బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి- ప్రభాస్ కాంబోలో 18 ఏళ్ల క్రితం వచ్చిన ఛత్రపతిని రీమేక్ చేశారు. మరి.. వీవీ వినాయక్- బెల్లంకొండ శ్రీనివాస్ ఏ మేరకు ఆకట్టుకున్నారు? సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం రాజమౌళి- ప్రభాస్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ని రీమేక్ చేశారు. హిందీలో కూడా అదే పేరుతో వెళ్లారు. అయితే దర్శకత్వ బాధ్యతలను వీవీ వినాయక్ తీసుకున్నారు. హిందీ డెబ్యూ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మంచి సినిమాని ఎంచుకున్నాడు. ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్ పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమా సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఛత్రపతిగా బెల్లంకొండ శ్రీనివాస్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? వీవీ వినాయక్ రీమేక్ ని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు ఛత్రపతి సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
శివ(శ్రీనివాస్) తల్లి(భాగ్యశ్రీ), తమ్ముడు(కరణ్ సింగ్ ఛబ్రా)తో కలిసి పాకిస్తాన్ లో నివసిస్తూ ఉంటాడు. అక్కడ జరిగిన కొన్ని గొడవల కారణంగా హుటాహుటిన అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ గొడవల్లోనే శివ తన తల్లి, తమ్ముడికి దూరం అయిపోతాడు. అయితే శివ మాత్రం పడవలో తప్పించుకుని గుజరాత్ తీరానికి చేరుకుంటాడు. అలా పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు అందరినీ లోకల్ రౌడీ భైరవ్(ఫ్రెడ్డీ దారూవాలా) తన బానిసల్లా మార్చుకుంటాడు. వారితో ఇల్లీగల్ పనులు చేయిస్తూ తాను బలపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు భైరవ్ ని హత్యచేసి శివ ఛత్రపతిగా మారిపోతాడు. ఆ తర్వాత ఛత్రపతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? భైరవ్ అన్న భవాని(శరద్ ఖేల్కర్) ఛత్రపతిని ఎలా ఇబ్బంది పెట్టాడు? తల్లిని తమ్ముడిని ఛత్రపతి కలిశాడా? ఇలాంటి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఛత్రపతి సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి సీన్ మాత్రమే కాదు.. ప్రతి డైలాగ్ కూడా చెప్పేస్తారు. అసలు ప్రభాస్ కెరీర్ లో బాహుబలి కంటే ఛత్రపతి అంటేనే ఇష్టం అనే చెప్పే కల్ట్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. ఎవరో హీరో హిందీలో సినిమా తీస్తే ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు. కానీ, బెల్లంకొండ శ్రీనివాస్, వీవీ వినాయక్ కాంబో అనగానే తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఒక చిన్న పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. అయితే అంతటి క్లాసీ హిట్ ని టేకప్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్- వీవీ వినాయక్ సినిమాకి సరైన న్యాయం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా కథ విషయంలోనే వినాయక్ లెక్కల్ తప్పాయి. ఎందుకంటే 18 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా.. ఆ మూవీలో మైనస్ లు ఏంటో ఎవరికైనా తెలుస్తుంది. అలాంటి వాటిని కట్ చేసి ప్లస్ పాయింట్లను మరింత హైలెట్ చేయాల్సి ఉంటుంది.
కానీ, వీవీ వినాయక్ కథను రివర్స్ లో తీసుకెళ్లారు. హీరో ఇంట్రడక్షన్ సీన్ షార్క్ ఫైట్ ని లేపేశారు. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీతో ఇంకా కొత్తగా ఆ సీన్ తీసి ఉండచ్చు. యాక్షన్ సీన్స్ మక్కీ దించినా కూడా.. సినిమాలో ఎమోషన్ ని క్యారీ చేయలేకపోయారు. తల్లి సెంటిమెంట్ ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. పైగా సన్నివేశాలను కూడా తగ్గించేశారు. ఏదైతే సినిమాకి హైలెట్ అని ప్రేక్షకులు భావించారో ఆ సీన్లే లేకపోవడం ఒకింత షాక్ కి గురి చేస్తుంది. ఛత్రపతి ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ప్రేక్షకులకు పూనకాలు వస్తాయి. ఇక్కడ మాత్రం చాలా ఈజీ గోయింగ్ లా అనిపిస్తుంది. ఇంక పాటలు అయితే ఎక్కడా కూడా సెట్ అయినట్లు అనిపించదు. ఒక పాటను రెండు వర్షన్స్ సినిమాలో ఉంచడం కొసమెరుపు. సాధారణ హిందీ ఆడియన్ కూడా ఏ ఎమోషన్ ని ఫీల్ కాలేడు.
నటన విషయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కులే పడతాయి. ముఖ్యంగా బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ విషయంలో బెల్లంకొండను మెచ్చుకోవాలి. యాక్షన్- పాటల్లో సాయి శ్రీనివాస్ ఆకట్టుకుంటాడు. తల్లి పాత్రలో భాగ్యశ్రీకి అవకాశం దక్కిన మేర ఆకట్టుకున్నారు. విలన్స్ గా చేసిన ఫ్రెడ్డీ దారూవాలా, శరద్ ఖైల్కర్ పర్వాలేదనిపిస్తారు. హీరోయిన్ నుష్రత్ కి మాత్రం తన టాలెంట్ చూపించే అవకాశం దక్కలేదనే చెప్పాలి. ఉన్నంత వరకు ఆమె ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రలు కూడా వారి పరిధి మేరకు మెప్పిస్తారు.
ఈ సినిమాలో వీవీ వినాయక్ యాక్షన్ మార్క్ అంతేం కనిపించదు. రాజమౌళి ఛత్రపతిలో బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. ఈ సినిమా అవే అంత మైనస్ గా మారాయి. తనిష్క్ బగ్చి ట్యూన్స్ ఎక్కవు. రవి బస్రూర్ మ్యూజిక్ మీకు థియేటర్ బయటకు వచ్చే వరకు కూడా గుర్తుండదు. సినిమాటోగ్రఫీ మాత్రం ప్రేక్షకులతో పర్వాలేదనిపిస్తుంది. తెలుగు వర్షన్ చూడని హిందీ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చే అవకాశాలు లేకపోలేదు.