సినిమా మనలో చాలామందికి ఇష్టం. ఓ ఆరోగ్యకరమైన వ్యసనం. ఓ సినిమా బాగుందని తెలిస్తే చాలు.. భాషతో సంబంధం లేకపోయినా సరే చూసేస్తాం. ఓ నాలుగేళ్ల ముందు వరకు ఇది కాస్త కష్టమైన విషయం. కానీ లాక్ డౌన్ వల్ల జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రపంచంలోని ఏ భాషలో వచ్చినా సినిమాను అయినా సరే మొబైల్లో చూసేస్తున్నారు. అది బాగుంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి చెబుతున్నారు. ప్రతి వారం ఓటీటీలో ఏదైనా మంచి సినిమా రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. అలాంటి వాళ్ల కోసమే మరో సినిమాతో మీ ముందుకొచ్చేశాం. ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్ సెలెక్షన్ కు ఎంపికైన సినిమా ‘ఛెల్లో షో’. దీనిని తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
గుజరాత్ లోని చలాలా అనే పల్లెటూరు. ఆ ఊరిలోని సమయ్(భవిన్ రబారీ) అనే తొమ్మిదేళ్ల పిల్లాడు ఉంటాడు. అదే ఊరి రైల్వేస్టేషన్ లో సమయ్ వాళ్ల నాన్నకు టీ కొట్టు ఉంటుంది. సమయ్ కి చదువుపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఓసారి తన కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి పక్క ఊరికి వెళ్తాడు. అప్పడే అతడికి సినిమాలు, థియేటర్లపై చెప్పలేనంత ఇష్టం ఏర్పడుతుంది. థియేటర్ లో ప్రొజెక్టర్ నడిపే ఫైజల్(భవేష్ శ్రీమలి)తో పరిచయం ఏర్పడుతుంది. అలా తల్లి తన కోసం ఇచ్చే భోజనాన్ని ఫైజల్ కి ఇచ్చి, స్కూల్ ఎగ్గొట్టి మరీ రోజూ ప్రాజెక్టర్ రూం నుంచి సమయ్ సినిమాలు చూస్తుంటాడు. అలా పూర్తిగా సినిమాలంటే ఇష్టం పెంచుకుంటాడు. ఇక చివరకు ఏం జరిగింది? అతడి జీవితంలో సినిమా అనేది ఎలాంటి పాత్ర పోషించింది? అనేది తెలియాలంటే మాత్రం ‘ఛెల్లో షో’ సినిమా చూసేయాల్సిందే.
‘ఛెల్లో’ అనేది గుజరాతీ పదం. దీనికి ‘చివరిది’ అని అర్థం. ‘ఛెల్లో షో’ అంటే చివరి షో అని మీనింగ్. అందరికీ అర్థం కావాలని ‘లాస్ట్ ఫిల్మ్ షో’ అని కూడా టైటిల్ పెట్టారు. ఈ మూవీ విషయానికొస్తే.. సినిమా ప్రపంచం మారుతున్న తీరుని ఈ మూవీ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీ.. కానీ ఒకప్పుడు సినిమాని రీళ్ల ద్వారా వేసేవారు. దాని కోసం చాలా పెద్ద ప్రొసెస్ ఉండేది. ఒకవేళ మీకు రీళ్ల గురించి తెలిసుంటే మాత్రం.. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు గతంలోకి వెళ్లిపోతారు. అలా అని ఇదేదో గొప్ప సినిమా అని చెప్పను. ఎందుకంటే చాలా సింపుల్ సరదాగా, అందంగా.. అదే టైంలో ఎమోషనల్ గా ఉంటుంది.
