Brahmastra Telugu Review: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడైతే బాహుబలి అనే సినిమా పాన్ ఇండియా అనే పదానికి నాంది పలికిందో.. అప్పటినుండి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే భారీ విజువల్ వండర్స్, సోషియో ఫాంటసీ సినిమాలు తీయాలని భావించిన వారికి ఆదర్శంగా నిలిచాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన సహకారంతోనే పాన్ ఇండియా క్రేజ్ ని సంతరించుకుంది ‘బ్రహ్మాస్త్రం’. బాలీవుడ్ స్టార్స్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ అడ్వంచర్ ఫాంటసీ మూవీలో.. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు.
ముందునుండి చెప్పినట్లుగానే సకల దేవతలు ధరించిన అస్త్రాల గురించి చర్చిస్తూ.. అస్త్రావర్స్ ని చూపించనున్నట్లు ట్రైలర్ లోనే చూపించారు. ఇక మూడు భాగాలుగా ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్రంలో మొదటి భాగం శివ. దాదాపు పదేళ్లు కష్టపడి దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఆ అస్త్రావర్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనిరాయ్ లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ మూవీపై బాలీవుడ్ ఇండస్ట్రీ భారీ ఆశలు పెట్టుకుంది. మరి విజువల్ వండర్ అంటూ విడుదలైన బ్రహ్మాస్త్రం మూవీ బాలీవుడ్ కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందా లేదా? రివ్యూలో చూద్దాం!
బ్రహ్మాస్త్రం మూవీ కథ.. ఈ లోకంలోని సకల దేవతాస్త్రాలను శాసించే బ్రహ్మదేవ్ అస్త్రం చుట్టూ తిరుగుతుంది. పూర్వం ఎందరో మహాఋషులు హిమాలయాలలో కఠోర తపస్సుతో ఆ బ్రహ్మదేవుని వరం పొందుతారు. ఈ సృష్టిని కాపాడేందుకు సకల దేవతాస్త్రాలను బ్రహ్మదేవుని వరంతో ఒక్కొక్కరుగా ఒక్కో అస్త్రాన్ని ధరించి ‘బ్రహ్మంష్’ అనే కూటమిగా ఏర్పడతారు. అలా ఎన్నో యుగాలుగా ఆయా అస్త్రాల శక్తితో లోకాన్ని కాపాడుతుంటారు. ఈ క్రమంలో యుగాలతో పాటు తరాలు అంతరించిపోతున్నా.. బ్రహ్మంష్ కూటమి ఎప్పటికప్పుడు ఆ బ్రహ్మస్త్రాన్ని సేవ్ చేస్తుంటారు.
ఇక శివ(రణబీర్ కపూర్)లో అనాధ. డీజేగా పనిచేసుకుంటూ బ్రతికేస్తుంటాడు. ఓ ఫెస్టివల్ లో శివకు ఇషా(అలియా భట్)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే.. శివకి తెలియదు తనలో అగ్ని అస్త్రం దాగుందని.. కానీ, అతనికి ఈ సకల అస్త్రాలకు సంబంధించి కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో దేవతాస్త్రాలు ధరించిన వారిని చంపేస్తూ, బ్రహ్మస్త్రాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుంటుంది జునూన్(మౌనిరాయ్). దీంతో బ్రహ్మంష్ లో కలవరం మొదలవుతుంది. మరి బ్రహ్మాస్త్రంకి, శివకి సంబంధం ఏంటి? సకల దేవతాస్త్రాల గురించి ఎలా తెలుసుకున్నాడు? మూడు భాగాలుగా విడిపోయిన బ్రహ్మాస్త్రం కలిస్తే ఏమవుతుంది? శివ, ఇషాల ప్రేమ ఎంతవరకు వచ్చింది? అసలు శివ ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.
