
అమ్మాయిలకు పెద్ద చదువులు ఎందుకు అనే వాదన ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేదలు, గిరిజనులు ఈ విధంగా ఆలోచిస్తూ తమ ఆడపిల్లలను టెన్త్ వరకు చదివించి ఇంటిపట్టునే ఉండేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టి, అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించేలా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు పథకాలను అమలు చేస్తూ వస్తున్నాయి.
అయినా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇందులో అస్సోం రాష్ట్రం కూడా ఒకటి. అక్కడి అమ్మాయిలను టెన్త్ చదివించడమే గొప్ప అనే భావనలో ప్రజలు ఉన్నారు. అలాంటి వారికి కనువిప్పు కలిగేలా చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు పద్ధతులను అవలంబిస్తోంది. అయితే అక్కడి అమ్మాయిల్లో కూడా ఉన్నత చదువులపై ఆసక్తిని పెంపొందించేలా ఓ వినూత్న ఆలోచనకు తెరలేపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అస్సోం రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఫస్ట్ డివిజన్లో పాసయ్యే అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలను అందించనుంది అక్కడి ప్రభుత్వం.
‘ప్రజ్ఞ్యాన్ భారతి’ అనే పథకంలో భాగంగా ఈ ఉచిత స్కూటీలు అందించేందుకు అస్సోం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. స్కోటీలు పొందాలనుకునే వారు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పించాని అధికారులు సూచించారు. ఇక ఈ స్కూటీలు పొందిన వారు మూడేళ్ల వరకు వాటిని అమ్మకుండా కండీషన్ పెట్టింది. కాగా అక్టోబర్ 15 నాటికి రాష్ట్రంలో స్కూటీల పంపిణీ పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి ఇంటర్ పాసై స్కూటీలు అందుకునే వారు అక్కడ ఎంత మంది ఉన్నారో చూడాలి.