ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా సర్వం సిద్ధమే అంటున్నాయి. ఈ మధ్యకాలంలో లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్ లో వెబ్ సిరీసులు ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు వెబ్ సిరీస్ లను అన్ని ఓటిటిలు ఎంకరేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా జీ5లో రెగ్యులర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమాలు/సిరీస్ లు వస్తున్నాయి. తాజాగా ‘అయలి’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. బాలనటి అభి నక్షత్ర నటించిన ఈ సిరీస్.. ట్రైలర్ తోనే అందరినీ ఆలోచించేలా చేసింది. మరి.. అయలి సిరీస్ ఉద్దేశం ఏంటి? ఆడియెన్స్ ని మెప్పించే అంశాలు ఉన్నాయా లేదా రివ్యూలో చూద్దాం!
ఎన్నో ఏళ్లుగా వీరపన్నై అనే చిన్న గ్రామంలో జనాలంతా వారికంటూ సెట్ చేసుకున్న ఆచారాలు, సాంప్రదాయాలను ఫాలో అవుతుంటారు. వారి ఆచారం ప్రకారం.. ఊర్లో యుక్తవయసుకు వచ్చిన (పుష్పవతి అయిన) అమ్మాయిలు స్కూల్ కి వెళ్ళకూడదు, అలాగే వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఈ ఆచారాలను ఎవరైనా మీరితే.. ఊరు నాశనం అవుతుందని జనాలు గుడ్డిగా నమ్ముతారు. ఇలాంటి తరుణంలో అదే గ్రామానికి చెందిన సెల్వి(అభి నక్షత్ర) ఊరు ఆచారవ్యవహారాలను సవాల్ చేస్తూ.. డాక్టర్ చదవాలని కలలు కంటుంది. అమ్మాయిలు 10వ తరగతి చదవకూడదు అనే ఆ ఊర్లో.. సెల్వి డాక్టర్ చదువు కోసం ఏం చేసింది? ఆ ఊరు ఆచారాలను ఎలా ఫేస్ చేసింది? చివరికి తన లక్ష్యాన్ని సాధించిందా లేదా? సిరీస్ మొత్తం చూసి తెలుసుకోవాల్సిందే.
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కానీ.. ఆలోచింపజేసే కథలు రేర్ గా వస్తుంటాయి. అలాంటి కథలలో కొత్తగా వచ్చిన ఈ ‘అయలి’ వెబ్ సిరీస్ ఒకటని చెప్పాలి. మీకు ట్రైలర్ చూస్తేనే ఇందులో ఎలాంటి అంశాలను చర్చించబోతున్నారని అర్థమవుతుంది. జీవితంలో రోజు ఎన్నో వార్తలలో బాల్య వివాహాలు, స్త్రీలపై అధిపత్యాలు, వింతైన ఆచారాలు, వెనకబడిన గ్రామాలలో కట్టుబాట్లు.. చదువుకోవాలని ఆశపడే ఆడపిల్లల చుట్టూ సంప్రదాయాల పేరుతో నిర్మించుకున్న అడ్డగోడల గురించి వింటూనే ఉంటాం. కానీ.. వందలో ఒకసారి మాత్రమే సంతృప్తినిచ్చే విషయాలు కనిపిస్తాయి. ఈ అయలి సిరీస్ కూడా అలాంటిదే.
ఇప్పటికీ ఆచారసంప్రదాయాల పేరుతో సమాజంలో గ్రామాలు, ఆయా గ్రామాలలో ఆడపిల్లలు ఎలా వెనకబడి పోతున్నారో.. పనికిరాని కట్టుబాట్ల మధ్య జీవితంలో ఆడపిల్లలు ఏమేం కోల్పోతున్నారో ఈ సిరీస్ లో చూపించారు. ముఖ్యంగా మహిళా సాధికారతపై అవగాహన కలిగేలా.. ఆడపిల్లలు ఇంటిపనులకు, పెళ్లి చేసుకొని భర్తలను సుఖపెట్టడం కోసమే కాదని తెలియజెప్పే సందేశాన్ని ఇందులో చక్కగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు ముత్తుకుమార్. ఈ సిరీస్ విషయంలో రచయితలను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. గట్టిగా చర్చించాల్సిన విషయాన్నీ.. ఎంతో సెన్సిబుల్ వేలో వెబ్ సిరీస్ గా మలిచి చూపించడం అంటే మామూలు విషయం కాదు.
