క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ 'దహాద్'. తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకెందుకు లేటు, రివ్యూ చదివేయండి.
ఓటీటీల పుణ్యమా అని ఇతర భాషల సినిమాలతో పాటు వెబ్ సిరీసులు చూడటం మనకు బాగా అలవాటైపోయింది. అందుకు తగ్గట్లే ప్రతివారం కచ్చితంగా ఒకటి రెండు కంటే ఎక్కువగానే డబ్బింగ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. తాజాగా అలా ప్రేక్షకుల్ని పలకరించిన వెబ్ సిరీస్ ‘దహాద్’. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సోనాక్షి సిన్హా.. దీనితోనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది తెలియాలంటే రివ్యూ చూసేయాల్సిందే.
రాజస్థాన్ లోని మండావా పోలీస్ స్టేషన్ లో అంజలి భాటి(సోనాక్షి సిన్హా) ఎస్ఐగా పనిచేస్తుంటుంది. ఆ ఏరియాలోనే ఉండే కృష్ణ చందాల్ అనే అమ్మాయి, లవ్ చేసిన కుర్రాడితో లేచిపోతున్నానని లెటర్ రాసి ఇంటినుంచి వెళ్లిపోతుంది. కానీ ఎన్నిరోజలకు తిరిగి ఫోన్ చేయకపోవడంతో కృష్ణ అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఈ కేసు విచారణ స్టార్ట్ చేసిన అంజలికి మైండ్ బ్లాంక్ అయిపోయే విషయాలు తెలుస్తాయి. రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో దాదాపు 27 మంది అమ్మాయిలు.. సేమ్ ఇలానే లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారని, ఆ తర్వాత వాళ్లందరూ ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ వీళ్లని చంపింది ఎవరు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది వెబ్ సిరీస్ కథ.
మండావా సీఐ దేవీ సింగ్ ఓ రోజు రాత్రి తన ఇంట్లోనే భార్యతో సె*క్స్ చేస్తుంటాడు. ఓ సందర్భంలో కళ్లు మూసుకోగానే అతడికి తన దగ్గర ఎస్ఐగా పనిచేస్తున్న అంజలి గుర్తొస్తుంది. భార్యతో చేస్తున్న ఆ పని మధ్యలో ఆపేసి, రూమ్ నుంచి బయటకొచ్చేస్తాడు. దీంతో అతడి భార్య చిరాకు పడుతుంది. సదరు సీఐకి అసలు ఎందుకిలా జరిగిందనేది అస్సలు అర్థం కాదు. నార్మల్ గా చూస్తే ఇది ‘దహాద్’లోని ఓ సింపుల్ సీన్. ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత.. ఈ సన్నివేశం వెనకున్న డెప్త్, అసలు కారణం ఏంటనేది అర్థమవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సిరీస్ స్టోరీ కొత్తదేం కాదు. కానీ స్క్రీన్ ప్లే, మేకింగ్, ట్రీట్ మెంట్ విషయంలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. దానికి తోడు ప్రతి ఎపిసోడ్ ని థ్రిల్లింగ్ గా ఉండేలా చూసుకున్నారు. ఆ విషయంలో టీమ్ పూర్తిగా సక్సెస్ అయ్యారు!
మీరు ఏ భాషలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసుకున్నా సరే రెండే రెండు పాయింట్స్ తో కథ నడిపించేస్తారు. ఎవరా సైకో? ఎందుకు చంపుతున్నాడు? ‘దహాద్’ సిరీస్ లోనూ దాదాపు 27 మంది అమ్మాయిలని, అది కూడా మిడిల్ క్లాస్ పెళ్లి కానీ వాళ్లని టార్గెట్ చేసి మరీ ఓ సైకో చంపేస్తుంటాడు. కాదు కాదు ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంటాడు. అసలు వీళ్ల చావుకి కారణం ఏంటి అనే హుక్ పాయింట్ ఆధారంగా దాదాపు ఎనిమిది ఎపిసోడ్స్ నడిపించేశారు. ఈ విషయంలో టీమ్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. ఒకటి, రెండో ఎపిసోడ్ కే కిల్లర్ ఎవరనేది చెప్పేసి అక్కడి నుంచి ఎనిమిదో ఎపిసోడ్ వరకు అసలు ఎందుకు చంపుతున్నాడు అనేది రివీల్ చేయకుండా భలే ఇంట్రెస్టింగ్ గా చూపించారు. నార్మల్ గా కిల్లర్ ఎవరో తెలిసిపోయిన తర్వాత ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ ‘దహాద్’లో మాత్రం ఊహించని సీన్స్ వస్తుంటాయి. స్క్రీన్ ప్లే పరుగులు పెడుతూ ఉంటుంది. కిల్లర్ ఎవరో తెలిసిపోయినా అతడిని పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. అయితే ప్రతి ఎపిసోడ్ దాదాపు 50 నిమిషాలు ఉండటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ప్రతిదాంట్లోనూ 5-10 నిమిషాలు తగ్గించుంటే బాగుండేది.
