
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు పూర్తి లాక్డౌన్ను విధించాయి. కాగా ఈ లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా చిరుద్యోగుల ఈ లాక్డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయారు. దీంతో వారి బ్రతుకులు చాలా దుర్భరంగా మారాయి. అయితే అలాంటి వారిని ఆదుకునేందుకు భారత ప్రభుత్వం ముందుకొచ్చింది.
కరోనా సమయంలో ఉపాధిని కోల్పోయిన చిరుద్యోగులను ఆదుకునేందుకు వారి సగటు వేతనంలో 50 శాతం భృతిని కల్పించనున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ నేతృత్వంలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ) బోర్డు ఈ మేరకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈఎస్ఐసీలో సభ్యులుగా ఉన్న వారికి ఇది వర్తిస్తుందని వారు తెలిపారు. దీంతో దేశంలోని 41 లక్షల మంది కార్మికులు లబ్ధి పొందుతారని ఆయన అన్నారు.
ఈ ఏడాది మార్చి 24 నుండి డిసెంబర్ 31 వరకు ఉపాధి కోల్పోయినవారు ఈ ఆర్థిక సాయాన్ని అందుకోవచ్చు. రూ.21 వేలలోపు వేతనంతో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఈఎస్ఐసీలో లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రకటించిన ఈ ఆర్ధిక సాయంతో చిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా తమ బ్రతుకులు రోడ్డుపాలయ్యాయని, ఇకనైనా తమకు ఉపాధిని చూపించాలని వారు కోరుతున్నారు.