ఏదేమైనా సరే థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఒకప్పుడు ఏ మూవీ అయినా సరే థియేటర్ కి వెళ్లి చూడాల్సి వచ్చేది. కానీ ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోవడంతో.. ప్రేక్షకులు కూడా వరల్డ్ వైడ్ సినిమాని ఎక్స్ పీరియెన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతివారం కూడా క్రేజీ క్రేజీ థ్రిల్లర్స్ మన ముందుకొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇక కొన్నాళ్ల క్రితం ‘ఝాన్సీ’ అనే సిరీస్ తో ఆడియెన్స్ ని పలకరించిన అంజలి.. ఇప్పుడు అదే తరహాలో ‘ఫాల్’ అని టెన్షన్ పెట్టడానికి వచ్చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కోటీశ్వరుల కుటుంబానికి చెందిన దివ్య (అంజలి) తల్లిదండ్రులతో గొడవపడి సెపరేట్ గా ఉంటుంది. స్పోర్ట్స్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. డేనియల్(సంతోష్ ప్రతాప్) గురించి ఓ విషయం చెప్పాలని ఓ రోజు రాత్రి మలార్(సోనియా అగర్వాల్) కు మెసేజ్ చేస్తుంది. అదే రోజు రాత్రి తను ఉంటున్న బిల్డింగ్ పై నుంచి కిందపడి కోమాలోకి వెళ్తుంది. దాదాపు 6 నెలల పాటు కోమాలో ఉండి బయటకు వస్తుంది. అయితే దివ్య కోమా నుంచి బయటకొచ్చిందని తెలియగానే.. ఆమె చెల్లెలు, అన్నయ్య రోహిత్ (ఎస్పీ చరణ్), డేనియల్ కంగారు పడతారు. కానీ దివ్యకు ఏం గుర్తులేదని తెలిసి రిలాక్స్ అవుతారు. దివ్య.. బిల్డింగ్ నుంచి ఎందుకు దూకింది? అది సూసైడ్ లేదా మర్డర్? డేనియల్ ఎవరు? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే ‘ఫాల్’ సిరీస్ చూడాల్సిందే.
పదేళ్ల క్రితం కెనడాలో రిలీజైన వెబ్ సిరీస్ ‘వర్టీజ్’. దీనినే ఇక్కడ ‘ఫాల్’ వెబ్ సిరీస్ గా తీశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ విడుదల చేయడం విశేషం. కేవలం మూడు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా దివ్య కోమాలోకి వెళ్లడం, ఆ తర్వాత ఆమె చుట్టూ ఉన్న పాత్రలు ప్రవర్తించే తీరు.. దివ్య కోమా నుంచి బయటకొచ్చిన తర్వాత అదే పాత్రలు ప్రవర్తించిన తీరుని ఈ ఎపిసోడ్స్ లో చూపించారు. ఓవరాల్ పాత్రల పరిచయానికే ఈ మూడు ఎపిసోడ్స్ తీసుకున్నారు. కథలో ఇంతవరకు ఒక్క ట్విస్ట్ బయటపడలేదు. చెప్పాలంటే అసలు ‘ఫాల్’ కథే పక్కాగా మొదలుకాలేదు. దివ్య ప్రమాదవశాత్తు పడిపోయిందా? లేదా ఎవరైనా మర్డర్ చేయాలని చూశారా అనేది ఇంకా తెలియలేదు. మెట్రో ప్రాజెక్టు గురించి చిన్నగా చెప్పి వదిలేశారు.
ప్రస్తుతం మూడు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ప్రతి శుక్రవారం కూడా కొత్త ఎపిసోడ్ విడుదలవుతుందని చెప్పారు. మరీ ముందు ముందు ఎపిసోడ్లలో కథలో కొత్త ట్విస్టులు ఏమైనా రివీల్ అవుతాయా? లేదా అంజలి పైనుంచి కిందపడిపోవడం, మెట్రో ప్రాజెక్టు గురించే ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు రిలీజైన మూడు ఎపిసోడ్ల రన్ టైమ్.. 34-39 నిమిషాల మధ్య మాత్రమే ఉంది. పెద్దగా స్టోరీ కదిలినట్లు అయితే కనిపించలేదు. మన దగ్గర నార్మల్ గా వెబ్ సిరీస్ అంటే ఒకేసారి సీజన్ మొత్తం రిలీజ్ చేస్తారు. కానీ ‘ఫాల్’ విషయంలో మాత్రం అలా చేయలేదు. దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా కాస్త ఆసక్తికరంగా మారింది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. అంజలికి ఇలాంటి రోల్ కొత్తేం కాదు. ఇదే డిస్నీప్లస్ హాట్ స్టార్ అక్టోబరులో రిలీజైన ‘ఝాన్సీ’ సిరీస్ లోనూ దాదాపు ఇదే తరహా పాత్ర చేసింది. గతం గుర్తులేని అమ్మాయిగా నటించింది. అదంతా పక్కనబెడితే తనపాత్రకు మాత్రం న్యాయం చేసింది. ఇక హీరోయిన్ అన్నయ్యగా ఎస్పీ చరణ్ కనిపించడం కాస్త కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు ఎస్పీబాలు కొడుకు, సింగర్ గా మాత్రమే ఆయన మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు యాక్టర్ గా కనిపించి సర్ ప్రైజ్ చేశారు. కాస్త ప్రతినాయక లక్షణాలున్న పాత్రకు ఫెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మిగిలినవారిలో సోనియా అగర్వాల్ తో పాటు అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ అయిన సిద్ధార్థ్ రామస్వామి.. విజువల్స్ రిచ్ గా చూపించారు. అజేష్ అశోక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ పాయింట్ గా కనిపించింది. సీన్స్ లో ఎలివేట్ చేసింది. వీకెండ్ లో థియేటర్ కు ఏం వెళ్తాం. అలా సరదాగా ఓటీటీలో ఏదో ఒకటి చూసేద్దాం అనుకుంటే మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ఫాల్’ ట్రై చేయొచ్చు.
చివరిమాట: టైంపాస్ క్రైమ్ థ్రిల్లర్.. ‘ఫాల్’ వెబ్ సిరీస్!
రేటింగ్: 2/5
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)