టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్. థ్రిల్లర్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న శేష్.. ఈ ఏడాది ‘మేజర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు తనకు ఫేమ్ తెచ్చిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ‘హిట్ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరో నాని ప్రొడ్యూస్ చేసిన ‘హిట్’ మూవీకి సీక్వెల్ గా.. హిట్ 2 రూపొందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిన ఈ సినిమా తాజాగా విడుదలైంది. మరి హిట్ కి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 ఎలా ఉంది? హీరోగా అడివి శేష్ కి, ప్రొడ్యూసర్ గా నానికి ఎలాంటి ఫలితాన్ని అందించిందో రివ్యూలో చూద్దాం!
కేడి అలియాస్ కృష్ణ దేవ్(అడివి శేష్) వైజాగ్ లో చాలా కూల్ పోలీస్ ఆఫీసర్.. క్రిమినల్ కేసులను చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు. అలాంటి కృష్ణ దేవ్ ని ఒక్కసారిగా సంజన అనే అమ్మాయి మర్డర్ ఇన్సిడెంట్ షాక్ కి గురిచేస్తుంది. దీంతో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.. సంజన డెడ్ బాడీకి సంబంధించి కృష్ణ దేవ్ కి ఊహించని నిజాలు తెలుస్తాయి. కట్ చేస్తే.. సంజన మర్డర్ వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుసుకుంటాడు. మరి సంజనని అతి కిరాతకంగా చంపిన ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? సంజన కేస్ లో కృష్ణ దేవ్ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు? అసలు ఆ సీరియల్ కిల్లర్ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
సాధారణంగా రెగ్యులర్ మాస్, క్లాస్ కమర్షియల్ సినిమాలకంటే థ్రిల్లర్ సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ డ్రామాలు కాకుండా సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ ఇన్వెస్టిగేషన్ సినిమాలు జనాలకు ఎక్కువగా థ్రిల్ చేస్తుంటాయి. టాలీవుడ్ లో ఎక్కువగా థ్రిల్లర్ టైప్ సినిమాలు చేసే హీరో అడివి శేష్. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2 చేసేసరికి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. 2020లో విశ్వక్ సేన్ హీరోగా విడుదలైన హిట్ మూవీకి.. ఇప్పుడీ హిట్ 2 మూవీ సీక్వెల్ గా వచ్చింది. అయితే.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపించుకున్న హిట్ మూవీకి సీక్వెల్ అంటే.. డైరెక్టర్ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వాల్సి ఉంటుంది.
సినిమా విషయానికి వస్తే.. వైజాగ్ ఎస్పీ కృష్ణదేవ్(అడివి శేష్) క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. చాలా కూల్ గా ఎలాంటి కేసులైనా ఈజీగా సాల్వ్ చేసేస్తాడని చెబుతూ.. హీరో క్యారెక్టరైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు. వెంటనే హీరోకి ఓ హీరోయిన్ ఉండాలిగా.. ఆధ్య(మీనాక్షి చౌదరి)ని కృష్ణదేవ్ ప్రేయసిగా పరిచయం చేస్తాడు. కట్ చేస్తే.. వైజాగ్ లో ఎవరు ఊహించని రీతిలో సంజన అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ కేస్ ని టేకోవర్ చేసిన కృష్ణదేవ్ కి.. సంజన హత్య, హంతకుడికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అక్కడి నుండి హిట్ 2 అసలు కథ స్టార్ట్ అవుతుంది.
ప్రారంభం స్లోగానే అయినప్పటికీ.. సినిమా ముందుకు వెళ్తున్నాకొద్దీ స్క్రీన్ ప్లేలో వేగం పెరుగుతూ పోయింది. మొదటి పది నిముషాలకే సంజన డెడ్ బాడీతో షాకిచ్చిన డైరెక్టర్.. ఒక్కో పాయింట్ ని చాలా థ్రిల్లింగ్ గా అల్లుకుంటూ సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అలాగే కృష్ణదేవ్ ఇన్వెస్టిగేషన్.. అందులో ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని.. సాక్ష్యాధారాలు ఏవి మిగిలించకుండా మర్డర్స్ చేస్తుండటం.. లాంటి అంశాలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి. బట్ థ్రిల్లర్స్ లో ఎక్కువగా కనిపించే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇందులో కూడా మేజర్ పార్ట్ ఉంటుంది. బట్ డైరెక్టర్ ఎంత ఎంగేజింగ్ గా సినిమాను ప్రెజెంట్ చేశాడు అనేది మెయిన్ పాయింట్.
సో.. డైరెక్టర్ స్క్రీన్ ప్లేని ఎంగేజింగ్ గా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రమోషన్స్ లో చెప్పినట్లుగానే నెక్స్ట్ హిట్ 3లో హీరో ఎవరనేది క్లైమాక్స్ లో రివీల్ చేశారు. ఇక సెకండాఫ్ లో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ.. ఈ స్క్రిప్ట్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. డైరెక్టర్ కొన్ని పాయింట్స్ కావాలని వదిలేసాడేమో.. క్లైమాక్స్ వరకూ సీరియల్ కిల్లర్ కోసం ఇన్వెస్టిగేషన్.. ఆ కిల్లర్ ఎవరో రివీల్ చేసే సీక్వెన్స్ చాలా థ్రిల్లింగ్ గా ప్రెజెంట్ చేశారు. కానీ.. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు.. అనే సామెత క్లైమాక్స్ లో అందరికీ గుర్తుచేశాడు డైరెక్టర్. మొత్తానికి.. ఈ సినిమా వరకూ సీరియల్ కిల్లర్ ని ఎండ్ చేస్తూనే.. మరో కొత్త అధ్యాయానికి తెరలేపారు.
ఇక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్.. వెస్ట్రన్ కల్చర్ ని ప్రమోట్ చేసినట్టు అనిపించింది. కృష్ణదేవ్ క్యారెక్టర్ లో అడివి శేష్ మరోసారి తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. ఎమోషన్స్ తో పాటు సీరియస్ ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్.. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మేజర్ హైలైట్స్. కథ పరంగా కొత్తది కానప్పటికీ, స్క్రీన్ ప్లేలో కొత్త టచ్ ఇచ్చి డైరెక్టర్ శైలేష్ ఇంప్రెస్ చేయగలిగాడు. సినిమాటోగ్రాఫర్ మణికందన్ వర్క్.. ముఖ్యంగా లైటింగ్ కథలో లీనమయ్యేలా చేస్తుంది. స్టీవర్ట్ ఏడూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి మేజర్ ప్లస్.
సినిమాలో మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కథకు అనుగుణంగా ఉన్నాయి. కానీ.. కొన్ని క్యారెక్టర్స్ కి సరైన ముగింపు ఇవ్వలేదేమో అనిపిస్తుంది. పోసాని, తనికెళ్ళ భరణి, కోమలి ప్రసాద్, సుహాస్ ఇలా అందరూ తమ క్యారెక్టర్స్ మేరకు న్యాయం. చేశారు. ఇక్కడ ట్విస్టులు ఏంటంటే.. హిట్ మూవీకి, హిట్ 2 స్టోరీకి డైరెక్టర్ లింక్ చేసిన విధానం మైండ్ బ్లాక్ చేస్తుంది. ఓరల్ గా అడివి శేష్ – శైలేష్ కొలను హిట్ 2తో.. హిట్ వర్స్ కి సరైన కొనసాగింపు ఇచ్చారని చెప్పవచ్చు.
చివరిమాట: హిట్ 2.. ట్విస్టులతో థ్రిల్ చేస్తుంది!