
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో, ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అక్కడి అధికారులు రెడీ అయ్యారు. ఇక ఈ పరిణామం కేవలం ఆంధ్రలో మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణపై కూడా ప్రభావం చూపుతోంది.
ఏపీకి 3 రాజధానులు ఉన్నప్పుడు తెలంగాణకు 2 రాజధానులు ఉండాలా? అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ నాయకుల్లో తీవ్రంగా జరుగుతోంది. అయితే ఈ అంశానికి తెరలేపారు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంత్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా జగన్ లాగా ఆలోచిస్తున్నారని, అందుకే ఆయన తెలంగాణలో రెండు రాజధానుల ఏర్పాటు దిశగా వ్యూహాలు రచిస్తున్నారని హనుమంత్ రావు ఆరోపించారు. తెలంగాణలో ఇతర జిల్లాలపై లేని శ్రద్ధ కేసీఆర్‌కు కేవలం కరీంనగర్‌పై మాత్రమే ఎందుకు ఉందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్‌ను రెండో రాజధానిగా కేసీఆర్ ప్రకటించాలని ఎప్పటినుండో చూస్తున్నాడని, అందుకే ఆయన ఆ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడని విహెచ్ అంటున్నారు.
కాగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కూడా ఈ రెండు రాజధానల అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేశారని, దళిత ముఖ్యమంత్రి వాగ్ధానాన్ని ఆయన విస్మరంచారని, అందుకే తెలంగాణ ప్రజలు ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతారని మందకృష్ణ మాదిగ అన్నారు. అటు రెండు రాజధానుల విధానం రాష్ట్రానికి ఉపయోగకరమైన విషయమని ఆయన అంటున్నారు. అయితే తమ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ జిల్లాను శాసనసభ రాజధానిగా ప్రకటిస్తామని మందకృష్ణ మాదిగ అంటున్నారు.
అంటే పక్క రాష్ట్రం మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుంటుందని, మనం కూడా రెండు రాజధానులు ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని పలువురు రాజకీయ నేతలను ప్రశ్నిస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందాన ఈ వ్యవహారం కనిపిస్తుందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరే ఇతర ప్రాంతం కూడా రాజధానిగా ప్రకటించే విధంగా అభివృద్ధి కాలేదని, ఇలాంటి ఆలోచనతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని పలువురు సూచిస్తున్నారు.