ఇంతవరకు ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ ని చూస్తూ వచ్చారు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం మూవీతో.. ఈ సృష్టిని శాసించే బ్రహ్మాస్త్రం, సకల దేవతల నుండి పుట్టిన అస్త్రాల కూటమి ‘అస్త్రావర్స్’ గురించి తెలుసుకుంటారు. బాలీవుడ్ నుండి ప్రపంచ స్థాయిలో హిందూ దేవతల చరిత్ర గురించి చర్చించిన మొదటి సినిమా ఇది. ఈ లోకాన్ని శాసిస్తూ.. రాక్షసం, అంధకారం నుండి కాపాడే బ్రహ్మాస్త్రంతో పాటు.. ఆ బ్రహ్మస్త్రాన్ని కాపాడుకునే కర్తవ్యం నిర్వర్తించే ఎన్నో శక్తులు, దేవతల అస్త్రాలను కొత్తగా.. ఎంతో గ్రాండ్ గా పరిచయం చేశాడు దర్శకుడు.
ఇంతవరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బ్రహ్మాస్త్రం, దాని కంట్రోల్ లో ఉండే సకల అస్త్రాలకు సంబంధించిన సబ్జెక్టుని ఎవరు టచ్ చేయలేదనే చెప్పాలి. బ్రహ్మాస్త్రం, నంది అస్త్రం, పవనాస్త్రం, ప్రభాస్త్రం, వానరాస్త్రం, అగ్ని అస్త్రం, గజాస్త్రం ఇలా పేర్లు వినుంటారు. కానీ.. ఎవరూ సినిమాటిక్ గా చూడలేదు. ఫస్ట్ టైమ్ అస్త్రాల నేపథ్యంలో ఓ విజువల్ వండర్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ సినిమా కోసం దాదాపు పదేళ్లు కష్టపడ్డాడు ముందుగా అతని ఎంపిక, సాహసాలను ప్రశంసించాలి. ఎందుకంటే.. అప్ డేట్ అవుతున్న ప్రేక్షకులకు మన దేవతలు, వారి చరిత్రను గుర్తుచేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
సినిమాలోకి వెళ్తే.. ప్రారంభంలోనే బ్రహ్మాస్త్రం, సకల అస్త్రాల వెనుక దాగిన కర్తవ్యాలను గురించి చెప్పేశారు. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ మెగాస్టార్ చిరంజీవి అందించడం విశేషం. అలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శివ(రణబీర్), ఇషా(అలియా)ల క్యారెక్టర్స్ పరిచయం చేశారు. శివ, ఇషాల మధ్య లవ్ సీన్స్ అప్ డేటెడ్ అయినప్పటికి.. మంచి ఫీల్ లోకి తీసుకెళ్తాయి. ఆ వెంటనే హీరో బ్యాక్ గ్రౌండ్ పరిచయం చేసిన దర్శకుడు.. శివలో అగ్ని అస్త్రం దాగుందని థ్రిల్లింగ్ గా చూపించాడు. అయితే.. శివకు తరచూ అస్త్రాలకు సంబంధించి కలలు రావడం జరుగుతుంది.
అందులోను అతను అనాధ కాబట్టి.. ఈ సీక్రెట్ ని ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. ఇక ఎప్పుడైతే ఇషాతో ప్రేమలో పడతాడో.. అన్నీ విషయాలు చెప్పేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయి. అయితే.. శివకు తెలియకుండానే అస్త్రాలకు సంబంధించిన ‘బ్రహ్మంష్’లో పుట్టినప్పటి నుండి మెంబర్ అయిపోతాడు. కానీ.. ఓ ప్రమాదం కారణంగా శివలో అస్త్రాలకు సంబంధించి అన్వేషణ మొదలవుతుంది. ఇక శివకు తోడుగా ఇషా.. నెవర్ ఎక్సపెక్టెడ్ వానరాస్త్రం.. నంది అస్త్రం.. ప్రభాస్త్రంలను కలిసే జర్నీతో ఫస్ట్ హాఫ్ ముగిసింది.
