
తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు. పలు రంగాలకు చెందిన వ్యక్తులు తనపై గతకొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ సదరు మహిళ పోలీసు కేసు పెట్టడంతో అవాక్కయిన పోలీసులు, ఇప్పుడు ఆ కేసును చేధించే దిశగా ముందుకు వెళ్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ కేసులో నిందితులుగా ఉన్న 139 మందిని విచారించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే ఈ కేసులోని నిజానిజాలను బట్టబయలు చేసేందుకే ఈ కేసును సీసీఎస్కు అప్పగించారు. కాగా తాజాగా ఈ బాధ్యతను ఏసీపీ శ్రీదేవికి అప్పగించారు. దీంతో ఈ కేసులో ముందడుగు పడినట్లు అయ్యిందని పలువురు అంటున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆ మహిళ ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ఆధారాల ఆధారంగా విచారణ చేపట్టబోతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రముఖ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడని, అతడు తనను పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో పులువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.