
తెలంగాణలో ఇటీవల అవినీతికి పాల్పడుతున్న అధికారులను ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని కీసర ఎమ్మార్వో నాగరాజు రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. ఇక ఈ క్రమంలోనే నాగరాజు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడా అనే విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా ఇంత భారీ అవినీతి అధికారిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చాలంటూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు గిన్నిస్ బుక్ సంస్థను కోరారు. అయితే ఈ విషయంపై గిన్నిస్ బుక్ అధికారులు స్పందించారు. ఇలాంటి అంశాలు తమ దృష్టికి రాలేదని, అవినీతి ప్రభుత్వ అధికారులకు సంబంధించిన కేటగిరి గిన్నిస్ బుక్‌లో లేదని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఓ భూమికి పట్టా చేసేందుకు రూ.2 కోట్ల భారీ లంచం అడిగిన ఎమ్మార్వో నాగరాజు, రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే.
మరి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకున్న నాగరాజుకు ఎలాంటి శిక్ష పడుతుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా నాగరాజు నిజంగానే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కుతాడా అని వారు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.