింగ్ జరగాలని అధికారులు నిర్ణయిస్తారు. కానీ 30 ఏళ్లుగా చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా తమని పట్టించుకోవడం లేదని ఓట్లు వేయడం మానేశారు. దీంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓట్లు వేయించాలని భావిస్తారు. దీని కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతానికి పంపిస్తారు. శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) అనే తెలుగు ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ మాష్టారు (వెన్నెల కిషోర్) ఇద్దరూ అక్కడకి వెళ్తారు. వారిని ఎడ్యుకేట్ చేసి చివరకి ఓట్లు వేయిస్తారు. కానీ ఓట్లు వేస్తే ఇన్నాళ్లు తమని పట్టించుకోని ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు పట్టించుకుంటారా అని జనం ఆలోచిస్తారు. తమని పట్టించుకునేందుకు శ్రీనివాస్, ఏజెన్సీ వారితో ఏం పథకం వేశాడు. ఏజెన్సీ వారికి కావాల్సిన బడి, ఆసుపత్రి, వంతెన వంటి డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వ అధికారులని ఎలా మార్చాడు? ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులకి, ఏజెన్సీ వారికి మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
అభివృద్ధి చెందుతున్నాం అనుకునే మనకి.. అసలు అభివృద్ధి అంటే ఆకాశం అంత దూరంగా బతికే జనం ఉంటారని తెలియకుండా బతికేస్తున్న సమాజానికి మారేడుమిల్లి అనే ఒక ఏజెన్సీ ప్రాంతం ఉంటుందని.. అక్కడ వాళ్లకి ఏదైనా కావాలంటే 10, 20 కిలోమీటర్లు కొండపై నుంచి నడుచుకుంటూ కిందన ఉండే ఊరికి రావాలని, ఇక ఆపదొస్తే మనిషిని మర్చిపోవాలని బిక్కుబిక్కుమంటూ బతికే జనం ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వానికి, నేటి సమాజానికి చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఒక వ్యాలిడ్ పాయింట్ ని, సున్నితమైన అంశాన్ని పట్టుకుని దర్శకుడు ఏఆర్ మోహన్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. తెలుగు టీచర్ గా అల్లరి నరేష్ చాలా బాగా నటించారు. డబుల్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. తెలుగు భాషని చులకనగా చూసే ఈరోజుల్లో దర్శకుడు.. తెలుగు భాషని అలా అలా పైకి లేపిన విధానం ఆకట్టుకుంటుంది.
సార్ అనే పదానికి అసలైన అర్ధం చెప్పి.. మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నామని కొత్త పాయింట్ ని టచ్ చేశారు దర్శకుడు. పల్లె జీవితాలు, పూర్వీకుల ఆచారాలను టచ్ చేసుకుంటూ వెళ్లారు. కొండోళ్ళు, అందులోనూ మొండోళ్ళు. తమని పట్టించుకోవోడం లేదని 30 ఏళ్లుగా ఎవరి మాటా వినడం లేదు. ఓట్లేయమని ఎవరైనా వస్తే చంపేస్తారు. అలాంటి అడవి మనుషుల్లో వెలుగుని నింపి.. వారి ఆశలని నెరవేర్చే క్రమంలో తెలుగు టీచర్ పడ్డ కష్టాలు, ఓట్లేస్తే వారి బతుకులు మారవని తెలిసి పన్నిన పథకాలు అబ్బురపరుస్తాయి. పురిటి నొప్పులతో ఒక గర్భిణీ బాధపడుతుంటే.. ఆసుపత్రి లేక తెలుగు టీచర్ చెప్పిన పూర్వీకుల నాటువైద్యాన్ని అక్కడ ప్రయోగిస్తాడు. వీరభద్ర స్వామి దయ వల్ల తల్లి, బిడ్డా క్షేమంగా ఉంటారు. వీర భద్ర స్వామి ఏజెన్సీ వారి దైవం.