మొదటి నుండి ఆ ఊరి ఆచారాలు, అక్కడి వ్యవహారాలు చూసి బాధపడే ఆడియెన్స్.. అందులో లీనమయ్యాక ఈ అరాచకాలను ఎవరో ఒకరు అడ్డుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా పుష్పవతి కాగానే ఆడపిల్లలను చదువు మాన్పించి, పెళ్లి చేయడం ఏంటనే ప్రశ్న వీక్షకులలో ఆవేశాన్ని కలిగిస్తుంది. మెయిన్ సీన్స్ లో కథలో విలన్స్ పై తీవ్రమైన కోపాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ సిరీస్ లోని ప్రతి పాత్ర.. ప్రతి ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ప్రధాన పాత్ర ఎజిల్ సెల్వి పాత్రలో బాలనటి అభి నక్షత్ర అద్భుతంగా నటించింది. సిరీస్ లో మెయిన్ రోల్ కాబట్టి.. మొదటి నుండి చివరిదాకా సెల్వి పాత్రతో ఆడియెన్స్ ట్రావెల్ చేస్తారు.
సెల్వి పాత్రలోని ప్రతి భావాన్ని అభి నక్షత్ర ఎంతో చక్కగా పలికించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ఏడుపు తెప్పిస్తుంది. అయితే.. ఎంతో ఎమోషన్ ఉన్న సెల్వి పాత్ర చుట్టూ.. సరదా సన్నివేశాలు కూడా బాగుంటాయి. సెల్వికి తల్లి సహకారం, డాక్టర్ కావాలనే కల.. అందుకోసం సెల్వి చేసే పనులు.. తన యుక్తవయసుని దాచిపెట్టే సన్నివేశాలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఇందులో సెల్వి తల్లి పాత్రలో అనుమోల్ చక్కగా నటించింది. కథలో.. ఆమె పాత్రలో ఉన్న ఎమోషన్ ని ముందుకు బ్యాలన్స్ చేస్తూ తీసుకెళ్లింది. ఇందులో సెల్వికి, తల్లికి మధ్య డైలాగ్స్ మనసులను హత్తుకుంటూనే.. ఆలోచించేలా చేస్తాయి.
ఇలా ఎంతో ఆహ్లాదంగా సాగే సిరీస్ లో సాంగ్స్ ప్లేస్ మెంట్ అనేది మైనస్ అనే చెప్పాలి. ఇంటరెస్టింగ్ గా వెళ్తున్న కథాకథనాలలో అనవసరమైన ప్లేస్ లో సాంగ్స్ పెడితే.. స్క్రీన్ ప్లే, ఆడియెన్స్ దృష్టి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. ఇందులో తెలుగులో మాటలు ఉన్నా.. సాంగ్స్ తమిళంలోనే ఉండేసరికి ప్రేక్షకులకు ఇబ్బంది కలగవచ్చు. కథలో సీరియస్ నెస్ సాగుతున్నప్పుడు కొన్ని చోట్ల కామెడీ పండించే ప్రయత్నం చేశారు. అవి కాస్త ఇరికించినట్లుగా అనిపిస్తాయి. మధ్యలో దొంగ పాత్ర బాగుంది. అలాగే అక్కడక్కడా స్క్రీన్ ప్లే తడబడింది. కానీ.. ఈ సిరీస్ కి పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు, రాంజీ సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యాయి.
రెవా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథాకథనాలకు అనుగుణంగా సాగింది. కొన్నిచోట్ల సన్నివేశాలను ఎలివేట్ చేసిందని చెప్పాలి. ఇక సిరీస్ అయినప్పటికీ.. సబ్జెక్టు బాగుండటంతో నిర్మాత ఎక్కడా కంప్రమైజ్ కాలేదని అనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ పరంగా దర్శకరచయితలను ప్రత్యేకంగా అభినందించాలి. ఎక్కడా అతి లేకుండా.. కథకు అవసరమైన మేరకే అందంగా చిత్రీకరించారు. ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. దర్శకుడు ముత్తుకుమార్ తాను అనుకున్న కథకు అందరి నటులు నుండి అద్భుతమైన పెర్ఫార్మన్స్ లు రాబట్టుకున్నాడు. చివరిగా అయలి.. ఒక సాధారణ రెగ్యులర్ ఎంటర్టైనర్ కాదు. మంచి కథాంశం, మంచి నటన, ఎమోషన్స్, సందేశాలతో కూడిన కథనం.