
విధి వెక్కిరించింది. కాలం చిన్నచూపు చూసింది. దీంతో తల్లిదండ్రుల చేతుల్లో అల్లారుముద్దుగా పెరగాల్సిన వారి బాల్యం ప్రశ్నార్ధకంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ కుటుంబంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఇది మీడియా ద్వారా కలియుగ కర్ణుడు సోనూసూద్ కంట పడింది. అంతే వెంటనే స్పందించాడు. కొవిడ్ సమయంలో ఆపద్భాంధువుడిగా మారిన నటుడు సోనూ ……మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథులుగా మారిన ముగ్గురు తోబుట్టువుల బాధ్యతను భుజానికెత్తుకున్నాడు.
నేనున్నానంటూ అభయ మిచ్చి వారి జీవితాల్లో కొత్త కాంతులు తెచ్చాడు. భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు పిల్లల జీవితం ప్రతీఒక్కర్నీ ఆవేదకు గురి చేస్తోంది. తండ్రి ఏడాది కిందటే చనిపోయాడు. తల్లి అనారోగ్యంతో ఇటీవల చనిపోయింది. దీంతో వీళ్లు దిక్కులేనివారయ్యారు. బంధువులు దగ్గరకు తీసుకోలేదు. ఇరుగుపొరుగు వారు పాపమని జాలిపడ్డారే కానీ..ఆపన్న హస్తం ఇవ్వలేదు. కనీసం పట్టెడు అన్నం కూడా పెట్టలేదు. దీంతో వారి భవితవ్యం అంధకారంలో పడినట్టైంది. పెద్దవాడే చెల్లిని, తమ్ముడిని చూసుకుంటున్నాడు.
వాళ్లకు చిన్న వయసులోనే అమ్మనాన్నగా మారి….మోయలేని అంత భారాన్ని భరిస్తున్నాడు. చిన్నారుల దుస్థితి మీడియా కంట పడింది. దీంతో కొన్ని టీవీ ఛానల్స్ వారి పరిస్థితిపై వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో విషయం చాలా మందికి తెలిసింది. కానీ అందరూ స్పందించలేదు. కొందరు మాత్రమే స్పందించారు. వారిలో అందరి కంటే ముందు సోనూసూద్. ఆ ముగ్గురు ఇకమీద అనాధులు కారని…వారి బాధ్యత తనది అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. వెంటనే తన ప్రతినిధి బృందం ద్వారా చిన్నారులను కలిసే ప్రయత్నం చేశాడు.
త్వరలోనే వారి బాగోగులు చూసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాడు. ఎందుకంటే సోనూసూద్ ఇప్పటికే వేలాది మందికి సాయం చేశారు. వలస కార్మికులకు అండదండగా ఉండటంతో పాటు …రైతు నాగేశ్వరరావు కుటుంబానికి ట్రాక్టర్..85 ఏళ్ల బామ్మతో ఉమెన్ సెల్ఫ ప్రొటక్షన్ సెంటర్ పెట్టించాడు. సో సోనూసూద్ హామీ ఇచ్చాడంటే…వాళ్ల లైఫ్ సెటిల్ అయినట్టే. ఇక ఈ ముగ్గురు పిల్లల భవిష్యత్ కూడా దారిలో పడినట్టే. చిన్నారుల దుస్థితిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పిల్లల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా….చిన్నారుల చదువు, జీవన బాధ్యత తనదేనని ప్రకటించారు. తక్షణ సాయం కింద వాళ్లకు 50 వేల రూపాయలను పంపించారు. మొత్తానికి చిన్నారుల జీవితం అయితే ఒకదరికి వచ్చినట్టే. ప్రముఖలు పలువురు ముందుకు రావడంతో …ఇక వారి భవిష్యత్‌పై ఎలాంటి సందేహాలు ఉండవు.