యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా.. అనిల్ సుంకర సమర్పణలో, గంగపట్నం శ్రీధర్ నిర్మాతగా, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ‘హిడింబ’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తెలుగులో థ్రిల్లర్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. మేకర్స్ కథ, కథనాల పరంగా కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ప్రేక్షకులు ఆదరించారు. ఆ మధ్య హారర్, థ్రిల్లర్ జానర్‌లకు కామెడీ టచ్ ఇస్తూ వరుసగా సినిమాలొచ్చాయి. రొటీన్ ఫార్మాట్ జనాలకు బోర్ కొట్టడంతో ఈతరహా చిత్రాలు రావడం తగ్గింది. కానీ ఆడియన్స్‌ని సస్పెన్స్‌లో పడేస్తూ, షాక్‌కి గురి చేసే సీరియస్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌కి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఆ కోవలో చేసిన సినిమానే ‘హిడింబ’ అని ప్రమోట్ చేశారు మేకర్స్. యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా.. అనిల్ సుంకర సమర్పణలో, గంగపట్నం శ్రీధర్ నిర్మాతగా, అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (జూలై 20) విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
హైదారాబాద్‌లో అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. 16 మంది యువతులు అదృశ్యమవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కేరళ నుంచి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేత)ను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం నగరానికి పిలిపిస్తారు. అప్పటి వరకు ఈ కేసు విచారణ చేస్తున్న అభయ్ (అశ్విన్ బాబు)తో కలిసి ఆద్య విచారణ ప్రారంభిస్తుంది. ఈ ప్రాసెస్‌లో కాలాబండలోని బోయ (రాజీవ్ పిళ్లై) అనే కరుడుగట్టిన రౌడీ గురించి తెలుస్తుంది. అభయ్ రిస్క్ చేసి మరీ కాలాబండలో కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలను సేవ్ చేస్తాడు. అయినా కానీ మళ్లీ అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. అసలు అమ్మాయిలను ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? రెడ్ డ్రెస్ వేసుకున్న యువతులు మాత్రమే ఎందుకు టార్గెట్ అవుతున్నారు. ఈ కేసుకు అండమాన్ దీవుల్లో ఉన్న గిరిజన తెగ ‘హిడింబా’లకు సంబంధం ఏంటి? చివరకు ఆద్యకు తెలిసిన నిజమేంటి? అనేది మిగతా కథ.
ఎంచుకున్న కథ ఎలాంటిదైనా ప్రేక్షకులకు అర్థమయ్యేలా, ఆ స్టోరీతో, క్యారెక్టర్లతో వాళ్లు ట్రావెల్ చేసేలా చేస్తే ఆ సినిమాకి తిరుగుండదు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా వారికి అర్థం కాకపోతే అది వృథా ప్రయత్నమే అవుతుంది. ‘హిడింబ’ విషయంలో ఆ పొరపాటే జరిగింది. నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. తెలుగు తెరపై ఇంతవరకు రానటువంటి కథను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దర్శకుడి తప్పిదమో, లేక ఎడిటింగ్ లోపమో తెలియదు కానీ సినిమా ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేతో (ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే.. మరో సీన్ గతంలో సాగుతుంటుంది) కాస్త డిఫరెంట్‌గానే కథ చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి దర్శకుడు ఎంచుకున్న ఈ రూటే అయోమయానికి గురి చేస్తుంది.
వరుస కిడ్నాపులు, పోలీసులు రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో వారికి కొన్ని సవాళ్లు ఎదురు కావడం, చివరకు ఆ కేసును చేధించడం.. ఇలా రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ప్రథమార్థం సాగుతుంది. కాలాబండలో బోయ ముఠాతో హీరో చేసే ఫైట్ ఆకట్టుకుంటుంది. నాయికా నాయికల కెమిస్ట్రీ బాగుంది కానీ వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ సాఫీగా సాగిపోతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితీయార్థంపై ఆసక్తి పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో ఉంటుంది. ‘హిడింబ’ తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది.
నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు, ఈ తెగకు సంబంధం ఉండడం.. చివర్లో వచ్చే ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ప్రేక్షకులరు థ్రిల్ కలిగిస్తుంది. అయితే డైరెక్టర్ చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. పోలీసులు పెద్దగా కష్టపడకుండానే కిడ్నాప్‌కి సంబంధించిన క్లూలు లభించడం, సిటీ దాటి వెళ్లొద్దని ఆద్యకు డీజీపీ చెప్పినా.. ఆమె కేరళకు వెళ్లడం, ఇలా చాలా సీన్స్ రియాలిటీకి దూరంగా ఉంటాయి. స్క్రీన్‌ప్లే కాస్త టైట్‌గా రాసుకుని ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.
పోలీస్ ఆఫీసర్ అభయ్ క్యారెక్టర్‌కు అశ్విన్ బాబు చక్కగా సరిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే యాక్టింగ్ విషయంలో చాలా మెరుగయ్యాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే స్టార్ హీరోలకు తగ్గకుండా చేశాడు. క్లైమాక్స్‌లో తన పర్ఫార్మెన్స్ పీక్‌లో ఉంటుంది. ఇక ఐపీఎస్ అధికారి ఆద్యగా నందితా శ్వేత తన నటనతో ఆకట్టుకుంటుంది. హీరోతో ఈక్వల్‌గా ఉండే రోల్ తనది. మకరంద్ దేశ్ పాండే పాత్ర సినిమాకు ప్లస్. ఆ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం అన్నంత బాగా చేశాడు. రఘు కుంచె, సంజయ్ స్వరూప్, రాజీవ్ పిళ్లైతో పాటు మిగతా ఆర్టిస్టులంతా పాత్రల పరిధిమేర నటించారు.
ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ వికాస్ బాడిస మ్యూజిక్. పాటల సంగతి పక్కన పెడితే ఇలాంటి మూవీస్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్. తన ఆర్ఆర్‌తో సీన్స్‌ను ఎలివేట్ చేయడంతో పాటు ప్రేక్షకులను భయపెట్టాడు కూడా. బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సందర్భానికి తగ్గట్టు ఫ్రేమ్స్ పెట్టడంలో అతని పనితనం కనిపిస్తుంది. నిర్మాత సినిమాకి అవసరమైనంత ఖర్చు పెట్టారు.
చివరగా: కొన్ని ట్విస్ట్‌లతో అక్కడక్కడా మెప్పించే ‘హిడింబ’
రేటింగ్: 2/5