విజయ్ ఆంటోని 'బిచ్చగాడు 2' థియేటర్లలోకి వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ లో సెంటిమెంట్ తో ఏడిపించారు. మరి ఈసారి ఎలాంటి స్టోరీతో వచ్చారో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
కథ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమానైనా సరే ఓన్ చేసుకుంటారు. 2016లో అలా వచ్చిన ‘బిచ్చగాడు’ని బ్లాక్ బస్టర్ చేశారు. విజయ్ ఆంటోనిని స్టార్ ని చేసేశారు. ఇది తమిళ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ.. తెలుగు స్ట్రెయిట్ చిత్రం కంటే బాగా ఆడింది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకులని పలకరించారు. తాజాగా ‘బిచ్చగాడు 2’ థియేటర్లలోకి వచ్చేసింది. మరి విజయ్ ఆంటోని నటిస్తూనే ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూసేద్దాం.
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని).. మన దేశంలో సంపన్నుల్లో ఏడో స్థానంలో ఉంటాడు. అతడి కంపెనీలో పనిచేస్తున్న, అతడి ఫ్రెండ్ అరవింద్ (దేవ్ గిల్) కన్ను విజయ్ ఆస్తిపై పడుతుంది. అదే టైంలో టీవీలో బ్రెయిన్ టాన్సప్లాంటేషన్ సర్జరీ గురించి చెప్పింది వింటాడు. విజయ్ చంపేసి, దీన్ని అమలు చేయాలని చూస్తాడు. విజయ్ కి మ్యాచ్ అయ్యే బ్రెయిన్ కోసం వెతుకుతారు. కానీ ఆ తర్వాత అనుకోని సంఘటనలు జరుగుతాయి? చివరకు ఏమైంది? ఈ మొత్తం కథలో సత్య(విజయ్ ఆంటోని) ఎవరు? అతడు స్టార్ట్ చేసిన ‘యాంటీ బికిలీ’ సంగతేంటి? అనేదే ‘బిచ్చగాడు 2’ స్టోరీ.
‘బిచ్చగాడు’ మూవీలో మనల్ని ఏడిపించింది మదర్ సెంటిమెంట్. సీక్వెల్ లో మాత్రం సిస్టర్ సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. రెండు వేర్వేరు కథలతో తీశారు. అయితే ఫస్ట్ పార్ట్ లో కేవలం సెంటిమెంట్ ని నమ్ముకున్నారు. ‘బిచ్చగాడు 2’లో మాత్రం ఎమోషనల్ కంటెంట్ తోపాటు థ్రిల్, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షుకుల్ని థ్రిల్ చేశారు. మూవీని బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్, సర్జరీ అనే పాయింట్ తో మొదలుపెట్టారు. అక్కడ నుంచి చకచకా కథలో వెళ్లిపోయారు. దేశంలోనే సంపన్నుల స్థానంలో విజయ్ ఉండటం, అతడిని చంపి ఆస్తి కాజేయాలని ఫ్రెండ్ అనుకోవడం, ఆ తర్వాత బాడీ అలానే ఉన్నా బ్రెయిన్ వేరొకరిది పెట్టి మేనేజ్ చేయాలనుకోవడం ఇలా ఇంటర్వెల్ వరకు ఓ రేంజులో సినిమాని తీసుకెళ్లారు. కానీ సెకండాఫ్ లో మాత్రం ఆ టెంపోని మెంటైన్ చేయలేకపోయారు. అసలు కథకి తోడు సామాజిక సేవ, మెసేజ్ ఇవ్వడం లాంటి వాటిపై దృష్టి పెట్టారు. దీంతో స్టోరీ గాడితప్పినట్లు అనిపించింది. కానీ క్లైమాక్స్ దీన్ని కవర్ చేసుకునేలా సెంటిమెంట్ కంటెంట్ తో వర్కౌట్ చేసేశారు.
‘బిచ్చగాడు 2’ కోసం దాదాపు అన్ని విభాగాల్ని హ్యాండిల్ చేసిన విజయ్ ఆంటోని చాలావరకు సక్సెస్ అయ్యారు. సినిమాలో యాక్టింగ్ పరంగా బాగానే చేశారు కానీ యాక్షన్ కి తోడు సిస్టర్ సెంటిమెంట్ ని బ్యాలెన్స్ చేయడంలో తడబడ్డారు. సినిమా చూస్తే మీకే ఆ విషయం అర్థమైపోతుంది. సెకండాఫ్ లో స్టార్టింగ్, కోర్టు రూమ్ సీన్ విషయంలో రైటింగ్ పై మరింత శ్రద్ధ పెడితే బాగుండేది అనిపించింది. యోగిబాబుతో కామెడీ చేయించారు. అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు సరికదా తేలిపోయింది. సెకండాఫ్ లో అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ తప్పితే సినిమాని బాగా తీశారు. తొలిపార్ట్ తో దీన్ని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ‘బిచ్చగాడు’ ఓన్లీ సెంటిమెంట్ ని నమ్ముకుంటే.. ఈ ‘బిచ్చగాడు 2’ మాత్రం సెంటిమెంట్ తోపాటు యాక్షన్-థ్రిల్ అంశాల్ని నమ్ముకున్నాడు. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా.
‘బిచ్చగాడు 2’లో విజయ్ ఆంటోని బాగానే చేశాడు. కానీ అతడిలోని మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ పెద్దగా శ్రమ కలిగించలేదు. సినిమా అంతా ఏమో కానీ క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసి ఉండొచ్చు కానీ విజయ్ ఆంటోని పర్వాలేదనిపించేశాడు. మూవీ స్టార్టింగ్ లో కావ్య థాపర్ గ్లామర్ చూపించి కాస్త మత్తెక్కించింది. ఆ తర్వాత నటిగానూ ఆకట్టుకుంది. చాలారోజుల తర్వాత దేవ్ గిల్ కి ఇందులో మంచి క్యారెక్టర్ పడింది. విలన్ గా తన వరకు న్యాయం చేశాడు. మిగిలిన పాత్రల్లో రాధా రవి, జాన్ విజయ్, హరీశ్ పేరడీ, యోగిబాబు తదితరులు సింపుల్ గా అలా అలా చేసుకుంటూ వెళ్లిపోయారు.
ఈ మూవీకి హీరో అయిన విజయ్ ఆంటోనీ.. రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా పలు విభాగాల్ని బాగానే హ్యాండిల్ చేశారు. డైరెక్టర్ గా విజయ్ ఆంటోనికి ఇది ఫస్ట్ సినిమా అని ఎక్కడా అనిపించదు. యాక్టింగ్ తోపాటు అన్ని విభాగాల్ని అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సినిమాటోగ్రఫీతోపాటు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. పాటలు ఓకే గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా చెప్పుకుంటే విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు 2’తో మరో హిట్ పడినట్లే. మీరు ఫస్ట్ మూవీ చూడకపోయినా ఈ సినిమాకు వెళ్లొచ్చు. నచ్చేస్తుంది కూడా!
చివరగా: ఈసారి సెంటిమెంట్ విత్ థ్రిల్!
రేటింగ్: 2.5