చాలామంది ఇష్టమైన జానర్ థ్రిల్లర్. అది సినిమా కావొచ్చు, వెబ్ సిరీస్ కావొచ్చు. చూస్తున్నంత సేపు థ్రిల్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటివి కొత్తగా ఏమైనా రిలీజ్ అయ్యాయా అని ఓటీటీలో తెగ వెతికేస్తుంటారు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు.. మంచి సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇక అందులో తమకు నచ్చిన హీరో ఉంటే కచ్చితంగా చూడాల్సిందేనని ఫిక్సయిపోతారు. ఇక ‘సీతారామం’తో తెలుగువాళ్లకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చుప్’. తాజాగా జీ5 ఓటీటీలో రిలీజ్ కాగా, తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా రివ్యూ ఏంటో చూద్దామా?
ముంబయిలో ఒకరి తర్వాత మరొకరు అన్నట్లు హత్యలు జరుగుతుంటాయి. సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్ ని టార్గెట్ గా చేసుకుని.. రివ్యూ ఏ స్టైల్లో అయితే రాశారో, ఓ సీరియల్ కిల్లర్ అలానే చంపేస్తుంటాడు. అతడిని పట్టుకోవడానికి క్రైమ్ బ్రాండ్ ఆఫీసర్ అరవింద్(సన్నీ డియోల్) ప్రయత్నిస్తుంటాడు. తక్కువ రేటింగ్ ఇస్తే కిల్లర్ చంపేస్తాడేమోనని భయపడి, పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. అయినా సరే హత్యలు ఆగవు. దాంతో క్రిటిక్స్ పూర్తిగా రివ్యూలు రాయడమే మానేస్తారు. ఎంటర్ టైన్ మెంట్ రిపోర్టర్ నీలా మేనన్(శ్రియ ధన్వంతరి) తో అరవింద్ ఓ రివ్యూ రాయిస్తాడు. మొదట్లో ధైర్యంగా ఉన్న నీలా.. తర్వాత భయపడుతుంది. పోలీసులు అండగా ఉన్నప్పటికీ భయపడుతుంది. అప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ డానీ(దుల్కర్ సల్మాన్) ఏం చేశాడు? వీళ్ల లవ్ స్టోరీ ఏంటి? పోలీసులు ఫైనల్ గా సీరియల్ కిల్లర్ ని పట్టుకున్నారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
చుప్ మూవీ కాన్సెప్ట్ బాగుంది. చెప్పాలంటే కొత్తగా ఉంది. సినిమాలకు స్టార్ రేటింగ్స్ ఇస్తూ రివ్యూలు రాసే వాళ్లని చంపేసి, వాళ్ల నుదుటిపై కిల్లర్ స్టార్ రేటింగ్ వేసే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక్కొక్కరిని చంపేసిన తీరు.. ఒళ్లు జలదరించేలా చేస్తుంది. క్రికెట్ స్టేడియంలో మర్డర్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. సినిమా చాలా థ్రిల్లింగ్ గా ప్రారంభమవుతుంది. ఫస్ట్ మర్డర్, ఆ తర్వాత మర్డర్స్ చూస్తుంటే.. చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఆ సస్పెన్స్, థ్రిల్ ని మెంటైన్ చేసిన డైరెక్టర్.. ఆ తర్వాత మాత్రం స్టోరీ పూర్తిగా ట్రాక్ తప్పింది. ఎందుకంటే స్టోరీ బ్యాక్ గ్రౌండ్ బాగున్నప్పటికీ.. రెగ్యులర్ థ్రిల్లర్ మూవీస్ చూసేవారు, అతడిని కనిపెట్టేస్తారు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి క్లూస్ అందుతూ ఉంటాయి.
ఎప్పుడు డిఫరెంట్ ఐడియాస్ తో మూవీస్ తీసే డైరెక్టర్ ఆర్.బాల్కీ మరోసారి తన స్పెషాలిటీ చాటుకున్నారు. కానీ దాన్ని మూవీ మొత్తం చూపించలేకపోయారు. ‘చుప్’లో ఇంటర్వెల్ తర్వాత సీరియల్ కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది. దీంతో స్టోరీ స్లో అయిపోతుంది. రెగ్యులర్, రొటీన్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మళ్లీ క్లైమాక్స్ దగ్గర ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక గురుదత్ పై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని.. ఈ సినిమాలో డైరెక్టర్ ఆర్.బాల్కీ చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతున్నప్పుడు వెనక నుంచి ‘ప్యాసా’ పాట ప్లే అవుతుంటే.. ఓ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.
టెక్నికల్ విషయాలకొస్తే.. దుల్కర్ మరోసారి తన అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ‘సీతారామం’ సినిమాకు, దీనికి అసలు సంబంధమే ఉండదు. యాక్టింగ్ లో చాలా వేరియేషన్ చూపించాడు. దుల్కర్ చేసిన పాత్రలో మరో నటుడిని ఊహించుకోలేం అనేంత బాగా ఫెర్ఫార్మ్ చేశాడు. ఇక దుల్కర్ కి జోడీగా చేసిన శ్రియ ధన్వంతరి ఉన్నంతలో చక్కగా నటించింది. వీరిద్దరూ కూడా నార్మల్ డ్రస్సులో కనిపిస్తూ, చాలా నేచురల్ గా నటించారు. కెమిస్ట్రీ కూడా భలే వర్కౌట్ అయింది. ఇక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా చేసిన సన్నీ డియోల్ కూడా పర్వాలేదనిపించాడు. పోలీస్ లానే కనిపించాడు. ఆయన పాత్ర ఎక్కడా కూడా అతిగా చూపించలేదు. గెస్ట్ రోల్ లో అమితాబ్ బచ్చన్ అలా మెరిసి ఇలా మాయమైపోయారు. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవల్ ఉన్నాయి. సీన్లను మరింతగా ఎలివేట్ చేశాయి. ఇక డైరెక్టర్ బాల్కీ కూడా ప్రేక్షకులు వందకు వందశాతం ఎంటర్ టైన్ చేయాలని చూశారు. కానీ సెకండాఫ్ లో అది కాస్త మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే.. ఈ వారం ఓటీటీలో మంచి థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ‘చుప్’ ట్రై చేయండి.
చివరిమాట: గ్రిప్పింగ్ గా ఉండే డిఫరెంట్ థ్రిల్లర్ ‘చుప్’!
రేటింగ్: 2.5/5
(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)