
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, కోర్టులు ఎన్ని కఠిన చట్టాలు చేసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ కేసు దగ్గర్నుండీ తెలంగాణలో దిశా కేసు వరకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కడో ఒకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసిన ఓ అత్యాచారం కేసు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ మహిళ తనపై ఏకంగా 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేసింది.
మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి తనకు పరిచయం ఉన్న వ్యక్తులందరూ తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో సినీ పరిశ్రమకు చెందినవారితో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఈ మేరకు 113 పేజీలతో కూడిన ఫిర్యాదును ఆమె పంజాగుట్ట పోలీసులకు అందించింది. దీంతో పోలీసులు ఆ 139 మందిపై నిర్భయ కేసును నమోదు చేశారు.
ఇంతమంది ఆ మహిళపై అత్యాచారం చేశారనడంతో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకాలం తనకు జరిగిన అన్యాయాన్ని ఆ మహిళ ఎందుకు బయటపెట్టలేదనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ కేసులో నిజానిజాలు ఏమిటనేవి కూడా తేల్చి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు అంటున్నారు.