సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ 'అన్నీ మంచి శకునములే'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చూసేయండి.
టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలకు కొదవలేదు. అలా ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే జనాల్ని కొంతలో కొంత ఎట్రాక్ట్ చేసిన మూవీ ‘అన్నీ మంచి శకునములే’. టైటిల్ లో అచ్చ తెలుగుతనం ఉండటం. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లు.. నందినీ రెడ్డి డైరెక్టర్.. వీళ్లతోపాటు వాసుకి, గౌతమి, రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేశ్ లాంటి స్టార్స్ ఉండటంతో సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అనేది తెలియాలంటే పూర్తి రివ్యూ చదివేయాల్సిందే.
ఓ కాఫీ ఎస్టేట్ విషయమై ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్), సుధాకర్ (సీనియర్ నరేష్) కుటుంబాల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. మరోవైపు రిషి(సంతోష్ శోభన్) సుధాకర్ కొడుకు, ఆర్య(మాళవిక నాయర్) ప్రసాద్ కూతురు. అయితే వీళ్లు ఒకేరోజు పుడతారు. ఆ టైంలో ఆస్పత్రిలో నర్సులు చేసిన పొరపాటు వల్ల రిషి, ప్రసాద్ కొడుకుగా.. ఆర్య, సుధాకర్ కూతురిగా పెరుగుతారు. ఈ విషయం చివరకు ఎలా తెలిసింది? కాఫీ ఎస్టేట్ గొడవ ఎలా సాల్వ్ అయింది? ఇందులో రిషి-ఆర్య లవ్ స్టోరీ ఏంటనేది ‘అన్నీ మంచి శకునములే’ స్టోరీ.
హాస్పిటల్ లో ఇద్దరు వ్యక్తులకు వేర్వేరుగా పిల్లలు పుడతారు. అయితే నర్సులు కన్ఫ్యూజ్ అవుతారు. పొరపాటున ఈ చిన్నారి ఆ తల్లి దగ్గరు.. మరో చిన్నారిని వేరే తల్లి దగ్గర పెట్టేస్తారు. వాళ్లు అలానే మారిన తల్లి దగ్గర పెరిగిపెద్దోళ్లు అవుతారు. అదేంటి ‘అల వైకుంఠపురములో’ మూవీ ఇంట్రో సీన్ గురించి చెప్తున్నావ్. ఈ మూవీ గురించి చెప్పు అని అంటారా.. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ సినిమాలోని సీనే. కాకపోతే ఆ చిత్రంలో ఇద్దరబ్బాయిలు. ఇక్కడ ఓ అమ్మాయి-అబ్బాయి. అంతే తేడా. ఇదొక్కడే కాదు.. ‘అన్నీ మంచి శకునములే’ చూస్తున్నప్పుడు చాలా సినిమాల్లో చూసేసిన సీన్లు కొత్త యాక్టర్స్ తో స్క్రీన్ పై కనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. చూసేసిన సీన్లు ఉన్నాసరే బలంగా నిలబడుతుంది. కానీ ఈ మూవీలో అదే లోపించింది. ఫస్టాప్ లో కామెడీ కాస్త వర్కౌట్ అయిపోయింది గానీ సెకండాఫ్ లో మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సీన్ పడలేదు. దీంతో చాలా అంటే చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. కానీ ఏం లాభం ఇది ఒక్కటే బాగుంటే సరిపోదు, సినిమా మొత్తం బాగుంటేనే కదా క్లైమాక్స్ కూడా నచ్చేది. ఈ సినిమా విషయంలో అలా జరగలేదనిపించింది.
తండ్రి కొడుకు, తండ్రి కూతురి మధ్య బాండింగ్ అనేది జనరేషన్స్ తోపాటు మారేది కాదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండిపోతుంది. ఈ కారణం వల్ల తెలుగులో ఈ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రతి ఏటా చాలా సినిమాలు వస్తుంటాయి. ‘అన్నీ మంచి శకునములే’ కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే తీశారు. కానీ సీన్స్ లో ఎందుకో డెప్త్ మిస్ అయింది. అయితే క్యారెక్టరైజేషన్ పరంగా మాత్రం డైరెక్షన్ టీమ్ మంచి ఎఫర్ట్ పెట్టింది. తండ్రి వ్యక్తిత్వం అమ్మాయికి వచ్చినట్లు, తల్లి వ్యక్తిత్వం అబ్బాయికి నచ్చినట్లు కొన్ని సీన్స్ లో చూపించారు. ఇలా ఏదైనా కొత్త పాయింట్ చుట్టూ స్టోరీ డెవలప్ చేసుకుని మూవీ తీసుంటే బాగుండేది అనిపించింది. ఇక హీరోహీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ ఉన్నాయంటే ఉన్నాయంతే. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక పెళ్లిలో ఫ్యామిలీ అంతా కలిసి డ్యాన్స్ చేసే సీన్లు చూస్తుంటే.. లెంగ్త్ పెంచడం కోసం పెట్టారే తప్పితే అవసరం లేదేమో అనిపించింది. ఓవరాల్ గా సినిమా చాలా నార్మల్ గా అనిపించింది.
గత కొన్నాళ్ల మూవీస్ చేస్తున్నాడు గానీ సంతోష్ శోభన్ కి సరైన హిట్ పడటం లేదు. ఈ మూవీలో బాగానే యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లలో బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ మాళవిక నాయక్ లుక్స్ పరంగా కొత్తగా ఉంది. క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మిగతా వారిలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, సీనియర్ నరేష్, ఝాన్సీ.. ఇలా అందరూ తమ నేచురల్ యాక్టింగ్ తో చేసుకుంటూ వెళ్లిపోయారు. అయితే హీరోకి అక్క పాత్రలో చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ పై కనిపించిన వాసుకి.. ప్లెజెంట్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. స్టార్ హీరోలకు అక్క క్యారెక్టర్స్ కి మరో బ్యూటీపుల్ నటి దొరికిసినట్లే. తల్లి పాత్రలో గౌతమి కాస్త కొత్తగా, రిఫ్రెషింగ్ గా కనిపించి ఆకట్టుకుంది.
‘సీతారామం’ తీసిన వైజయంతీ మూవీస్ నుంచి ఓ సినిమా అనేసరికి ఆడియెన్స్ ఎగ్జైట్ అయ్యారు. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాతలుగా స్వప్నాదత్, ప్రియాంకా దత్ పాసయ్యారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. కానీ మిక్కీ జే మేయర్ అందించిన పాటలు పెద్దగా గుర్తుండవు. కొన్ని సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది అంతే. ఫైనల్ గా రైటర్ అండ్ డైరెక్టర్ నందినీరెడ్డి తెలిసిన కథనే తీసుకున్నాసరే దాన్ని ఏదైనా కొత్తగా చెప్పుండాల్సి కానీ సింపుల్ గా చెప్పేద్దామని బోర్ కొట్టించారు. ఓవరాల్ గా చెప్పుకుంటే రొటీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇంట్రెస్ట్ ఉంటే థియేటర్లకి వెళ్లండి. లేదంటే ఓటీటీల్లోకి వచ్చే వరకు ఆగండి!
చివరగా: శకునం కుదరలేదు!
రేటింగ్: 2