ఇప్పటి జనరేషన్ పిల్లలుకు ఫోన్లు తప్పించి పెద్దగా ఏం తెలీదు. అన్ని దానిలో ఉంటున్నాయి. ఒకప్పుడు మాత్రం కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్లేవారు. అదో జాతరలా ఉండేది. ఇక సినిమాకు వెళ్తున్నారంటే చాలా హడావుడిగా ఉంటుంది. తినుబండరాలు, భోజనం లాంటివి కూడా పార్సిల్ చేసుకుని పట్టుకెళ్లేవారు. దాన్ని థియేటర్ లో సినిమా చూస్తూ కూడా తినేవాళ్లు. అవన్నీ కూడా మీరు ఈ సినిమాలో చూడొచ్చు. అలానే హీరోహీరోయిన్లు డ్యాన్సులు, ఫైట్స్ చేస్తుంటే.. థియేటర్లలో కూర్చున్న వాళ్లంతా కళ్లప్పగించి చూసేవాళ్లు. ఈ సినిమాలోనూ అలాంటి సీన్లని చాలా చక్కగా చూపించారు. ఇలాంటివి సినిమా మొత్తంలో చాలానే ఉంటాయి. చూస్తున్నంతసేపు మిమ్మల్ని మీరు మైమరచిపోవడం గ్యారంటీ.
ఇక యాక్టింగ్ విషయానికొస్తే.. సమయ్ పాత్రలో భవిన్ అద్భుతంగా నటించాడు. అతడిని తప్పించి ఈ సినిమాలో మరొకరిని ఊహించుకోవడం చాలా కష్టం. అంత బాగా చేశాడు. అతడితో పాటు చిన్నపిల్లల గ్యాంగ్ ఉంటుంది. వాళ్లందరూ కూడా తమకిచ్చిన పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సమయ్ తల్లిదండ్రులు, ప్రొజెక్టర్ నడిపే ఫైజర్ పాత్రధారి.. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి.. ‘ఛెల్లో షో’ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ కూడా ఓ పెయింటింగ్ లా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఓ మంచి బుక్ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సిరిల్ మోరిన్ అందించిన మ్యూజిక్ కూడా ఫెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ పాన్ నలిన్.. తన చెప్పాలనుకున్న విషయాన్ని చాలా అందంగా, అద్భుతంగా తీశారు. నటీనటుల నుంచి తనకు కావాలిసిన ఔట్ పుట్ ని రాబట్టుకున్నారు. 2 గంటల్లోపే ఉండే ఈ సినిమా.. మీ మనసుని హాయిగా చేస్తుంది. కాకపోతే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కేవలం గుజరాతీ భాషలో మాత్రమే ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. భాషతో సంబంధం లేదు మంచి సినిమా చూద్దాం అనుకుంటే మాత్రం ‘ఛెల్లో షో’ చూసేయండి.
ఇక ‘ఛెల్లో షో’ సినిమాను 1998లో వచ్చిన ఇటాలియన్ మూవీ ‘సినిమా పరాడిసో’తో పోల్చారు. ఎందుకంటే ఈ చిత్రంలో కూడా 8 ఏళ్ల సెల్వాటోర్.. ‘సినిమా పరాడిసో’ అనే పేరుతో ఉన్న థియేటర్ లో తన సమయాన్నంతా గడుపుతుంటాడు. ఆల్ఫ్రెడ్ అనే ప్రొజెక్టర్ ఆపరేటర్ ను సెల్వాటోర్ కలుస్తాడు. ఆపరేటర్ బూత్ నుంచి సినిమాలు చూస్తుంటాడు. దీనికి బదులుగా రీళ్లు మార్చడం, ప్రొజెక్టర్ తిప్పడం లాంటి పనుల్లో ఆల్ఫ్రెడ్ కు సహాయం చేస్తుంటాడు. ఈ రెండు సినిమాల్లోనూ చాలా సీన్లు ఒకేలా అనిపించొచ్చు కానీ ఫీల్ విషయంలో మాత్రం ‘ఛెల్లో షో’ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు.
చివరిమాట: మనల్ని చిన్నతనంలోకి తీసుకెళ్లే సినిమా ‘ఛెల్లో షో’
రేటింగ్: 3/5
(చివరిమాట: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)