ఈ మధ్యకాలంలో సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే యంగ్ స్టర్స్ నుండి స్టార్స్ వరకు ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా యువహీరో రాజ్ తరుణ్ కూడా డైరెక్ట్ ఓటిటి ఎంట్రీకి వెబ్ సిరీస్ తో రెడీ అయిపోయాడు. రాజ్ తరుణ్ – శివాని రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట!’. ఆద్యంతం ఎంటర్టైనింగ్ ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ఈ వెబ్ సిరీస్ తాజాగా ‘జీ 5’ లో రిలీజ్ అయ్యింది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా తమ్మడ మీడియా వారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్.. ఎలా ఉంది? దాని విశేషాలేంటో రివ్యూలో చూద్దాం!
శ్రీనివాస్ అలియాస్ శ్రీను(రాజ్ తరుణ్).. రాజమండ్రికి చెందిన నోబాల్ నారాయణ(హర్షవర్ధన్), సుశీల(ఆమని) దంపతులకు ఏకైక సంతానం. యంగ్ ఏజ్ లో ఓ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడని తండ్రి కొడతాడు. అప్పటినుండి పేరెంట్స్ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, వేరే అమ్మాయిలను చూడనని ఒట్టేస్తాడు. ఆ తర్వాత శ్రీను రెండు మూడుసార్లు వేరే అమ్మాయిలను చూస్తే.. తండ్రి నారాయణకు చిన్నపాటి ప్రమాదాలు జరుగుతాయి. దీంతో తాను ఏ అమ్మాయిని చూసినా తండ్రికి ప్రాబ్లెమ్ అవుతుందనే భయంతో అమ్మాయిలను అవాయిడ్ చేస్తుంటాడు శ్రీను. కట్ చేస్తే.. పాతికేళ్ళకు శ్రీనుకి ఓ సంబంధం కుదురుతుంది.
ఆ పెళ్లి పీటల వరకు వెళ్ళాక.. పెళ్లికూతురు వేరేవాడితో లేచిపోయేసరికి శ్రీను పెళ్లి పెటాకులు అయిపోతుంది. దీంతో శ్రీనుని ఊళ్ళో వాళ్లంతా హేళన చేస్తుంటారు. శ్రీను బాధ చూడలేక తండ్రి శ్రీనుని హైదరాబాద్ లో ఉద్యోగానికి పంపిస్తాడు. అయితే.. అప్పటికే రాజమండ్రిలో శ్రీను.. మహా(శివాని రాజశేఖర్)ని ఇష్టపడతాడు. కొద్దిరోజులకు హైదరాబాద్ లో మహా ఎదురుపడుతుంది. కానీ.. తన పెళ్లి ఆగిపోవడానికి ఆమే కారణమని తెలుసుకొని ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఆ తర్వాత మహా పెళ్లి చేసుకునే టైంలో ఆమెను లేపుకొచ్చేస్తాడు శ్రీను. అలా మహా పెళ్లి కూడా ఆగిపోతుంది. అసలు మహా పెళ్లిని శ్రీను ఎందుకు ఆపేస్తాడు? శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మహా కారణం ఎలా అయ్యింది? ఆ తర్వాత శ్రీను లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి శ్రీనుకి పెళ్లి అయ్యిందా లేదా? సిరీస్ లో చూడాల్సిందే.
సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు ‘అహ నా పెళ్ళంట’ అనే టైటిల్ వినగానే జంధ్యాల గారి సినిమానే గుర్తొస్తుంది. ఎందుకంటే.. టాలీవుడ్ లో అది క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్. ఆ తర్వాత అదే టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా మరో సినిమా వచ్చింది. అదీ మంచి కామెడీతో విజయాన్నే అందుకుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ చేసిన వెబ్ సిరీస్ కి కూడా ‘అహ నా పెళ్ళంట’ అని టైటిల్ పెట్టేసరికి.. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టైటిల్ లోనే వెబ్ సిరీస్ అంతా పెళ్లి నేపథ్యంలో సాగుతుందని ఇట్టే అర్థమవుతుంది. కాకపోతే.. అప్పటికీ, ఇప్పటికీ కాన్సెప్ట్ మారకపోయినా.. ట్రెండ్ కి తగ్గట్టుగా కథనం, ట్విస్టులలో మార్పులు జరుగుతుంటాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ లో కూడా అలాంటి మార్పులే ఆకట్టుకుంటాయి.
