లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. వైసీపీ టికెట్‌పై రెండోసారి నగరి శాసన సభ్యురాలిగా గెలుపొందిన రోజాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మంత్రి పదవి కేటాయించడం ఖాయమని అందరూ భావించినా అది జరగలేదు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా రెండున్నరేళ్ల తరువాత జరగనున్న మంత్రివర్గ విస్తరణలో రోజాకు ప్లేస్ కన్ఫామ్ అంటూ ఆ పార్టీవర్గాలు చెప్పుకొస్తున్నాయి.
అయితే, ఎమ్మెల్యే రోజా మంత్రి ఎప్పటిలానే తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన రోజా, పాఠశాల అభివృద్ధికి కావాల్సిన సౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కాసేపు పంతులమ్మ అవతారమెత్తారు. కలలు కనండి.. సాకారం చేసుకోండి అంటూ బోర్డుపై రాయడమే కాకుండా, అందులోని భావాన్ని విద్యార్థులకు అర్ధమయ్యేలా విపులంగా వివరించారు. పెద్ద లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని చేరుకునేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. కేవలం డాక్టర్, కలెక్టర్‌గానే కాకుండా పొలిటీసియన్, యాక్టర్‌గా కూడా లక్ష్యాలను పెట్టుకోవచ్చని, ఆ దిశగా పయనిస్తే విజయాలు సాధిస్తారని రోజా అన్నారు. చట్టాలను అమలు చేసే స్థాయికి మరింత మంది మహిళలు రావాలని తాను ఆశిస్తున్నానన్నారు.