‘దహాద్’ పేరుకే క్రైమ్ థ్రిల్లర్. కానీ వెబ్ సిరీస్ గా తీస్తున్నారనో ఏమో గానీ చాలా విషయాల్ని అంతర్లీనంగా జోడించారు. అవేవి మీకు ఇబ్బంది కలిగించవు, చూస్తుంటే అవును నిజమే కదా అనిపించేలా ఉంటాయి. సీఐ తన కొడుక్కి సె*క్స్ పై అవగాహన కల్పించే సీన్, తక్కువ కులం యువతులు తప్పిపోతున్నారు కాబట్టి ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఎస్ఐ అంజలి ఎమోషనల్ అయ్యే సీన్ చాలా నేచురల్ గా ఉంటూనే మనల్ని ఆలోచింపజేస్తాయి. కుల-మత-రాజకీయాలన్ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తూ వెళ్లారు. ఓ హిందీ ఫ్రొఫెసర్, అది కూడా ఉమెన్స్ కాలేజీలో పాఠాలు చెప్పే వ్యక్తి, భార్య కొడుకు ఉన్న వ్యక్తి.. అంతమంది అమ్మాయిల్ని ఎందుకు చంపాడు? సైకోగా ఎందుకు మారాడు? అనేదానికి క్లైమాక్స్ లో సింపుల్ గా ఎండింగ్ ఇచ్చేసినట్లు అనిపిస్తుంది. కానీ అతడి ఫ్యామిలీ, సిరీస్ లో మిగతా సీన్లు గమనిస్తే అసలు కాన్సెప్ట్ పై మీకు క్లారిటీ వచ్చేస్తుంది. పోలీసులకు.. వారు డీల్ చేస్తున్న కేసుల వల్ల కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయని ఇందులో చూపించారు. మధ్య తరగతి కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లి అనే కాన్సెప్ట్ వల్ల ఎంత విధ్వంసం జరుగుతుందనేది.. ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు కచ్చితంగా ఐడియా వస్తుంది. ఈ సిరీస్ చూసిన తర్వాత మీ ఇంట్లో అమ్మాయిల ఉంటే, వాళ్ల విషయంలో కచ్చితంగా భయమేస్తుంది.
హీరోయిన్ గా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న సోనాక్షి.. ‘దహాద్’ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎస్ఐ అంజలిగా చాలా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇండిపెండెంట్ అమ్మాయిగా చక్కగా నటింటింది. ఈమె రోల్ కి తెలంగాణ యాసతో డబ్బింగ్ చెప్పడం ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అది బాగా సూటైయింది కూడా. సైకో విలన్ ఆనంద్ గా విజయ్ వర్మ కరెక్ట్ గా సెట్ అయిపోయాడు. చాలా కూల్ గా సింపుల్ అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. సీఐగా గుల్షన్ దేవయ్య, ఎస్ఐగా సోహమ్ షా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా రోల్స్ చేసినవాళ్లు పర్వాలేదనిపించారు.
సినిమా క్వాలిటీకి ఏ మాత్రం తీసిపోని విధంగా ‘దహాద్’ వెబ్ సిరీస్ ఉంది. తనయ్ సతమ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. రాజస్థాన్ అందాల్ని లాంగ్ షాట్స్ తో చాలా చక్కగా క్యాప్చర్ చేసింది. గౌరవ్, తరన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సిరీస్ మూడ్ కి తగ్గట్లు సెట్ అయిపోయింది. ఆనంద్ సుబాయా ఎడిటింగ్ విషయంలో కాస్త దృష్టి పెట్టుండాల్సింది. ప్రతి ఎపిసోడ్ ని కాస్త ట్రిమ్ చేసుంటే.. మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. డైరెక్టర్స్ రీమా కగ్టి, రుచికా ఒబెరాయ్ తమ వర్క్ తో మెస్మరైజ్ చేశారు. ఓవరాల్ గా చూస్తే.. థ్రిల్లర్స్ అంటే ఇష్టపడేవారికి ‘దహాద్’ గ్యారంటీగా నచ్చుతుంది. ఫ్యామిలీతో చూడటానికి కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. మీ ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలుంటే మాత్రం ఈ సిరీస్ కచ్చితంగా చూడండి.
చివరగా: తెలిసిన స్టోరీనే.. థ్రిల్ మాత్రం చాలా!
రేటింగ్: 2.5