రాజ్ తరుణ్ గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎప్పట్లాగే తన చలాకీ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో.. క్యారెక్టర్ లో బాగా లీనమైపోయాడు. ఎలాంటి కథలనైనా సీరియస్ మోడ్ లో కాకుండా ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేస్తే వీక్షకులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అందుకే అహ నా పెళ్ళంట సిరీస్ ని కూడా ఎంటర్టైనింగ్ వేలో ట్రై చేశారు. రాజ్ తరుణ్ కి గోదావరి యాస కొట్టినపిండి అని చెప్పాలి. ఆ యాసలో, పంచులలో వెటకారం సింపుల్ గా ఆకట్టుకుంటాయి. శివాని రాజశేఖర్ కూడా డైరెక్ట్ ఓటిటి సిరీస్ చేయడం ఇదే మొదటిసారి. అయినా.. డామినేటింగ్ చేసే విధంగా క్యారెక్టర్ ని బాగా చేసింది. అయితే.. ఆమె క్యారెక్టర్ ని ఇంకా పూర్తిస్థాయిలో ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది.
కథానుగుణంగా క్యారెక్టర్స్ లో మార్పులు అనేవి మామూలే అనుకోండి. ఈ సిరీస్ లో రాజ్ తరుణ్ – శివానిల కెమిస్ట్రీ బాగుంది. శివాని క్యారెక్టర్ కి క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ యాడ్ చేశాడు దర్శకుడు. కానీ.. ఆ సన్నివేశాలు ఇంకాస్త బలంగా ఉండాలేమో అనిపిస్తుంది. ఈ సిరీస్ లో హర్షవర్ధన్.. ఆమని.. రాజ్ తరుణ్ కి తల్లిదండ్రులుగా నటించారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఎంటర్టైనింగ్ గానే ఉన్నాయి. శ్రీను అమ్మాయిలకు సైట్ కొడితే తండ్రికి గాయాలు అవ్వడం అనేది నవ్విస్తుంది. హీరో ఫ్రెండ్స్ గా రవితేజ, త్రిశూల్, రాజ్ కుమార్, దొరబాబుల కామెడీ బాగుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. ఈ క్యారెక్టర్స్ అన్నింటితో దర్శకుడు మంచి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు.
ఈ సిరీస్ లో పోసాని నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ పోషించారు. ఇప్పటివరకు తండ్రి క్యారెక్టర్స్ లో మెప్పించిన పోసాని.. ఇందులో నెగటివ్ యాంగిల్ ని ప్రెజెంట్ చేశాడు. టెక్నికల్ గా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి.. వెబ్ సిరీస్ ని వినోదాత్మకంగా మలిచాడు. సిరీస్ స్టార్టింగ్ నుండి ఎంటర్టైనింగ్ గా సాగినప్పటికీ, క్లైమాక్స్ చేరుకునే సరికి రొటీన్ గా అనిపిస్తుంది. మధ్యమధ్యలో స్క్రీన్ ప్లే, సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ, ట్విస్టులతో కవర్ చేశారు మేకర్స్. తమ్మడ మీడియా ప్రొడక్షన్ కాబట్టి, ఆ కంపెనీ వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వారు కొందరు కనిపిస్తారు. టెర్రరిజం పాయింట్ కథలో ఇమడలేదు అనిపిస్తుంది. నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ సినిమాటోగ్రఫీ, జుడా శాండీ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. మొత్తానికి ‘అహ నా పెళ్ళంట’ సిరీస్ ఎంటర్టైన్ మెంట్ కోరుకునేవారికి నచ్చుతుందని చెప్పవచ్చు.