GodFather Review: తెలుగు ఇండస్ట్రీలో అటు క్లాసు.. ఇటు మాసు.. రెండు వర్గాల ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తున్న స్టార్.. మెగాస్టార్ చిరంజీవి. ‘ఖైదీ నెం 150’ లాంటి బ్లాక్ బస్టర్‌తో మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ అంతా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తాజాగా ‘గాడ్ ఫాదర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి పొలిటికల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘లూసిఫర్’కి రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్.. బాస్‌కి కంబ్యాక్ హిట్ ఇచ్చిందా? మెగా ఫ్యాన్స్‌ని ఆకట్టుకుందా? లేదా రివ్యూలో చూద్దాం!
స్టేట్ సీఎం పికేఆర్ ఆకస్మికంగా చనిపోవడంతో.. ఆయన తర్వాత నెక్స్ట్ సీఎం కుర్చీలో కూర్చోబోయేది ఎవరు? అనే పాయింట్ చుట్టూ గాడ్ ఫాదర్ కథ సాగుతుంది. పీకేఆర్ మరణించడంతో నెక్స్ట్ సీఎం అయిపోవాలనే ఆశతో కొద్దిమంది ఎదురుచూస్తుంటారు. ఓవైపు పార్టీ కోసం పనిచేసిన వర్మ(మురళీశర్మ).. మరోవైపు పీకేఆర్ కూతురు సత్యప్రియ(నయనతార) భర్త జయదేవ్(సత్యదేవ్) సీఎం అవ్వాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పుడే.. సీఎం స్థానాన్ని అర్హులైనవారే స్వీకరించాలని కథలోకి ఎంటర్ అవుతాడు బ్రహ్మ(చిరంజీవి) అలియాస్ గాడ్ ఫాదర్. మరి బ్రహ్మ రాకతో కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? పీకేఆర్ తర్వాత సీఎం ఎవరయ్యారు? పీకేఆర్‌కి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో సల్మాన్ ఖాన్ రోల్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఓ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మాస్, క్లాస్ అనే తేడాలేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్టామినా చిరంజీవిది. ఆయన స్టైల్, డాన్స్, గ్రేస్.. మాస్ యాటిట్యూడ్.. పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతి అంశంలో మెగాస్టార్ తన ఫ్యాన్స్ ని మెప్పిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీతో మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా ఫెస్టివల్ సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మెగాస్టార్ నుండి వచ్చిన చివరి రెండు సినిమాలు నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ అంతా గాడ్ ఫాదర్ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా ఈ చిత్రాన్ని మోహన్ రాజా రూపొందించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. లూసిఫర్ చూసినవారికి స్టోరీ లైన్ ఒకటే అనిపించినా.. స్క్రీన్ ప్లేలో, క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ లో చేసిన మార్పులు స్పష్టంగా అర్థమవుతాయి. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ మోహన్ రాజా.. గాడ్ ఫాదర్ స్క్రిప్ట్ ని బలంగా రాసుకున్నాడు. ప్రమోషన్స్ లో చెప్పినట్లుగానే సీన్ లో చిరు లేకపోయినా.. ఆయన ప్రస్తావన మాత్రం సినిమా అంతా సాగుతుంది.
గాడ్ ఫాదర్ మూవీని దర్శకుడు చాలా కొత్తగా స్టార్ట్ చేశాడు. గోవర్ధన్(పూరి జగన్నాథ్) అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ నేరేషన్ తో సినిమా మొదలైంది. స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మృతి.. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చే ఒక్కో మెయిన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది. అయితే.. ఏ మాత్రం దాచకుండా నెక్స్ట్ సీఎం కాబోయే ఛాన్స్ ఎవరెవరికి ఉందో.. ఎవరెలా రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటరెస్టింగ్‌గా చెప్పాడు దర్శకుడు. ఇక పీకేఆర్ అల్లుడు జయదేవ్(సత్యదేవ్), కూతురు సత్యప్రియ(నయనతార)లను పరిచయం చేసిన డైరెక్టర్.. బ్రహ్మ క్యారెక్టర్ లో చిరు ఎంట్రీని మాత్రం బాగా డిజైన్ చేసుకున్నాడు.
