బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన '2018' తెలుగులోనూ రిలీజైపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చదివేయండి.
రీసెంట్ టైంలో ఓ డబ్బింగ్ మూవీ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారంటే అది ‘2018’ గురించే. కేరళలో ఆ ఏడాది వరదలొచ్చాయి. అప్పుడు జరిగిన కొన్ని యదార్థ సంఘటనల్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. మలయాళంలోని స్టార్ నటీనటులు చాలామంది ఇందులో లీడ్ రోల్స్ చేయడం, ‘2018’ గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణమైంది. మరి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయి సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిన ఈ సినిమాలో అంతలా ఏముంది? నిజంగా అంత బాగుందా? అనేది తెలియాలంటే ఈ రివ్యూలో చదివేయాల్సిందే.
కేరళలోని అరువిక్కుళం అనే ఊరు. ఆర్మీలో చేరి, భయంతో ఊరికి తిరిగొచ్చేసిన అనూప్ (టొవినో థామస్) దుబాయి వెళ్లే ప్రయత్నాలు ఉంటాడు. మత్స్యకార కుటుంబానికి చెందిన నిక్సన్ (అసిఫ్ అలీ).. పెద్ద మోడల్ కావాలని అనుకుంటూ ఉంటాడు. టూరిస్ట్ లు అందరికీ తలలో నాలుకలా ఉంటూ కుటుంబాన్ని పోషించే ట్యాక్సీ డ్రైవర్ కోషి (అజు వర్గీస్). కేరళ బోర్డర్ లో తమిళనాడులోని ఓ గ్రామానికి చెందిన సేతు (కలైయారసన్), ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ చేసే అధికారి (కుంచకో బోబన్). న్యూస్ ఛానెల్ హెడ్ గా ఉండే ఆమె (అపర్ణ బాలమురళి). ఇలా ఎవరికి వారు జీవిస్తుంటారు. వీళ్లందరి లైఫ్.. 2018 వరదల వల్ల ఎలా ఎఫెక్ట్ అయిందనేదే ‘2018’ స్టోరీ.
సినిమాలు చూసి, అందులో ఆర్మీ పోరాటం లాంటివి చూసి ఆవేశంలో ఓ కుర్రాడు ఆర్మీలో జాయిన్ అయిపోతాడు. తన కళ్ల ముందే ఇద్దరు జవాన్లు చనిపోవడాన్ని దగ్గర నుంచి చూస్తాడు. తెగ భయపడిపోతాడు. తట్టాబుట్టా సర్దుకుని సొంతూరికి వచ్చేస్తాడు. దీంతో ప్రతిఒక్కరూ అతడిని ట్రోల్ చేస్తారు. అలాంటోడు సొంతూళ్లో వరదలు వచ్చేసరికి తెగిస్తాడు. తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఇతరుల్ని కాపాడుతాడు. ఇదంతా వినగానే మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. దీన్ని స్క్రీన్ పై చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ ఫీలింగ్ వస్తుంది. ఇదొక్కటే కాదు చాలా అంటే చాలా విషయాల్లో ‘2018’ మూవీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. టఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ (ప్రతి ఒక్కరూ హీరోనే) అనే ట్యాగ్ లైన్ కి పూర్తి న్యాయం చేసింది.
ఫస్టాప్ విషయానికొస్తే కథని, అందులో పాత్రలని ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం ప్రయారిటీ ఇచ్చారు. మరోవైపు వరదలు, వర్షాలను కూడా చూపించారు. లీడ్ రోల్స్ మధ్య రిలేషన్స్, ఎమోషన్స్ అనేవి ఇంటెన్స్ గా మారుతుంటే.. మరోవైపు వర్షాలు తీవ్రమవుతుంటాయి. ఫెను తుపానులా మారుతుంటాయి. సరదా సరదా సీన్స్ నుంచి సీరియస్ సీన్స్ కి వెళ్లారు. అయితే డీటైలింగ్ ఇస్తూ పోవడం, ఏ పాత్ర ఎవరిది అనే అర్థం చేసుకునే క్రమంలో కాస్త కన్ఫ్యూజన్ వల్ల ఫస్టాప్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఇక అక్కడ నుంచి స్టోరీ టాప్ గేర్ తీసుకుంటుంది. ఐదు ప్రధాన పాత్రల జీవితాలు, వరదలకు వాళ్లతో లింక్ చేసిన తీరు అయితే నెక్స్ట్ లెవల్ అనిపిస్తుంది. సినిమాలో ఉన్నోడు లేనోడు అని ఎవరూ ఉండరు. వరదలు పెరిగాక అందరి పరిస్థితి దాదాపు ఒక్కటే. ఇల్లు, పని లాంటిది ఏం ఉండదు. చేయాల్సిందల్లా ప్రాణాలు కాపాడుకోవడమే. చివరకు అందరూ ఈ విపత్కర ప్రళయం నుంచి ఎలా బయటపడ్డారు? ఏం జరిగింది అనేది సినిమా.
