ఒకప్పుడు సినిమాలు ట్రెండ్.. ఇప్పుడు వెబ్ సిరీసులు ట్రెండ్. రెండు మూడు గంటల్లో చెప్పలేని కథల్ని.. పలువురు డైరెక్టర్స్ సిరీసులుగా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటిని రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు చాలా తక్కువగానే జరుగుతున్నాయి. అవి కూడా ప్రేక్షకులని ఓ మాదిరిగానే అలరించాయి. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ స్టోరీ రాయడం, దిల్ రాజు నిర్మించిన తొలి ఓటీటీ సిరీస్ ‘ATM’. రిలీజ్ కు ముందు దీనిపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. తాజాగా జీ5లో రిలీజైన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
హైదరాబాద్ లోని ఓ బస్తీలో ఉండే యువకుడు జగన్ (వీజే సన్నీ). తన బస్తీలోనే ఉండే మరో ముగ్గురు కుర్రాళ్లతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జల్సాగా ఉంటాడు. ఓ రోజు పాత కారు కొట్టేసి అమ్మేస్తారు. అయితే అందులో రూ.10 కోట్ల విలువైన డైమండ్స్ ఉన్నాయని తెలుస్తోంది. జగన్ బృందాన్ని పట్టుకున్న డైమండ్స్ ఓనర్.. పది కోట్లు లేకపోతే డైమండ్స్ తిరిగివ్వాలని, లేకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. పది రోజుల టైమ్ అడిగిన జగన్ బృందం.. ఏటీఎంలకు డబ్బులు తీసుకెళ్లే వ్యాన్ ని కొట్టేస్తారు. అందులో ఏకంగా రూ.25 కోట్లు ఉంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ‘ATM’ వెబ్ సిరీస్. ఈ మొత్తం కథలో పోలీస్ అధికారి హెగ్డే (సుబ్బరాజు) ఏం చేశాడు? బస్తీ కార్పొరేటర్ గజేంద్ర(పృథ్వీరాజ్) రోల్ ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే కచ్చితంగా సిరీస్ మొత్తం చూడాల్సిందే.
మనం రోజూ న్యూస్ లో చూసే సంఘటనల ఆధారంగానే ‘ATM’ వెబ్ సిరీస్ కథ రాసుకున్నారు. అయితే కాస్త డిఫరెన్స్ ఉండటం కోసం రైటర్ హరీష్ శంకర్.. స్టోరీకి కాస్త ఫన్ ఎలిమెంట్స్ జోడించారు. అక్కడక్కడ థ్రిల్ చేశారు. కొన్ని చోట్ల ఫిలాసఫీ కూడా చెప్పారు. ఏటీఎం దొంగతనాలు, కోట్లకు కోట్లు పోసి ఎమ్మెల్యే టికెట్ కొనడం లాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం కదా. వాటికి కాస్త సస్పెన్స్ జోడించి ఈ సిరీస్ ని తెరకెక్కించారు. సాధారణంగా సినిమా అయితే చకాచకా పరుగెడుతుంది. సిరీస్ కాబట్టి.. క్యారెక్టర్స్ ని చూపించడం కోసం కాస్త టైం తీసుకున్నారు. దీంతో ప్రారంభంలో ఓ రెండు, మూడు ఎపిసోడ్స్ కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఏటీఎం వ్యాన్ లో దొంగతనం జరగడం, పోలీస్ ఆఫీసర్ ఎంటర్ కావడంతో స్టోరీలో ఊపు వస్తుంది.
ఇక దొంగతనం తరహా కథలు పూర్తిగా సీరియస్ ఉంటే బాగానే ఉంటుంది గానీ కొన్నిసార్లు ఆడియెన్స్ డిస్ కనెక్ట్ అయిపోయే ఛాన్సు ఉంటుంది. అందుకే హరీష్ శంకర్.. కామెడీ సీన్స్ బాగానే రాసుకున్నారు. మైసూరు బోండా వల్ల దొంగలు దొరికిపోవడం పాయింట్ కూడా తెగ నవ్విస్తుంది. ఇక గజేంద్ర రోల్ చేసిన పృథ్వీ కూడా కొన్ని సీన్స్ లో ఎంటర్ టైన్ చేస్తాడు. ఇక రైటర్ గా చాలా లాజిక్స్ ని హరీష్ శంకర్ చెప్పుకొచ్చినప్పటికీ ఎనిమిది ఎపిసోడ్స్ పూర్తయ్యాక మాత్రం ఏదో చిన్న వెలితిగా అనిపిస్తుంది. బస్తీ కుర్రాళ్ల క్యారెక్టర్స్ ని ఇంకా డెప్త్ గా రాసుకోవడంతోపాటు దివ్య వాణి సీన్స్ ని ట్రిమ్ చేసుంటే స్టోరీ ఇంకాస్త ఎంటర్ టైనింగ్ గా ఉండేది. ఈ సిరీస్ కు సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు.
‘బిగ్ బాస్’తో ఫేమ్ తెచ్చుకున్న సన్నీ.. బస్తీ కుర్రాడిలా బాగా చేశారు. పోలీస్ అధికారి హెగ్డేగా సుబ్బరాజు.. తన యాక్టింగ్ లో ఇంటెన్సిటీ చూపించాడు. నిద్రపోని వ్యక్తిగా డిఫరెంట్ గా చేసి ఆకట్టుకున్నాడు కూడా. ఇక పొలిటీషియన్ గా చేసిన పృథ్వీ.. ఎప్పటిలానే ఎంటర్ టైన్ చేశాడు. స్టార్టింగ్ లో కాస్త సీరియస్ నెస్ క్రియేట్ చేసినప్పటికీ ఓవరాల్ గా మాత్రం పూర్తి న్యాయం చేశాడు. ఇక హీరో ఫ్రెండ్స్ గా కనిపించిన ముగ్గురు కూడా ఓకే అనిపించారు. దివి, హర్షిణి రోల్స్ నిడివి చాలా తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో నటించారు. ఇందులో లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయండోయ్. ఇక దివ్యవాణి పాత్ర ఆమెకు సెట్ కాలేదనిపించింది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే రైటర్ గా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేశారు. కానీ ఇలాంటి కథలు ప్రేక్షకులు ఇప్పటికే చాలా చూసేశారు. ఇంకాస్త బెటర్ రాసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ ఓకే. ఓవరాల్ గా చూసుకుంటే.. ఓటీటీలో హైయస్ట్ తరహా సిరీస్ చూద్దామనుకుంటే ‘ATM’ని ట్రై చేయొచ్చు.
చివరగా: హైయస్ట్ సిరీస్ లు చూసేవారికోసం ఈ ‘ATM’!
రేటింగ్: 2.5