ఇక బ్రహ్మ అలియాస్ గాడ్ ఫాదర్ ఎంట్రీతో కథ ఊపు అందుకుంటుంది. అప్పటినుండి పీకేఆర్ అల్లుడు జయదేవ్ సీఎం సీట్ కోసం చేసే కుట్రలు, రాజకీయాలు, పన్నాగాలు చూపిస్తూనే.. మరోవైపు బ్రహ్మ జయదేవ్ ఆగడాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చూపించాడు. అయితే.. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం డైరెక్టర్ జాగ్రత్తపడ్డాడు. సినిమా మొదలైన క్షణం నుండే ఎక్కడా స్లో అనిపించదు. ఇక ఇంటర్వెల్ టైంలో సూపర్ ట్విస్టులు.. ఎలివేషన్స్ తో మాస్ ఫైట్స్ విజిల్స్ వేయిస్తాయి. ముఖ్యంగా గాడ్ ఫాదర్ మూవీ ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి.
సెకండాఫ్ కి వచ్చేసరికి పీకేఆర్ స్థానం కోసం ఒక్కొక్కరు చేస్తున్న అరాచకాలను బయట పెట్టడం ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ కథలో భాగంగానే సాగడం విశేషం. మెయిన్ క్యారెక్టర్స్ తో పాటు బ్రహ్మాజీ, సునీల్, అనసూయ, దివి, షఫీ ఇలా చాలామంది క్యారెక్టర్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో మెగాస్టార్ తర్వాత సినిమా అంతా కనిపించే క్యారెక్టర్ జయదేవ్.. ఈ క్యారెక్టర్ లో సత్యదేవ్ అద్భుతమైన విలనిజం పండించాడు. అయితే.. సినిమాలో సాంగ్స్ ని కథకు డిస్టర్బ్ అవ్వకుండా వాడుకున్నారు. చిరు ఎలివేషన్స్ కి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది. పెద్ద హడావిడి లేకుండా కూల్ గా కొట్టాడు.
సెకండాఫ్ లో చాలా ట్విస్టులు.. మలుపులు.. ఎమోషన్స్.. ప్రీ క్లైమాక్స్ వరకూ సినిమా ఆకట్టుకున్నాయి. కానీ.. క్లైమాక్స్, చివరిలో తార్ మార్ సాంగ్ గొప్పగా అనిపించవు. అదిగాక.. సెకండాఫ్ లో మసుమ్ భాయ్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చేసరికి.. డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని కూడా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ లో లాజిక్స్ మిస్ అయినా.. ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగానే డిజైన్ చేయడం ప్లస్ అయ్యింది. ఇక ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్టు.. కథ మొదలైనప్పుడు పెట్టిన లింక్ తో ముడివేసి సంతృప్తి పరిచాడు డైరెక్టర్. అయితే.. ఇందులో చిరు చెప్పే డైలాగ్స్.. అక్కడక్కడా ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడినట్లుగా అనిపిస్తాయి.
డైలాగ్ రైటర్ లక్ష్మీభూపాల డైలాగ్స్ బాగున్నాయి. అవసరం అనిపించినంత వరకే రాసి మెప్పించాడు. ఇక సినిమాలో అందరి క్యారెక్టర్స్ కీలకమే. పూరి జగన్నాథ్ క్యారెక్టర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. బ్రహ్మ అలియాస్ గాడ్ ఫాదర్ ఆల్వేస్ మెగాస్టార్ విజిల్స్ వేయించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నయనతార డీసెంట్ గా చేసింది. జయదేవ్ గా సత్యదేవ్ ఇరగదీసాడు. మంచి కథను తెలుగులో మెగాస్టార్ ఇమేజ్ తో డైరెక్టర్ మోహన్ రాజా చక్కగా ప్రెజెంట్ చేశాడు. తెలుగు నేటివిటికి తగిన మార్పులు చేసినట్లే అనిపిస్తుంది.. కానీ.. పూర్తిగా అయితే మార్చలేదు.
నీరవ్ షా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అందరిని చాలా బాగా తెరపై ఆవిష్కరించాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకు న్యాయం చేశాడు. సాంగ్స్ పరంగా ట్రోల్స్ ఫేస్ చేసినా.. సినిమాలో జాగ్రత్తపడినట్లు తెలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. మొత్తానికి దసరా సందర్బంగా గాడ్ ఫాదర్ మూవీతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించేశారు మెగాస్టార్. మరి మున్ముందు ఎలాంటి విజయాన్ని ప్రేక్షకులు అందిస్తారో చూడాలి.
చివరిమాట: బ్లాక్ బస్టర్ మెగా ఫీస్ట్!
రేటింగ్: 2/5