
తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఇటీవల మరణించడంతో ఇప్పుడు అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. ముఖ్యంగా తెరాసేతర పార్టీలు దుబ్బాక నియోజవర్గం ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రజల్లో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే వ్యూహాలను రచిస్తున్నారు స్థానిక నేతలు.
కాగా తెలంగాణలో తన ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నికను ఉపయోగించుకోవాలని ప్రయత్ని్స్తోంది. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎవరిని దింపాలా అనే ఆలోచనలో పడిందట. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మంత్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు అక్కడ ఎవరిని బరిలోకి దించాలా అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. అయితే గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పోటీ చేసిన ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఉరఫ్ విజయశాంతిని దుబ్బాక నియోజకవర్గం నుండి పోటిలో నిలబెట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.
దుబ్బాక ప్రజల కష్టాలను తెలుసుకుని, అధికార పార్టీ అక్రమాలను ఎండగట్టడంలో విజయశాంతి తనదైన ముద్ర వేసుకోగలదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయశాంతిని దాదాపు ఫైనల్ చేసిందట అధిష్టానం. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుఫున రఘునందన్ రావు పోటీ చేస్తారని, టీఆర్ఎస్ తరఫున సోలిపేట కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ నిపుణుల అంటున్నారు. ఒకవేళ ఇక్కడ విజయశాంతి గనక విజయం సాధిస్తే, కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోసినట్లు అవుతుంది.