
భారతదేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ చరిష్మా మొదలైనప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా కూడా ప్రజల్లో తన అస్తత్వాన్ని కోల్పోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ముసలం కారణంగా ఆ పార్టీ నేతల్లో చీలకలు ఏర్పడ్డాయి. అయితే జాతీయంగా పార్టీని బలోపేతం చేయడంలోనూ అధ్యక్ష పదవిని సక్రమంగా నిర్వహించలేకపోయాడు రాహుల్ గాంధీ. దీంతో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడంతో ఆ పదవిని తాము చేపడతామని చాలా మంది హడావుడి చేశారు. కానీ గాంధీ కుటుంబానికి చెందినవారు అయితేనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బాగుంటారని పలువురు తెలపడంతో, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీ తన బాధ్యతలు చేపడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ పదవికి ఆమె రాజీనామా చేయనుంది. దీంతో మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయం చర్చనీయాంశంగా మారింది. తనకు కాంగ్రెస్ ఛీప్‌గా కొనసాగడం ఇష్టం లేదని రాహుల్ ఇటీవల తేల్చడంతో, ఇప్పుడు ఆ పదవిని ఎవరికి అప్పజెప్పుతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
సోనియా గాంధీకి ఆరోగ్యం సహకరించకపోవడం, రాహుల్‌కు అధ్యక్ష పదవిని చేపట్టడం ఇష్టం లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారా.. ఎవరు పార్టీని విజయంవైపు తీసుకెళ్తారు అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అయితే గాంధీ కుటుంబ సభ్యులకే కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలను అప్పగించాలనే వాదన ఎక్కువగా వినిపిస్తుండటంతో, నేడు జరిగే CWC మీటింగ్‌లో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.