ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ నీలం దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ బేబీ. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ కోవకి చెందినదే బేబీ సినిమా. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 14న విడుదలైంది. కలర్ ఫోటో సినిమాకి కథ రాసిన సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ,మొదటి నుంచి ఈ సినిమా టీజర్, పోస్టర్లు, పాటలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వచ్చింది. కలర్ ఫోటో లాంటి అద్భుతమైన కథని అందించిన సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి సాయి రాజేష్ అంచనాలను మించి ఈ సినిమా ఉందా? లేదా? ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ఖాతాల్లో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
వైష్ణవి (వైష్ణవి చైతన్య), ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఇద్దరూ ఒకే బస్తీలో ఉంటారు. ఎదురెదురు ఇళ్లలో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడతారు. స్కూల్ డేస్ లోనే వీరి ప్రేమాయణం మొదలవుతుంది. అయితే ఆనంద్ పదోతరగతి ఫెయిల్ అవుతాడు. దీంతో ఆటోడ్రైవర్ గా స్థిరపడతారు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడ విరాజ్ (విరాజ్ అశ్విన్) అనే ధనవంతుడు కొడుకు పరిచయమవుతాడు. మొదటగా స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. శారీరకంగా ఇద్దరూ ఒకటవుతారు. ఈ విషయం ఆనంద్ కి తెలిసిందా? తెలిసిన తర్వాత ఎలా స్పందించాడు? అసలు బస్తీలో పుట్టిన వైష్ణవి ఎలా మారిపోయింది? అసలు వైష్ణవి ఇద్దరిలో ఎవరిని ప్రేమించింది? అనేది మిగిలిన కథ.
ప్రస్తుత జనరేషన్ ప్రేమ ఒకరితో మొదలై ఎంతమందితో ముగుస్తుందో అనేది తెలియడం లేదు. ఒకేసారి ఒకరిని కాకుండా ఎక్కువ మందికి ప్రేమను పంచుతున్నారు. దీని వల్ల జరిగే అనర్థాలను బేబీ సినిమాలో చూపించారు. ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ లో ఉంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత కథను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయి. ట్రయాంగిల్ స్టోరీగా తెరకెక్కిన ఈ బేబీ కూడా అలాంటి కోవకి చెందినదే. బస్తీ నుంచి వచ్చిన వైష్ణవి.. ఆనంద్ తో ప్రేమాయణం సాగించి ఆ తర్వాత కాలేజ్ లో విరాజ్ తో ఆకర్షణకు గురై ప్రేమలో పడుతుంది. సిన్సియర్ లవర్ గా ఆనంద్ కోణం నుంచి కథ మొదలైన తీరు బాగుంటుంది. వైష్ణవి, ఆనంద్ ల స్కూల్ డేస్ ప్రేమ సన్నివేశాలు సహజంగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఆనంద్ పదో తరగతి ఫెయిలై ఆటోడ్రైవర్ గా మారడం, వైష్ణవి కాలేజీలో చేరడంతో వీరి ప్రేమ కథ మలుపు తిరుగుతుంది.
ఇక ఆనంద్ వైషుకి ఏమవుతోంది అని టెన్షన్ పడడం.. అనుమానం పెంచుకోవడం వంటివి చేస్తాడు. వైష్ణవి లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. బస్తీ పిల్లలా ఉండే వైష్ణవి విరాజ్ తో తిరుగుతూ మోడ్రన్ గా తయారవుతుంది. వైష్ణవిని అలా చూసి ఆనంద్ కి కోపం రావడం, ఇద్దరి మధ్య గొడవలు జరగడం వంటివి సహజంగా సాగుతాయి. ఇంటర్వెల్ ముందు ఆనంద్ కి వైష్ణవి కాల్ చేస్తుంది. మద్యం మత్తులో అమ్మాయిల గురించి మాట్లాడే మాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. మొదటి భాగం అంతా ప్రేమికుల మధ్య సంఘర్షణతో ఆసక్తిగా సాగుతుంది. రెండవ భాగం మాత్రం కాస్త నెమ్మదిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఆల్రెడీ చూసిన సినిమాల్లో సీన్స్ ని గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ సీన్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. అయితే ఈ మధ్యన బూతు పదాలు వాడడం సినిమాల్లో ట్రెండ్ అయిపోయింది. ఈ బేబీలో కూడా హీరోయిన్ ఓ బూతు పదాన్ని పదే పదే వాడడం, బెడ్ రూమ్ సీన్ వంటివి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెడతాయి.
ఈ సినిమాలో అమాయకుడిగా, సిన్సియర్ లవర్ గా ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించారు. ఆటోడ్రైవర్ గా ఆనంద్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. బస్తీ అమ్మాయి నుంచి మోడ్రన్ అమ్మాయిగా మారే వైష్ణవి పాత్ర బాగుంటుంది. లుక్స్ పరంగానే కాకుండా నటనలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. వైష్ణవి తండ్రి పాత్రలో నాగబాబు, ఆనంద్ స్నేహితులుగా వైవా హర్ష, సాత్విక్ తమ పాత్రల్లో నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విరాజ్ అశ్విన్ నటన ఆకట్టుకుంటుంది.
సాయి రాజేష్ డైరెక్షన్ బాగుంది. ఆయన ఎంచుకున్న కథ, రాసిన మాటలు యువతరాన్ని బాగా ఆకట్టుకుంటాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నేపథ్య సంగీతంతో సినిమాని పైన నిలబెట్టారు. ఎం ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా: ఈ బేబీ ప్రస్తుత తరం యువతకి బాగా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్: 2.5/5