ఓటీటీలో ప్రతివారం ఎన్నో సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిమాత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియాలోనూ దాని గురించే తెగ మాట్లాడుకుంటారు. అలా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన మూవీ ఇరట్టా. నెట్ ఫ్లిక్స్ లో మలయాళంలో తొలుత రిలీజైన ఈ మూవీ.. హిట్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ డబ్ చేశారు. ఇందులో హీరోయిన్ అంజలి కూడా నటించింది. మరి అందరూ తెగ మాట్లాడుకుంటున్న ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
కేరళలోని వాగమన్ అనే ఊరిలోని పోలీస్ స్టేషన్ లో చిన్న ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. దీనికి స్వయానా అటవీశాఖా మంత్రి వస్తున్నారని పోలీసులు ఆ హడావుడిలో ఉంటారు. ఈ మీటింగ్ కి పలువురు ప్రజలతో పాటు మీడియా కూడా కవరేజ్ కోసం వస్తుంది. మరికాసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది అనేసరికి.. స్టేషన్ లో గన్ కాల్పులు వినిపిస్తాయి. లోపలికి వెళ్లి చూస్తే ASI వినోద్(జోజూ జార్జ్) చనిపోయి ఉంటాడు. అదే టైంలో స్టేషన్ లోపల ముగ్గురు పోలీసులు ఉంటారు. దీంతో వాళ్లపై డౌట్ వస్తుంది. ఇంతకీ వినోద్ ని చంపింది ఎవరు? డీఎస్పీ ప్రమోద్(జోజూ జార్జ్)కి వినోద్ మరణానికి సంబంధమేంటి? తెలియాలంటే ‘ఇరట్టా’ సినిమా చూడాల్సిందే.
ఇరట్టా అంటే మలయాళంలో ఇద్దరు, డబుల్ అని అర్థం. ఇది ఓ సూపర్ థ్రిల్లర్ సినిమా. ట్విన్స్ అయిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథ ఇది. పైకి చూడటానికి ఏదో నార్మల్ సినిమాలా అనిపించినప్పటికీ.. చూస్తుంటే మతి పోతుంది. ఇప్పటివరకు మీరు ఎన్నో థ్రిల్లర్స్ చూసి ఉండొచ్చు కానీ ‘ఇరట్టా’ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్. పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ చనిపోవడం.. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హంతకుడు ఎవరనేది కనుక్కోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కో లేయర్ విడిపోతున్నకొద్ది ప్రతి ఒక్కరిపైనా సందేహం వస్తుంది. అనుమానమున్న ప్రతి ఒక్కరూ వినోద్ తో గొడవల గురించి చెప్పడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో అతడి చావుకు గల కారణాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంటుంది. చివరకు వినోద్ ని అతడి సోదరుడు ప్రమోద్ చంపినట్లుగా అనుమానపడటం లాంటివి సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి.
మరోవైపు మనం రోజూ న్యూస్ లో చాలా చూస్తుంటాం. వాటిలో కొన్ని మన మనసుని చాలా డిస్ట్రబ్ చేస్తుంటాయి. అలాంటి ఓ పాయింట్ ని తీసుకునే ‘ఇరట్టా’ తీశారు. సినిమా అంతా ఓ ఎత్తయితే.. క్లైమాక్స్ మాత్రం వేరే లెవల్ ఉంటుంది. చూస్తున్న మనకు కాసేపు అర్థం కాదు. ఒక్కసారి పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే.. ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు అలా ఎలా తీశార్రా బాబు అని అనుకోకుండా ఉండలేరు. సినిమా కాస్త నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది గానీ ఎప్పుడైతే తమ్ముడి మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు డీఎస్పీ ప్రమోద్ రంగంలోకి దిగుతాడో.. స్టోరీ జెట్ స్పీడులో దూసుకెళ్తుంది. ఒక్కొక్క సీన్ రివీల్ అవుతుంటే.. మనకు మైండ్ పోతుంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో హత్యానేరాలకు సంబంధించి చిక్కుముడుల్ని పోలీసులు సాల్వ్ చేస్తుంటారు. కానీ ఇందులో ఓ పోలీస్, అది కూడా స్టేషన్ లోనే ప్రజల సమక్షంలోనే చనిపోవడం అనే పాయింట్ ని చాలా ఉత్కంఠభరితంగా తీయడాన్ని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి.
ఏదైనా సినిమాకు ప్రాణం పోయాలంటే అందులో నటీనటులే కీలకం. ‘ఇరట్టా’ విషయానికొస్తే.. జోజూ జార్జ్ రెండు డిఫరెంట్ పాత్రలని మడిచి అవతలపెట్టేశాడు. అంత అద్భుతంగా నటించాడు. డీఎస్పీ ప్రమోద్ పాత్రలో కూల్ గా, వినోద్ పాత్రలో రఫ్ గా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి స్టోరీని రక్తి కట్టించాడు. సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా మనకు వినోద్ పాత్ర కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అంత బాగా నటించాడు. కాసేపు కనిపించే అంజలి పాత్ర సినిమా మొత్తంలో చెప్పేది ఒకటే డైలాగ్. మిగిలిన సీన్లలో సైలెంట్ గా ఉంటుంది. ఆమె రోల్ ని అలానే డిజైన్ చేశారు. పోలీసులుగా చేసిన వాళ్లందరూ కూడా తమ ఫరిది మేరకు నటించారు.
‘ఇరట్టా’ సినిమా గురించి మాట్లాడుకుంటే.. మనం రైటర్ కమ్ డైరెక్టర్ రోహిత్ ఎమ్.జీ. కృష్ణన్ గురించి మాత్రమే ఫస్ట్ చెప్పుకోవాలి. రెగ్యులర్ గా న్యూస్ లో చూసే ఓ పాయింట్ ని తీసుకుని దాన్ని చుట్టూ అదిరిపోయే థ్రిల్లర్ కథని రాసుకోవడం వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాంటి క్లైమాక్స్ ఒకటి తీయొచ్చని ఏ డైరెక్టర్ కూడా కలలో కూడా ఊహించరు. దాన్ని రియాలిటీలో తీసి చూపించాడు రోహిత్. తనకు ఇది తొలి సినిమానే అయినప్పటికీ, ప్రేక్షకులని మెప్పించడంలో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. టీమ్ లోని మిగతావారిలో సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ గా సరిపోయింది. మూడు పాటలు ఓకే ఓకే. విజయ్ సినిమాటోగ్రఫీ మూడ్ ని బాగానే క్యారీ చేసింది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే డిఫరెంట్ థ్రిల్లర్ ని ట్రై చేద్దామనుకుంటే ‘ఇరట్టా’ బెస్ట్ ఆప్షన్. కాస్త సెన్సిటివ్ గా ఉన్నవాళ్లు మాత్రం ఈ మూవీ చూసేటప్పుడు జాగ్రత్త!
చివరిమాట: ‘ఇరట్టా’.. క్లైమాక్స్ డోంట్ మిస్ బిగిలు!
రేటింగ్: 2.5