ఈ సినిమా పేరుకే డబ్బింగ్ సినిమా. ఒక్కసారి చూడటం మొదలుపెడితే ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే ప్రతి పాత్ర, ప్రతి సీన్ లోనూ ఎమోషన్స్ ఉంటాయి. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రిలేషన్స్ గొప్పతనాన్ని డైరెక్టర్ చూపించిన తీరు అయితే అద్భుతం. ప్రతి సీన్ లో ఏదో కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. సీన్ బై సీన్ వెళ్తూ.. క్లైమాక్స్ వచ్చేసరికి మన గుండె బరువెక్కుతుంది. చెప్పాలంటే ఆ వరదలో మనం కూడా చిక్కుకుపోయామా అనిపిస్తుంది. లాస్ట్ అరగంట అయితే మనల్ని మనమే మర్చిపోయి సినిమాలో లీనమైపోతాం. అంత బాగా తీశారు. అయితే కొన్ని కొన్ని సీన్లలో మెలోడ్రామా కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. చిన్న చిన్న విషయాలకు అంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. కానీ మొత్తం సినిమాలో అదేం పెద్ద సమస్యగా మాత్రం అనిపించదు. ఇది మా గ్యారంటీ.
సాధారణంగా సినిమాలో హీరో ఒక్కడే ఉంటాడు. కానీ ‘2018’లో మాత్రం ప్రతి పాత్ర హీరోనే. ట్యాగ్ లైన్ కి పూర్తి న్యాయం చేశారు. అయితే టొవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, లాల్, కలైయారసన్, అజు వర్గీస్.. ఇలా ప్రతిఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. దాదాపు ఐదేళ్ల క్రితం టీవీల్లో చూసి అయ్యో రామా అనుకున్నవాళ్లని కూడా మరోసారి అలా అనుకునేలా చేశారు. ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసిన వాళ్లకు ఇందులో యాక్టర్స్ అందరూ దాదాపుగా తెలుసు. నార్మల్ ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మాత్రం తెలుగువాళ్లకు తెలిసిన ముఖాలు చాలా తక్కువ. అయినా అదే పెద్ద మేటర్ కాదులేండి!
సినిమా ఓ దృశ్యకావ్యం అని చెబుతుంటారు కదా ‘2018’ దానికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.నోబిన్ పాల్ అందించిన మ్యూజిక్ అయితే ప్రతి సీన్ లో ఎలివేట్ చేసింది. సినిమాలో మనం లీనమయ్యేందుకు కారణమైంది. అఖిల్ జార్జ్.. తన సినిమాటోగ్రఫీతో కేరళలో 2018లో సంభవించిన వరదల్ని మరోసారి మన కళ్లకు కట్టినట్లు చూపించారు. నెక్స్ట్ లెవల్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. ఇక డైరెక్టర్ ఆంటోని జూడ్ జోసెఫ్.. దర్శకుడిగా కంటే కథకుడిగానే ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఎందుకంటే ఓ సినిమాని ఎంత బాగా తీయొచ్చో రియాలిటీలో ప్రూవ్ చేశారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. అందుకే ‘2018’ సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని ఎప్పుడో దాటేసింది. ఓవరాల్ గా చెప్పుకుంటే సర్వైవల్ డ్రామా టైపు మూవీస్ అంటే మీకు ఇష్టమా? లేటు చేయకుండా దీన్ని చూసేయండి. థియేటర్ లో చూస్తే మీకు మంచి కిక్ వస్తుంది.
చివరగా: ‘2018’.. ఎమోషనల్ సునామీ!
రేటింగ్: 3