ఈ వీర భద్ర స్వామిని అండర్ లైన్ చేసుకోండి. తర్వాత మాట్లాడకుందాం. ఇక వెన్నెల కిషోర్, ప్రవీణ్ ల కామెడీ.. మధ్యలో వచ్చే రఘుబాబు హాస్యం ఆకట్టుకుంటాయి. ఇక సెవెంత్ పాస్ టీచర్ ఆనంది.. ఆయా ఏజెన్సీ వాళ్లకి చదువు చెప్తుంటుంది. ఆమెతో తెలుగు టీచర్ ప్రేమలో పడతారు. వంద శాతం ఓట్లు వేయించాలని తెలుగు టీచర్ శ్రీనివాస్ శ్రీపాదకి సెవెంత్ క్లాస్ టీచర్ సహాయం చేస్తుంది. ఈ క్రమంలో వారి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. ఏజెన్సీ అమ్మాయిగా ఆనంది చాలా బాగా నటించింది. వారి యాసలో ఆనంది పలికిన డైలాగులు ఆకట్టుకుంటాయి. అల్లరి నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. చాలా అద్భుతంగా నటించారు. ఏజెన్సీ వాసులుగా నటించిన శ్రీతేజ్ తదితరులు బాగా నటించారు. కలెక్టర్ గా సంపత్ రాజ్ బాగా నటించారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. అబ్బూరి రవి రాసిన డైలాగులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా కలెక్టర్ కి, శ్రీనివాస్ శ్రీపాద మధ్య జరిగే సంభాషణలో రాసిన డైలాగ్ చాలా బాగుంటుంది. ఆఫ్ట్రాల్ టీచర్ వి.. అని సంపత్ రాజ్ అంటే.. మా టీచర్స్ కంటూ ఒక రోజు ఉంది. మీ కలెక్టర్లకి ఏముంది అని అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ కి విజిల్స్ పడ్డాయి. మాకో బడి కావాలా.. అందులో పంతులు ఉండాలా, మాకో ఆసుపత్రి కావాలా.. అందులో డాక్టర్ ఉండాలా.., మాకో వంతెన ఉండాలా, కింద నుంచి పైదాకా లైట్లు ఉండాలా’ అని చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఏజెన్సీ అందాలను, వారి బతుకులను చాలా అందంగా చూపించారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు అంత గొప్పగా ఏం లేవు.
కొన్ని సన్నివేశాలు తర్వాత ఏం జరుగుతుందో ఊహించేలా ఉంటాయి. మొత్తం కథని బాగా రాసుకున్న దర్శకుడు.. క్లైమాక్స్ కొచ్చేసరికి సింపుల్ గా తేల్చేసినట్టు అనిపిస్తుంది. వేరేగా రాసుకునేలా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఇక ఇందాక చెప్పిన వీరభద్ర స్వామి గురించి చెప్పాలంటే.. వీరభద్ర స్వామి అంటే ఒక ఎద్దు అడవిలో తిరుగుతుంటుంది. ఆ ఎద్దుని వీరభద్ర స్వామిగా కొలుస్తారు. అలా ఆ ఎద్దు అడవి గుండా తిరుగుతున్నప్పుడు అందరూ కాళ్ళ మీద పడి మొక్కుతారు. అయితే ఏజెన్సీ వాసులకి, వీరికి అండగా ఉన్న అల్లరి నరేష్ కి.. ప్రభుత్వ అధికారులకి మధ్య జరిగిన పోరాటంలో ఆ వీరభద్ర స్వామి (ఎద్దు), ఇతర కొన్ని ఎద్దులు కాపాడతాయి. ఇదే కన్విన్సింగ్ గా అనిపించదు. ఎందుకంటే ఎద్దులు గ్రాఫిక్స్ లో చేసినట్టు తెలిసిపోతుంది. అంత రియలిస్టిక్ గా ఉండవు.
ఈ విషయంలో కాస్త అసంతృప్తి ఉంటుంది. వీరభద్ర స్వామి అనే దేవుడి పాత్రతో కథకి ఒక ముగింపు పలకాలన్నప్పుడు ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది. ఆ వీరభద్రస్వామి పాత్రే క్లైమాక్స్ కి కీలకం. ఇక వీరభద్రస్వామి (ఎద్దు) చేసిన దాడిలో కలెక్టర్ పాత్ర చేసిన సంపత్ రాజ్ కి తీవ్ర గాయాలు అయితే.. వేరే దారి లేక వాగు దాటుతూ తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో వచ్చే విజువల్స్.. ఒక విజువల్ వండర్ మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది. ఇంటర్వెల్ ముందు అల్లరి నరేష్ చేసే స్టంట్స్ ఆకట్టుకుంటాయి. నిడివి తక్కువే అయినా ఆ కాసేపు అల్లరి నరేష్ చేసే స్టంట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా మార్పు అనేది అటు రాజకీయ నాయకుల్లోనూ, ఇటు ప్రజల్లోనే కాదు ప్రభుత్వ అధికారుల్లో కూడా రావాలి అని దర్శకుడు చెప్పిన విధానం అందరికీ నచ్చుతుంది.