సెకండాఫ్ లో శివకు.. బ్రహ్మంష్ తో లింక్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చూపించాడు డైరెక్టర్. బ్రహ్మాస్త్రం చాలా పెద్ద కథ. ఎన్నో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎన్నో క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. వాటన్నింటిని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు. అయితే.. అక్కడక్కడా చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినట్లు అనిపిస్తాయి. ఓవైపు శివ, ఇషాల లవ్ స్టోరీ.. మరోవైపు బ్రహ్మాస్త్రంని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్న రాక్షసులు జునూన్, జోర్, రఫ్తార్(నెగటివ్ క్యారెక్టర్స్).. ఇంకోవైపు దేవతాస్త్రాల కూటమి బ్రహ్మంష్.. ఈ మూడు అంశాల మధ్య సంఘర్షణ.. ప్రేక్షకులను ఓ విజువల్స్ తో కూడిన ఎమోషన్స్ లోకి తీసుకెళ్తాయి.
ఇక సెకండాఫ్ లోనే శివ తన పేరెంట్స్ గురించి తెలుసుకోవడం.. జునూన్ ని మట్టుపెట్టడం బాగుంది. కానీ.. డైరెక్టర్ పెట్టిన ట్విస్టులకు మైండ్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. భారీ విజువల్స్ లో ఓ మైథలాజికల్ మూవీ చూసిన ఫీలింగ్ తో పాటు.. మంచి లవ్ స్టోరీ.. లోకంలోని అన్నీ అస్త్రాలకంటే.. ప్రేమ ఇంకా శక్తివంతమైనది అని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శివ మదర్ సెంటిమెంట్ కంటతడి పెట్టిస్తుంది. ఫస్ట్ హాఫ్ థ్రిల్లింగ్ గా కథను పరిచయం చేయగా.. సెకండాఫ్ ఓ లక్ష్యం.. ప్రేమ అనే ఎమోషన్స్ తో అందంగా సాగింది. ముఖ్యంగా సంగీతం అదిరిపోయింది.
ఇక శివ క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ జీవించేశాడు. ఇషాగా అలియా భట్ అదరగొట్టింది. బ్రహ్మాస్త్రం మూవీతో వీరిద్దరికీ తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నంది అస్త్రంతో నాగార్జున, వానర అస్త్రంతో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్స్ థ్రిల్ కి గురిచేస్తాయి. ఈ సినిమాలో అమితాబ్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభాస్త్రం ధరించిన గురువు క్యారెక్టర్ లో అదరగొట్టేసారు. విలన్ గా మౌని రాయ్ మెప్పిస్తుంది. ఓరల్ బ్రహ్మాస్త్రంలోని అన్నీ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. అయితే.. క్లైమాక్స్ లో శివ తండ్రి గురించి ఇచ్చే ట్విస్టు మైండ్ బ్లాక్ చేస్తుంది.
బ్రహ్మాస్త్రం మూవీకి మెయిన్ ఎస్సెట్ స్టోరీ, స్క్రీన్ ప్లేలతో పాటు సంగీతం, సినిమాటోగ్రఫీ. అయాన్ ముఖర్జీ కష్టం తెరపై విజువల్ వండర్ లా గ్రాండ్ గా కనిపిస్తుంది. అతని ప్రెజెంటేషన్ కూడా అలాగే ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ నెక్స్ట్ లెవెల్.. 3డిలో చూసేవారికి ఐఫీస్ట్ అవుతుంది. ప్రీతమ్ సాంగ్స్ తో పాటు సైమన్ ఫ్రాంగ్లేన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తో పాటు ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. బిజీఎంతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్, గ్రాండియర్ గా ఉన్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ లో మొదటి అడుగు సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. ఇక రెండో భాగం దేవ్ పేరుతో రాబోతుందని చెప్పేశారు.
చివరిమాట: ‘బ్రహ్మాస్త్రం’.. ప్రయోగం ఫలించింది!
రేటింగ్: 2.5/5