తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినూత్నమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలని తపించే యువనటులలో ఒకరు సత్యదేవ్.. కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే.. సత్యదేవ్ నుండి వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల తర్వాత ఆ స్థాయి సూపర్ హిట్ అందుకోలేకపోయాడు. మధ్యలో తిమ్మరుసు, స్కైలాబ్ సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మొత్తానికి తనకు బ్లఫ్ మాస్టర్ తో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు గోపి గణేష్ పట్టాభితో కొత్తగా ‘గాడ్సే’ సినిమా చేశాడు. యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన గాడ్సే.. ట్రైలర్ తో ప్రేక్షకులలో ఆసక్తికలిగించింది. అలాగే.. ట్రైలర్ లో ఉన్న డైలాగ్స్, బ్లఫ్ మాస్టర్ కాంబినేషన్ కాబట్టి సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. మరి సక్సెస్ ఫుల్ కాంబో అనిపించుకున్న సత్యదేవ్ – గోపి గణేష్ ల ‘గాడ్సే’ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి బ్లఫ్ మాస్టర్ మ్యాజిక్ చేసిన ఈ కాంబో.. గాడ్సేతో మరోసారి ఆ మ్యాజిక్ క్రియేట్ చేశారా లేదా? మూవీ రివ్యూలో చూద్దాం!
నగరంలో వరుసగా పేరుమోసిన రాజకీయ నాయకులు, ప్రముఖులను కిడ్నాప్ చేసి హతమార్చుతుంటాడు విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే (సత్యదేవ్). ఈ క్రమంలో పోలీస్ వ్యవస్థతో పాటు రాష్ట్ర రాజకీయాలలో సీరియస్ వాతావరణం ఏర్పడుతుంది. లండన్ లో బిజినెస్ మ్యాన్ అయినటువంటి గాడ్సే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. ఎలాగైనా గాడ్సేని ఆపాలని ప్రభుత్వం ఏఎస్పీ వైశాలి(ఐశ్వర్యలక్ష్మీ)ని రంగంలోకి దింపుతుంది. అయితే.. దర్యాప్తులో భాగంగా ఆమెకు గాడ్సే గురించి, అతని గతం గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో సామాన్య జనాలకు తెలియని పెద్ద రాజకీయ కుంభకోణం బయటపడుతుంది. మరి ఆ రాజకీయ కుంభకోణం ఏంటి? మంచి బిజినెస్ మ్యాన్ అయిన గాడ్సే ఇంత హింసాత్మకంగా ఎందుకు మారాడు? అసలు గాడ్సే సమాజానికి ఏం సందేశం ఇచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ.. అందులో కొందరు మాత్రమే విభిన్నమైన కథలతో, విలక్షణమైన నటనతో సినిమాలు చేస్తున్నారు. స్టార్ డమ్ కోసం ఆరాటపడకుండా కేవలం అద్భుతమైన నటనతో నటులుగా సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు సత్యదేవ్. ఈ విషయాన్నీ ఇదివరకే పలు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే.. బ్లఫ్ మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి అదే డైరెక్టర్ తో సినిమా చేసేసరికి ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ చూస్తేనే పొలిటికల్ వ్యవస్థపై ఏదో పవర్ ఫుల్ ప్రస్తావన తెచ్చినట్లు అనిపించింది.
క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా ఎదిగిన సత్యదేవ్.. అన్నీ జానర్లలో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పొలిటికల్ థ్రిల్లర్ గాడ్సే చేశాడు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థను చూపిస్తూ.. అందులో దాగిఉన్న కుట్రలు, అవినీతిని ఎత్తిచూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపి గణేష్. గాడ్సే ద్వారా దర్శకుడు వ్యవస్థపై తనకున్న బలమైన ఆలోచనలను.. ప్రేక్షకులు చేత ఆలోచింపజేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. గతంలో కూడా రాజకీయ వ్యవస్థపై సందేశాత్మక కథాంశాలతో భారతీయుడు, జెంటిల్ మెన్, ఠాగూర్ లాంటి సినిమాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. గాడ్సేని కూడా ఆ తరహా ట్రీట్మెంట్ తో చెప్పాలనుకున్నారు మేకర్స్.
రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ వచ్చిన సినిమాల తాలూకు సన్నివేశాలు గాడ్సేలో కనిపిస్తాయి. కానీ.. జానర్ ఒకటే కాబట్టి.. సినిమాలోని కథకు ఆ సన్నివేశాల అవసరం కూడా అంతే ఉందనిపిస్తుంది. ఎన్నో లక్ష్యాలతో, ఏవేవో సాధించాలనే ఆశలతో గ్రాడ్యుయేషన్స్ పూర్తిచేసిన విద్యార్థులు.. ఒకటి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు లేదా చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. దీనంతటికి కారణం రాజకీయ వ్యవస్థలోని లోపమేనని బలంగా సూటిగా చెప్పేశాడు దర్శకుడు. బ్లఫ్ మాస్టర్ తోనే అద్భుతమైన డైలాగ్ రైటర్ అనిపించుకున్న గోపి గణేష్ పెన్ పవర్.. గాడ్సేలో మరింత బలంగా కనిపిస్తుంది.
సినిమాలో స్కోప్ ఉన్న ప్రతిచోటా తన డైలాగ్ పవర్ ని చూపించేసాడు. మేజర్ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా గాడ్సే(సత్యదేవ్)కి, ఏఎస్పీ వైశాలికి మధ్య జరిగే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఇక గాడ్సేగా సత్యదేవ్ పాత్ర పరిచయంతో సినిమా మొదలవుతుంది. గాడ్సేగా సత్యదేవ్ వాయిస్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకూ సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. అయితే.. సెకండాఫ్ స్టార్టింగ్ లో గాడ్సే గతం.. సినిమా గ్రాఫ్ ని కాస్త స్లో చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ.. కథకు ఇంపార్టెంట్ సీక్వెన్స్ కాబట్టి.. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఇంటరెస్టింగ్ ఎపిసోడ్స్ తో.. మరోవైపు సత్యదేవ్ బలమైన డైలాగ్స్ తో సీట్లో కూర్చోబెడుతుంది.
ఈ సినిమాను ఓ రకంగా సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. అతని యాక్షన్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు సీట్స్ లో కూర్చోబెట్టేందుకు ట్రై చేశాడు. తన క్యారెక్టర్ వరకూ సత్యదేవ్ నూటికి నూతయాభై శాతం న్యాయం చేశాడు. గాడ్సే మూవీలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ.. ఇదివరకే చూసిన పొలిటికల్ థ్రిల్లర్స్ తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి.. దర్శకుడు ఈ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా ముగించాడు.. సెకండాఫ్ బాగుంది అనిపించారు. కానీ క్లైమాక్స్ లో కాసేపు సత్యదేవ్ వీరంగం చూడవచ్చు. అతను చెప్పే పాయింట్స్ అన్నీ జనాలను బలంగా కదిలిస్తాయి.
హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి తొలిచిత్రం అయినప్పటికీ.. సినిమాలో ఆమెకు మంచి స్పేస్ దొరికింది. ఇక సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ లో ఇతర నటులంతా పర్వాలేదు అనిపించారు. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభికి సమాజంపై బలమైన ఆలోచనలు ఉన్నాయి. కొన్ని సామాజిక సమస్యలను ప్రస్తావించడానికి ప్రయత్నించాడు. కానీ, కమర్షియల్ ఫార్మాట్‌లో అది సరిపోలేదు. ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకూ ఎంగేజ్ చేయడంలో కొన్నిచోట్ల విఫలమయ్యాడు. కానీ డైలాగ్స్ మాత్రం ఆదరగొట్టేసాడు. టెక్నికల్ గా గాడ్సే బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. శాండీ అద్దంకి, సునీల్ కష్యప్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరిగా గాడ్సే ఆలోచింపజేసే సినిమా.
సత్యదేవ్ యాక్టింగ్
గోపి గణేష్ డైలాగ్స్
స్టోరీ పాయింట్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
పట్టు సడలిన కథనం
అక్కడక్కడా రొటీన్ సీన్స్
చివరిమాట: యువతను ఆలోచింపజేసే గాడ్సే..!
గమనిక: ఈ రివ్యూ.. సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.